



Best Web Hosting Provider In India 2024

HYDRAA Demolitions : పరికి చెరువులోకి ‘హైడ్రా’ బుల్డోజర్లు – ఆక్రమణలు కూల్చివేత
హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని పరికి చెరువులో వెలసిన ఆక్రమణలను తొలిగించింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న వాటిని కూల్చివేసింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గురువారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని పరికి చెరువులో ఆక్రమణలను తొలగించింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైడ్రా ప్రకటించింది.
హైడ్రా తెలిపిన వివరాల ప్రకారం…. మేడ్చల్ జిల్లా పరిధిలోని పరికి చెరువు 60 ఎకరాలకు పైగా ఉండేది. ఇప్పటికే చాలావరకు కబ్జా అయ్యిందని పరికి చెరువు పరిరక్షణ సమితి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి కబ్జాలను హైడ్రా పరిశీలించింది.
పరికి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న రెండు కట్టడాలతో పాటు.. పునాదుల దశలో ఉన్న మరో రెండు నిర్మాణాలను గురువారం తొలగించినట్లు హైడ్రా పేర్కొంది.
హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర కీలకం: రంగనాథ్
హైడ్రా నిర్వహిస్తున్న విధులన్నిటిలో డీఆర్ ఎఫ్ బృందాల పాత్ర చాలా కీలకమైనదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాల మేరకు హైడ్రా పని చేయాల్సినవసరం ఉందని.. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
డీఆర్ ఎఫ్‌లోకి ఔట్‌సోర్సింగ్ విధానంలో కొత్తగా తీసుకున్న 357 మంది శిక్షణ ప్రారంభోత్సవంలో గురువారం కమిషనర్ మాట్లాడారు. అంబర్‌పేట్ పోలీసు శిక్షణ కేంద్రంలో వారం రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుంది. ఈ సమాజంలోనూ.. ప్రభుత్వ పరంగా హైడ్రా ప్రధాన మైన భూమిక పోషిస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరూ పని చేయాల్సినవసరం ఉందని అన్నారు.
ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పడు ప్రజల ప్రాణాలతో పాటు.. ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో డీఆర్ ఎఫ్ పాత్ర చాలా కీలకమైనదని.. ఇప్పుడు హైడ్రా విధులు కూడా తోడయ్యాయని రంగనాథ్ చెప్పారు. మనమీద ఉన్న నమ్మకంతోనే ప్రభుత్వం పలు బాధ్యతలు అప్పగిస్తున్నదని.. తాజాగా ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే పనిని కూడా మనకే చెప్పిందన్నారు. వీటన్నిటినీ మనం ఎంతో శ్రద్ధగా, బాధ్యతతో చేయాల్సినవసరం ఉందన్నారు. భారీ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు ఇలా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పడు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.
సంబంధిత కథనం
టాపిక్