


Best Web Hosting Provider In India 2024
IND vs ENG 5th T20: ఇంగ్లండ్‍ను కూల్చేసిన భారత్.. భారీ గెలుపుతో రికార్డు.. మెరుపు శతకం సహా బౌలింగ్‍లోనూ అభిషేక్ అదుర్స్
IND vs ENG 5th T20: ఐదో టీ20లో ఇంగ్లండ్‍ను చిత్తుచిత్తుగా ఓడించింది భారత్. భారీ తేడాతో ఘన విజయం సాధించింది. సెంచరీ హీరో అభిషేక్ శర్మ బంతితోనూ మెరిశాడు. ఆల్‍రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అదరగొట్టింది.
ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍లో చివరి మ్యాచ్‍లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ముందు బ్యాటింగ్‍లో చితక్కొట్టిన టీమిండియా.. బౌలింగ్‍లోనూ చెలరేగింది. భారీ విజయాన్ని దక్కించుకుంది. 4-1తో ఐదు టీ20ల సిరీస్‍ను కైవసం చేసుకొని సత్తాచాటింది సూర్యకుమార్ సేన. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో నేడు (ఫిబ్రవరి 2) జరిగిన ఐదో టీ20లో భారత్ ఏకంగా 150 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్‍ను కుప్పకూల్చేసి ఘనంగా గెలిచింది. ఎలా సాగిందో ఇక్కడ చూడండి.
భారత బౌలర్ల విజృంభణ.. ఇంగ్లండ్ చిత్తు
248 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ కుప్పకూలిపోయింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి దమ్మురేపేశారు. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ 3 వికెట్లతో అదరగొట్టాడు. మెరుపు సెంచరీతో దుమ్మురేపిన అభిషేక్ శర్మ బంతితోనూ రాణించాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. శివమ్ దూబే కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్‍కు ఓ వికెట్ దక్కింది. భారత బౌలర్ల విజృంభణతో ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో కేవలం 97 పరుగులకే ఆలౌటైంది.
సాల్ట్ పోరాటం.. 9 మంది సింగిల్ డిజిట్
టీమిండియా బౌలింగ్ ధాటికి 9 మంది ఇంగ్లండ్ బ్యాటర్లుసింగిల్ డిజిట్‍కే పరిమితం అయ్యారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 57 పరుగులు; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, బెన్ డకెట్ (0), జోస్ బట్లర్ (7), హ్యారీ బ్రూక్ (2), లివింగ్‍స్టోన్ (9) పెవిలియన్‍కు క్యూ కట్టారు. భారీ లక్ష్యం ముంగిట భారత బౌలింగ్‍ను అడ్డుకోలేక ఇంగ్లండ్ టపటపా వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాతి బ్యాటర్లు కూడా నిలువలేకపోయారు. దీంతో 97 పరుగులకే ఇంగ్లిష్ జట్టు కుప్పకూలింది. ఈ మ్యాచ్‍లో అభిషేక్ శర్మ 135 పరుగులతో సెంచరీ చేయగా.. అతడి స్కోరును కూడా ఇంగ్లండ్ అందుకోలేక ఘోర పరాభవాన్ని చవిచూసింది.
అభిషేక్ సెంచరీ సునామీ.. రికార్డులు
ఈ ఐదో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత యంగ్ స్టార్ అభిషేక్ శర్మ 54 బంతుల్లోనే 135 పరుగులతో సునామీ సెంచరీ చేశాడు. ఏకంగా 13 సిక్స్‌లు, 7 ఫోర్లు బాదాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అభిషేక్ తన పేరిట లిఖించుకున్నాడు అభిషేక్. ఓ టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్ రికార్డును కూడా బద్దలుకొట్టాడు. ధనాధన్ హిట్టింగ్‍తో శకతంతో కదం తొక్కాడు అభిషేక్. ఇంగ్లండ్ బౌలర్లను చితకబాదేశాడు. 37 బంతుల్లోనే సెంచరీ చేరి.. భారత్ తరఫున టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ జాబితాలో రోహిత్ శర్మ (35 బంతులు) తర్వాత రెండో ప్లేస్‍లో అభిషేక్ నిలిచాడు.
అభిషేక్ శతకంతో చెలరేగగా.. తిలక్ వర్మ (15 బంతుల్లో 24 పరుగులు), శివమ్ దూబే (13 బంతుల్లో 30 పరుగులు) రాణించారు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (2) మరోసారి త్వరగా ఔటయ్యాడు. మొత్తంగా 247 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా. ఇంగ్లండ్‍ను కుప్పకూల్చి 4-1తో సిరీస్‍ను భారత్ కైవసం చేసుకుంది.
భారత్ రికార్డు ఇదే
టీ20ల్లో ఇంగ్లండ్‍పై అత్యధిక తేడాతో గెలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 150 రన్స్ తేడాతో ఇంగ్లిష్ జట్టును ఈ మ్యాచ్‍లో ఓడించి ఈ రికార్డు కైవసం చేసుకుంది. టీ20ల్లో తన భారీ ఓటమిని ఇంగ్లండ్ మూటగట్టుకుంది. టీ20ల్లో టీమిండియాకు ఇది రెండో అతిపెద్ద గెలుపు. 2023 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‍పై 168 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది.
భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 12 మధ్య జరగనుంది. తొలి వన్డే ఫిబ్రవరి 6న నాగ్‍పూర్ వేదికగా జరుగుతుంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link