


Best Web Hosting Provider In India 2024
Gongadi Trisha: ఐసీసీ అవార్డుకు తెలుగమ్మాయి గొంగడి త్రిష నామినేట్.. ఇద్దరితో పోటీ
Gongadi Trisha: అండర్-19 టీ20 ప్రపంచకప్‍లో అద్భుత ప్రదర్శన చేసిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ఐసీసీ అవార్డుకు నామినేట్ అయ్యారు. ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో నిలిచారు. ఇద్దరు ఇంటర్నేషనల్ స్టార్ ప్లేయర్లు కూడా పోటీలో ఉన్నారు.
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‍లో తెలుగమ్మాయి, టీమిండియా బ్యాటర్ త్రిష గొంగడి అదరగొట్టారు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచి భారత్ మళ్లీ టైటిల్ గెలువడంతో కీలకపాత్ర పోషించారు. కొన్ని రికార్డులను సృష్టించారు. ప్రపంచకప్‍లో రాణించిన త్రిష తాజాగా ఐసీసీ అవార్డు రేసులో నిలిచారు. జనవరి నెలకు గాను ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు త్రిష నామినేట్ అయ్యారు. మరో ఇద్దరు కూడా రేసులో ఉన్నారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఆల్‍రౌండ్ షోతో అదరొట్టిన త్రిష.. ఓ రికార్డు
మహిళల అండర్-19 ప్రపంచకప్‍లో భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష ఆరంభం నుంచి రాణించారు. ఆల్‍రౌండ్ షో చేశారు. ప్రపంచకప్‍లో 7 మ్యాచ్‍ల్లో 309 రన్స్ చేశారు త్రిష. స్కాట్లాండ్‍తో మ్యాచ్‍లో సెంచరీ సాధించారు. మహిళల అండర్-19 ప్రపంచకప్‍తో శతకం చేసిన తొలి బ్యాటర్‌గా త్రిష చరిత్ర సృష్టించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‍లో 44 పరుగులతో నాటౌట్‍గా నిలిచారు. జట్టును గెలిపించారు. అదే మ్యాచ్‍లో మూడు వికెట్లను కూడా పడగొట్టారు. మొత్తంగా ఈ టోర్నీలో ఏడు వికెట్లు సొంతం చేసుకున్నారు. త్రిషకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. ఫైనల్‍లో ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు కూడా ఆమెకే కైవసం అయింది. అంతలా ఈ టోర్నీలో త్రిష అదరగొట్టారు.
దీంతో జనవరి నెలకు గాను మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు గొంగడి త్రిషను నామినేట్ చేసింది ఐసీసీ. ఆస్ట్రేలియా సీనియర్ స్టార్ బ్యాటర్ బెత్ మూనీ, వెస్టిండీస్ ప్లేయర్ కరిష్మా రామ్‍హరక్ కూడా ఈ అవార్డు రేసులో ఉన్నారు.
ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍లో మూనీ రాణించారు. ఈ సిరీస్‍లో మూడు మ్యాచ్‍ల్లో 213 పరుగులతో అదరగొట్టారు. సిరీస్ మొదటి, చివరి టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. 3-0తో ఆసీస్ సిరీస్ గెలువడంలో కీలకపాత్ర ఆమెదే. జనవరిలో మూడు వన్డేల్లో 90 పరుగులు చేశారు బెత్ మూనీ. టీ20 సిరీస్‍లో అదగొట్టడంతో ఐసీసీ అవార్డుకు నామినేట్ అయ్యారు.
బంగ్లాదేశ్‍తో వన్డే సిరీస్‍లో వెస్టిండీస్ బౌలర్ రామ్‍హరక్ దుమ్మురేపారు. మూడు వన్డేల్లో ఎనిమిది వికెట్లు తీశారు. ఈ సిరీస్‍లో విండీస్ 2-1తో గెలిచింది.
కాగా, టీ20 ప్రపంచకప్‍లో అద్భుత ప్రదర్శన చేసిన గొంగడి త్రిషకు రూ.కోటి నజరానా అందించింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రూ.10లక్షలు ప్రకటించింది.
పురుషుల విభాగంలో వరుణ్ చక్రవర్తి
పురుషుల విభాగంలో జనవరికి గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నిలిచాడు. ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍లో 14 వికెట్లతో వరుణ్ రాణించాడు. భారత్ 4-1తో సిరీస్ గెలువడంలో వరుణ్ పాత్ర కీలకం. వరుణ్ బంతులను అర్థం చేసుకోలేక ఇంగ్లండ్ బ్యాటర్లు తంటాలు పడ్డారు. వెస్టిండీస్ స్పిన్నర్ జోమెల్ వారికన్, పాకిస్థాన్ బౌలర్ నోమన్ అలీ కూడా ఈ అవార్డు రేసులో నిలిచారు. త్వరలోనే విజేతలను ఐసీసీ ఖరారు చేస్తుంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link