Karappusa Vadiyalu: క్రిస్పీగా కారప్పూస వడియాలు ఇలా పెట్టుకోండి ఎండ అవసరం లేకుండా ఫ్యాన్ గాలికే ఎండిపోతాయి

Best Web Hosting Provider In India 2024

Karappusa Vadiyalu: క్రిస్పీగా కారప్పూస వడియాలు ఇలా పెట్టుకోండి ఎండ అవసరం లేకుండా ఫ్యాన్ గాలికే ఎండిపోతాయి

Haritha Chappa HT Telugu
Feb 20, 2025 05:30 PM IST

Crispy Vadiyalu: కారప్పూస వడియాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా తక్కువ సమయంలో ఎండిపోతాయి. ఇవి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. దీని రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

కారప్పూస వడియాలు రెసిపీ
కారప్పూస వడియాలు రెసిపీ (Youtube)

వడియాలు, అప్పడాలు మన భోజనంలో భాగం. పప్పు, సాంబారు తింటున్నప్పుడు పక్కన వడియాలు ఉండాల్సిందే. ఇక్కడ మేము పిల్లలకు నచ్చేలా క్రిస్పీగా ఉండే కారప్పూస వడియాలు ఇచ్చాము. చిన్నపిల్లలు కూడా వీటిని చాలా సులువుగా తినగలరు. దీని కోసం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఎండ కూడా అవసరం లేదు. ఇది ఒక రోజంతా ఫ్యాన్ గాలి కింద పెడితే చాలు ఆరిపోతాయి. ఆరు నెలలపాటు తాజాగా ఉంటాయి. కారప్పూస వడియాలు రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కారప్పూస వడియాలు రెసిపీకి కావలసిన పదార్థాలు

బియ్యం పిండి – ఒక కప్పు

సగ్గుబియ్యం – పావు కప్పు

పచ్చిమిర్చి – ఐదు

నీళ్లు – సరిపడినన్ని

ఉప్పు – రుచికి సరిపడా

ఇంగువ – చిటికెడు

నిమ్మరసం – ఒక స్పూను

కారప్పూస వడియాలు రెసిపీ

1. కారప్పూస వడియాలు చేసేందుకు ముందుగా బియ్యప్పిండిని తీసి ఒక గిన్నెలో వేసుకోండి.

2. ఇప్పుడు మిక్సీలో పావు కప్పు సగ్గుబియ్యాన్ని వేసి మెత్తగా పొడి చేసుకోండి.

3. ఆ పొడిని బియ్యప్పిండిలో వేసి బాగా కలపండి.

4. ఇప్పుడు మిక్సీలో పచ్చిమిర్చి, చిటికెడు ఉప్పు, కొంచెం నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి.

5. ఆ మొత్తం మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.

6. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి రెండున్నర కప్పుల నీటిని వేయండి.

7. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపండి.

8. ఇంగువ కూడా వేసి బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి.

9. ఇది చిన్న మంట మీద పెట్టి ఆ వేడి నీటిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని మెల్లగా వేసి గరిటతో కలుపుతూ ఉండండి.

10. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి. నీటిలో ఈ మిశ్రమం బాగా కలిసిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయండి.

11. స్టవ్ ఆఫ్ చేసాక వెంటనే కుక్కర్ మూత పెట్టేసి పైన విజిల్ పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి.

12. తర్వాత మూత తీసి చూస్తే ఆ వేడికి అది బాగా ఉడికి ఉంటుంది.

13. ఈ మిశ్రమం కాస్త గట్టిగా గట్టి ఉప్మా లాగా తయారవుతుంది.

14. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి గరిటెతోనే దాన్ని బాగా కలుపుకోవాలి.

15. మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపాక జంతికల గొట్టాన్ని తీసుకొని ఈ మిశ్రమాన్ని అందులో కూరండి.

16. కారప్పూస చేయడానికి ఏ చక్రం పెడతారో అంత సన్నని రంధ్రాలు ఉన్నచక్రాన్ని పెట్టుకోవడం మర్చిపోవద్దు.

17. ఇప్పుడు ఫ్యాన్ కింద ఒక చీరను పరిచి వీటిని జంతికల్లాగా వేసుకోండి.

18. ఒకరోజు ఫ్యాన్ గాలికే ఇవి బాగా ఆరిపోతాయి.

19. వీటిని తీసి డబ్బాల్లో దాచుకుంటే ఆరు నెలల పాటు తాజాగా ఉంటాయి.

20. తెల్లగా ఉండే ఈ వడియాలు పిల్లలకు బాగా నచ్చుతాయి.

21. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాము కాబట్టి రుచి కూడా బాగుంటుంది. వీటిని ఒక్కసారి చూడండి.

22. మీకు ఇవి ఎంతో నచ్చుతాయి. ఎర్రటి ఎండలో వీటిని ఎండ పెట్టాల్సిన అవసరం లేదు.

తెలుగిళ్లల్లో అప్పడాలకు, వడియాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భోజనంలో కచ్చితంగా పక్కన అప్పడాలు, వడియాలు ఉండాల్సిందే. ఇలా ఇంట్లోనే కారపూస వడియాలు చేసుకుంటే తక్కువ ధరకే అప్పడాలు వచ్చేస్తాయి.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024