



Best Web Hosting Provider In India 2024

AP Farmers : మిర్చి రైతులను ఆదుకుంటాం… అన్ని విధాలా అండగా ఉంటాం – సీఎం చంద్రబాబు
మిర్చి రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మిర్చి రైతులను ఆదుకునే విషయంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని తెలిపారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని… నష్టపోకుండా ఏం చేయాలో.. అవన్నీ చేస్తామన్నారు.
మిర్చి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన… మిర్చి రైతుల సమస్యలను కేంద్రం దృష్టి తీసుకెళ్లామని చెప్పారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రిని కలిశామని… రైతులను ఏ విధంగా ఆదుకోవాలనే విషయంపై చర్చించామని తెలిపారు.
“మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు. అది కూడా ఐసీఏఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయిస్తున్నారు. సాగు ఖర్చులను రియలిస్టిక్ గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరాం. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కూడా ఆలోచిస్తాం” అని సీఎం పేర్కొన్నారు.
ఆదుకునేది మేమే – సీఎం చంద్రబాబు
“ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయం చేయాలి. రైతుల కోసం ఏమి చేయని వాళ్ళు కూడా వచ్చి కబురులు చెప్తున్నారు. మిర్చి రైతులను ఆదుకోవడం కోసం, గత 5 ఏళ్ళలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో మిర్చి రైతులకు ఇబ్బందులు వస్తే, చరిత్రలో మొదటి సారి ఎవరూ చేయని విధంగా రూ.138 కోట్లు ఇచ్చాం. మళ్ళీ ఈ రోజు కూడా మిర్చి రైతులను ఏ కష్టమొచ్చినా ఆదుకునేది మేమే” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
“రాష్ట్రంలో రైతులందరికీ నా విన్నపం.. రైతులను ఆదుకోవటం గురించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటాం. రైతులు నష్టపోకుండా ఏం చేయాలో.. అవన్నీ చేస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీనిచ్చారు.
పోలవరంపై చర్చ….
పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించామని సీఎం చంద్రబాబు తెలిపారు. “2027 లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే నదుల అనుసంధానం గురించి కూడా చర్చించాం. రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్ అమలు గురించి కూడా చర్చించాం. గత వైసీపీ ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పథకాన్ని సరిగా వినియోగించుకోలేదు. ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు ఇచ్చే పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మేము కొత్తగా డీపీఆర్ రూపొందించి జల్‌జీవన్ మిషన్ నిధులను వినియోగించుకుంటాం” అని చంద్రబాబు తెలిపారు.
“ప్రభుత్వం అవలంభించే తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం ఎలా నష్ట పోతుందో, గత వైసీపీ ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ ని ఎలా నిర్వీర్యం చేసిందో ఒక ఉదాహరణ. చేతకాని పరిపాలన వల్ల వచ్చే సమస్య ఇది. మేము అధికారంలోకి రాగానే 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తిగా వినియోగించుకుంటున్నాం. గత ప్రభుత్వ చేతకానితనం వల్ల పథకాల నిధులు వాడుకోలేదు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.
సంబంధిత కథనం
టాపిక్