



Best Web Hosting Provider In India 2024

Sangareddy Surgery: సంగారెడ్డిలో విషాదం…గురక చికిత్స కోసం సర్జరీ చేస్తే ప్రాణమే పోయింది..
Sangareddy Surgery: గురక కోసం చేసిన శస్త్ర చికిత్స వికటించి వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన సంగారెడ్డిలో జరిగింది. తీవ్ర గురక సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తి తన సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
Sangareddy Surgery: ఆపరేషన్ చేస్తే గురక సమస్య పూర్తిగా నయమవుతుందని డాక్టర్లు హామీ ఇవ్వటంతో సర్జరీకి ఒప్పుకున్న వ్యక్తి చివరకు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన సంగారెడ్డిలో జరిగింది. తీవ్ర గురక సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తి తన సమస్యకు శాశ్వత పరిస్కారం దొరుకుతుందని సంగారెడ్డి పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాడు.
ఆపరేషన్ చేస్తే తన సమస్య పూర్తిగా నయమవుతుందని డాక్టర్లు హామీ ఇవ్వటంతో, ఆ వ్యక్తి సర్జరీ కి ఒప్పుకున్నాడు.సర్జరీ చేసిన గంటల వ్యవధిలోనే తాను ప్రాణాలు కోల్పోవడంతో, బాధితుని కుటుంబసభ్యులు లబోదిబోమన్నారు. వారు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు.
శాశ్వత పరిష్కారం లభిస్తుందనుకుంటే…
ఆసుపత్రి యాజమాన్యంపై, డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లాలోని, కొండాపూర్ మండలానికి గారకుర్తి గ్రామానికి చెందిన వి.శ్రీనివాస్ (43) అనే వ్యక్తి కొంత కాలంగా తీవ్ర గురకతో బాధపడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం సంగారెడ్డి పట్టణంలోని, పద్మావతి న్యూరో , సూపర్ స్పెషలిటీ ఆస్పత్రిలోని డాక్టర్లను సంప్రదించాడు. సర్జరీ చేస్తే తన సమస్య శాశ్వత పరిస్కారం లభిస్తుందన్నారు. డాక్టర్ల మాటలు నమ్మిన, శ్రీనివాస్ బుధవారం సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరాడు. అదే రోజు రాత్రి డాక్టర్లు, తనకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన గంటల వ్యవధిలోనే తాను ప్రాణాలు కోల్పోయాడు.
చర్యలు తీసుకోవాలని ఆందోళన…..
విషయం తెలిసిన శ్రీనివాస్ బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే, శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడని, డాక్టర్లను వెంటనే అరెస్ట్ చేయాలనీ, శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారటంతో, సంగారెడ్డి పోలీసులు అక్కడి చేరుకొని, కేసు విచారణ చేపట్టారు.
బాధితుని కుటుంసభ్యులను ఓదార్చి, శ్రీనివాస్ మరణానానికీ కారణమేంటని తేల్చడానికి విచారణ చేపట్టారు. శవాన్ని, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి పోలీసులు ప్రయత్నం చేయగా, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేసిన తరవాతనే శవాన్ని తరలించాలని అడ్డుకున్నారు. ఆస్పత్రి దగ్గర, పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది.
శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేస్తామని, అదేవిధంగా ఆసుపత్రి యాజమాన్యం పైన, డాక్టర్ల పైన చర్యలు తీసుకుంటామని పోలీసులు బాధితుని కుటుంబ సబ్యులకు హామీ ఇచ్చారు. అయినా పరిస్థితి సద్దుమణగలేదు. శ్రీనివాస్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జిల్లాలోని ఒక ప్రైవేట్ కంపెనీ లో పనిచేస్తున్నట్లు, బంధువులు తెలిపారు. కుటుంబంలో, తానొక్కడే పంచేస్తాడని, తాను, లేకపోతే కుటుంబం దిక్కులేనిది అవుతందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
టాపిక్