



Best Web Hosting Provider In India 2024

Sangareddy : ఫార్మా కంపెనీలే టార్గెట్..! కార్బన్ దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్, రూ. 4 కోట్లకుపైగా విలువైన కెమికల్ స్వాధీనం
ఫార్మా కంపెనీలో విలువైన కెమికల్ ను చోరీ చేస్తున్న ముఠాను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 4 కోట్లకుపైగా విలువ చేసే పల్లాడియం కార్బన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.
ఫార్మా కంపెనీల్లో వాడే అత్యంత విలువైన పల్లాడియం కార్బన్ ను దొంగిలిస్తున్న ముఠాను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులను సదాశివపేట సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ 4 కోట్ల 50 లక్షల విలువైన పల్లాడియం కార్బన్ ని స్వాధీనం చేసుకున్నారు.
కంపెనీలో పనిచేసి… దొంగగా మారి…!
వివరాల్లోకి వెళ్తే… ప్రధాన నిందితుడు అల్లం సాంబశివుడు వివిధ ఫార్మా కంపెనీలో పని చేసిన అనుభవం ఉంది. అతనికి పల్లాడియం కార్బన్ యొక్క విలువ గురించి పూర్తి అవగాహన కలదు. దీని ఆధారంగా చేసుకుని తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యం కలిగింది.
గతంలో అతను పూణెలోని ఫార్మా కంపెనీలో పనిచేసేటప్పుడు అక్కడ పని చేసే ప్రసాద్, అన్మోల్ జగ్గేతో పరిచయం ఉంది. ఫార్మా కంపెనీలో పల్లాడియం కార్బన్ ను దొంగతనం చేసి తీసుకురావలసిందిగా ఒప్పందం చేసుకున్నాడు. దీనిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకుందాం అని చెప్పాడు.
ఈ క్రమంలోనే సాంబశివుడు హైదరాబాద్ వచ్చాడు. పల్లాడియం కార్బన్ లభించే ఫార్మా కంపెనీల గురించి తెలుసుకుంటూ అక్కడ పనిచేస్తున్న స్టోర్ సిబ్బందికి డబ్బులు ఆశ చూపెట్టే పనిలో పడ్డాడు. కంపెనీ యొక్క మెటీరియల్ గురించి పూర్తి సమాచారం తీసుకొని ప్రసాద్ టీం లేదా అమోల్ జగ్గేటీంకు సమాచారం ఇచ్చేవాడు,
గుమ్మడిదలలో మొదటి దొంగతనం…….
ఈ గ్యాంగ్ 2023లో మొదటిసారిగా గుమ్మడిదల పోలీసు స్టేషన్ పరిధిలోని బొంతపల్లిలో గల న్యూల్యాండ్ కంపెనీలో సుమారు 35 కేజీల పల్లాడియం కార్బన్ దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. 2024 నవంబర్ లో అమోల్ జాగడే అలియాస్ రాజు గ్యాంగ్… బొల్లారంలో గల రాంప్యాక్స్ కంపెనీలో సుమారు 8 కిలోల పల్లాడియం కార్బన్ దొంగతనం చేశారని పేర్కొన్నారు. 2024 డిసెంబర్ లో ప్రసాద్ టీమ్… బీదర్ లోని సాయి లైఫ్ సైన్సెస్ లో సుమారు 15 నుంచి 17 కిలోల కెమికల్ పౌడర్ ను చోరీ చేశారు.
20 రోజుల క్రితం సాంబశివుడు సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిదిలో యావాపూర్ గ్రామంలో గల అరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్-3 గురించి తెలుసుకున్నాడు. ప్రణాళిక ప్రకారం… కంపెనీకి వచ్చి స్టోర్ మేనేజర్ గా ఉన్న ముక్కంటి రెడ్డి ని కలిసి అతనికి డబ్బుల ఆశ చూపాడు. మెటీరియల్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని ప్రసాద్ కు సమాచారం ఇచ్చాడు.
ఫిబ్రవరి 9న రాత్రి ప్రసాద్ తో పాటు అతని టీమ్ సభ్యులు సభ్యులు కంపెనీ నుంచి సుమారు 120 కిలోలు పల్లాడియం కార్బన్ దొంగిలించినట్లు విచారణలో తేలింది. దీని విలువ మొత్తం సుమారు 4.5 కోట్లు ఉంటుంది. ఈ కేసు విచారణలో భాగంగా సాంబశివుడు, ప్రసాద్, ముక్కంటి రెడ్డి తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక కారు, ఆరు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు నిందితులు పరారిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
రిపోర్టింగ్: ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.
టాపిక్