



Best Web Hosting Provider In India 2024

Director Shankar: గేమ్ ఛేంజర్ డైరెక్టర్‌కు షాక్.. ఆ రజనీకాంత్ సినిమా కాపీ కేసులో రూ.10 కోట్ల ఆస్తుల అటాచ్
Director Shankar: గేమ్ ఛేంజర్ మూవీ డైరెక్టర్ శంకర్ చిక్కుల్లో పడ్డాడు. గతంలో రజనీకాంత్ తో చేసిన సినిమా కాపీ అనే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. శంకర్ కు చెందిన రూ.10 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
Director Shankar: ఈ మధ్యే రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ మూవీ తీసిన డైరెక్టర్ శంకర్ చిక్కుల్లో పడ్డాడు. గురువారం (ఫిబ్రవరి 20) శంకర్ కు చెందిన రూ.10 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేయడం గమనార్హం. 2010లో వచ్చిన రోబో మూవీకి సంబంధించి గ్రంధచౌర్యం, కాపీరైట్ ఉల్లంఘనల కేసులను అతడు ఎదుర్కొంటున్నాడు.
రోబో మూవీ కాపీ కేసులో..
డైరెక్టర్ శంకర్ పై మనీ లాండరింగ్ వ్యతిరేక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. అంతేకాదు అతనికి సంబంధించిన రూ.10 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఓ సినిమా గ్రంధచౌర్యం లేదా కాపీరైట్ ఉల్లంఘన కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కిందట ఆస్తులు అటాచ్ చేయడం బహుషా ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.
పీఎంఎల్ఏ కింద ఫిబ్రవరి 17న ఆదేశాలు ఇచ్చినట్లు ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. డైరెక్టర్ శంకర్ కు చెందిన మూడు స్థిరాస్థులను అటాచ్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.10.11 కోట్లు.
అసలేంటీ కేసు?
శంకర్ డైరెక్ట్ చేసిన రోబో మూవీకి వ్యతిరేకంగా 2011లో ఆరూర్ తమిళనాదన్ చెన్నైలోని ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన జిగూబా అనే కథ ఆధారంగానే ఈ ఎంథిరన్ (రోబో) మూవీ తీసినట్లు ఆయన ఆరోపించారు. ఈ కేసు నుంచే మనీ ల్యాండరింగ్ కేసు వచ్చింది.
ఈ సినిమా రోబో పేరుతో తెలుగులోనూ 2010లో రిలీజైన విషయం తెలిసిందే. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.290 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా కోసం శంకర్ కు రూ.11.5 కోట్లు దక్కినట్లు కూడా తన రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగులతోపాటు దర్శకత్వం వహించాడు.
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఇదే కేసుకు సంబంధించి ఓ స్వతంత్ర విచారణ జరపగా ఈ జిగూబా, రోబో మూవీకి చాలా పోలికలు ఉన్నట్లు గుర్తించారు. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిగణలోకి తీసుకొని డైరెక్టర్ శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ స్పష్టం చేసింది.
సంబంధిత కథనం