



Best Web Hosting Provider In India 2024

Consultancy Politics: ఏపీలో అంతే.. రాజకీయాలకు స్క్రిప్ట్, క్రియేటివిటీ ముఖ్యం.. ప్రధాన పార్టీలది అదే తీరు…
Consultancy Politics: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీలు స్క్రిప్ట్, క్రియేటివిటీలనే నమ్ముకున్నాయి. కన్సల్టెంట్ల చెప్పు చేతల్లో పార్టీలు సాగుతున్నాయి. జనం భావోద్వేగాలను ఆకట్టుకోడానికి డ్రామాను రక్తి కట్టించడమే ముఖ్యమని భావిస్తున్నాయి.
Consultancy Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కన్సల్టెన్సీలు నడిపిస్తున్నాయని ఎప్పుడో రుజువైంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా కన్సల్టెంట్ల క్రియేటివిటీ మీద భారం మోపి ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో జనం గుర్తిస్తారనే స్పృహ కూడా లేకుండా వ్యవహరిస్తున్నాయి. రాజకీయంలో జనాన్ని ఆకట్టుకోవడమే ముఖ్యమని దానికి స్క్రిప్ట్, కెమెరా వర్క్, సోషల్ మీడియా ప్రచారం ముఖ్యమని పార్టీలు భావిస్తున్నాయి.
ఏపీ రాజకీయాలు- కన్సల్టెన్సీలను విడదీసి చూడలేనంతగా కలిసిపోయాయి. ప్రతిపక్షంలో ఉండగా పార్టీలకు సేవలందించిన కన్సల్టెన్సీలు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో భాగమైపోతున్నాయి. ప్రచారం మొదలుకుని కీలక నిర్ణయాల వరకు వాటి ప్రమేయంతోనే జరుగుతున్నాయి. స్క్రిప్ట్, క్రియేటివ్ వర్క్ ఎంత సక్సెస్ అయ్యిందనేది పార్టీలకు ముఖ్యంగా మారింది.
ఏపీలో కన్సల్టెన్సీ పాలిటిక్స్ వైసీపీతో మొదలైంది. 2019ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో ఐ పాక్‌తో వైసీపీ సోషల్ మీడియా ప్రచారాలు జనంలోకి బలంగా వెళ్లాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఐపాక్‌తో అనుబంధం కొనసాగింది. అదే సమయంలో టీడీపీ రాబిన్ శర్మ బృందాన్ని నియమించుకుంది. ప్రస్తుతం ఈ రెండు బృందాలు అయా పార్టీలకు సేవలందిస్తున్నాయి.
కాంపెయినింగ్‌లో క్రియేటివిటీ ముఖ్యం…
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే సామాజిక పెన్షన్లను రూ.4వేలకు పెంచడంతో పాటు అంతకు ముందు మూడు నెలల బకాయిలతో కలిపి లబ్దిదారులకు చెల్లించారు. ఉండవల్లి సమీపంలోని పెనుమాక గ్రామంలో లబ్దిదారుడి ఇంటికి చంద్రబాబు స్వయంగా వెళ్లి పెన్షన్ అందించారు. పూరిగుడిసెలో నివాసం ఉంటున్న లబ్దిదారుడి కుటుంబంతో అరగంటకు పైగా గడిపారు. వారికి సొంత ఇంటిని నిర్మించాలని అధికారుల్ని ఆదేశించారు. ఆ ఇంట్లోనే స్టీల్ గ్లాసులో టీ తాగారు.
ముఖ్యమంత్రి స్వయంగా పేదింటికి వెళ్లి వారికి అండగా ఉంటానని చెప్పడంతో పాటు అక్కడే టీ తాగడం వైరల్ అయ్యింది. ఇందులో సోషల్ మీడియా బృందాలు గట్టిగా పుష్ చేశారు. చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆ పార్టీకి పాజిటివ్ టాక్ తీసుకొచ్చింది. దీంతో ప్రత్యర్థులు చంద్రబాబు కోసం కొత్త స్టీల్ గ్లాస్ తీసుకెళ్లారని నెగటివ్ ప్రచారం చేసింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో చంద్రబాబు లబ్దిదారుల ఇళ్ళకు వెళ్లి పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నపుడు ఇదే కాన్సెప్ట్ ఫాలో అయ్యారు. లబ్దిదారుల ఎంపిక, ఎవరి ఇంటికి వెళ్లాలి, ఎవరితో మాట్లాడాలనే వాటిని కన్సల్టెన్సీలు నిర్ణయిస్తున్నాయి.
జగన్ ముద్దు ముచ్చట్లపై ట్రోలింగ్…
వైసీపీ అధ్యక్షుడు జగ్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం విజయవాడ జైల్లో రిమాండ్ అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో భేటీ అయ్యారు. పర్యటన ముగించుకుని వెళ్లే సమయంలో ఓ చిన్నారి జగన్‌తో సెల్ఫీ కోసం తండ్రితో కలిసి వచ్చింది. అంతకు ముందు మీడియా ఛానల్స్‌తో మాట్లాడిన బాలిక తమకు అమ్మఒడి వచ్చేదని ఇప్పుడు రావట్లేదని, ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నట్టు చెప్పింది.
ఈ క్రమంలో జనం మధ్యలో తండ్రితో కలిసి బాలిక ఉండటం, గట్టిగా కేకలు వేయడం, రకరకాల ఫ్రేముల్లో మిక్స్ చేసిన వీడియోలను ఆ పార్టీ విడుదల చేసింది. చిన్నారిని చూసిన జగన్ బాలికను దగ్గరకు పిలవడంతో తర్వాత ముద్దాడి, సెల్ఫీ దిగడం వైరల్ అయ్యింది. బాలికను పిలవడం నుంచి సెల్ఫీ వరకు మొత్తం వ్యవహారంపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. అదే సమయంలో టీడీపీ శ్రేణులు జగన్‌ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అమ్మఒడి లేక ఫీజులు కట్టడానికి డబ్బులు లేవన్న బాలిక నగరంలోని రవీంద్ర భారతి స్కూల్లో చదువుకుంటోందని తండ్రి నగల దుకాణంలో మేనేజర్‌గా, తల్లి ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నట్టు ఆధారాలను బయటపెట్టారు. దీంతో టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా ట్రోల్ చేసుకోవడం మొదలైంది.
ట్రెండింగ్… ట్రోలింగ్…
ప్రధాన రాజకీయ పార్టీలు సోషల్ మీడియా సైన్యాలను నిరంతరం కొనసాగిస్తున్నాయి. పార్టీల సొంత అభిమానులతో పాటు కన్సల్టెన్సీలు అందించే కంటెంట్‌ను వైరల్ చేసేందుకు, ప్రత్యర్థులపై విమర్శలతో దాడి చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రత్యర్థులపై విరుచుకు పడటానికి బహిరంగ కార్యక్రమాల కంటే ఇలా సోషల్ మీడియాలో ప్రచారం లేదా దుష్ప్రచారం మేలని భావిస్తున్నాయి. ఎక్కువ మందికి చేరువ అవుతుండటంతో పార్టీలు కూడా ముందు వెనుక ఆలోచించకుండా కన్సల్టెన్సీలు చెప్పినట్టు చేస్తున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్