



Best Web Hosting Provider In India 2024

YS Jagan Questions : ‘నేను రైతులను కలిస్తే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా..? మీ కేసులకు భయపడను’ – వైఎస్ జగన్ 10 ప్రశ్నలు
కూటమి ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ ప్రశ్నాస్త్రాలను సంధించారు. మిర్చి రైతులను కలిస్తే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా..? అని ప్రశ్నించారు. తాను రైతుల పక్షపాతిని అని… మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేదిలేదని స్పష్టం చేశారు. సంక్షోభం నుంచి మిర్చి రైతులు బయటపడేలా చూడాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు
తనపై ఎన్ని కేసులు పెట్టినా ప్రజా పోరాటాలను ఆపేదే లేదని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. ఎన్నికేసలు పెట్టినా రైతులకోసం, ప్రజలకో సం నిలబడతానని చెప్పారు. ఇప్పటికైనా తక్షణమే మిర్చి రైతుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో జగన్ పోస్ట్ చేశారు. ఇందులో 10 అంశాలను ప్రస్తావించారు.
వైఎస్ జగన్ 10 ప్రశ్నలు….
- “చంద్రబాబుగారు…. తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన పరిస్థితి ఉంది.కొనేవాడులేక రూ.10వేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.1,50,000 పైమాటే. ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ, మేం స్పందించేంతవరకూ మీలో కదలిక లేదు. మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్టుగా యథావిధిగా కలరింగ్ ఇస్తున్నారు.
- తూతూ మంత్రంగా మళ్లీ రైతులను మోసం చేసి, ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖ రాయడం ఏంటి? కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖరాయడం ఏంటి? మీరు బాధ్యతను వేరేవాళ్లమీద నెట్టడం ఏంటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా కుంటిసాకులు వెతుక్కోవడం ఏంటి? ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారు.
- గతంలో మీరెప్పుడూ మిర్చికి కనీస మద్దతు ధరలు ప్రకటించలేదు. 5ఏళ్ల కిందట, మేం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన పంటలకే కాకుండా… ప్రకటించని పంటలకూ, రాష్ట్రం మరికొన్ని పంటలను అదనంగా చేర్చి మొత్తంగా 24 పంటలకు మద్దతు ధరలు ప్రకటించింది. పోటీవాతావరణం కల్పించి ధరలు పడిపోకుండా అడ్డుకోవడమేకాదు…. ధరలు పెరిగేట్టుగా చూశాం.
- ధాన్యం కొనుగోళ్లకు రూ.65,000 కోట్లు ఖర్చు చేయడమే కాకుండా, ఇతర పంటల కొనుగోళ్లకు మరో రూ.7,800 కోట్లు ఖర్చుచేసి రైతుకు అండగా నిలిచాం. మరి ఈ ధరలు ప్రకటించి అప్పటికీ, ఇప్పటికీ 5ఏళ్లు అయ్యింది. 5 ఏళ్ల తర్వాత పెట్టుబడి ఖర్చులు పెరగవా…? అప్పట్లో మిర్చి సాగుకు ఎకరాకు రూ.1లక్ష అయితే, ఇప్పుడు రూ.లక్షన్నర అయిన మాట వాస్తవం కాదా? మీరుకూడా మాలాగే ఇప్పుడు కొత్త మద్దతు ధరలు ప్రకటించి రైతులను ఆదుకోవడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయలేదు?
- 5. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌చౌహాన్ సింగ్‌కు రాసిన లేఖలో మా హయాంలో మిర్చి రైతులకు మంచి ధరలు వచ్చాయని మీరే చెప్పారు. మీరు రాసిన లేఖ ప్రకారమే మా హయాంలో మిర్చికి మోడల్ ధర రూ.20,000 ఉంటే, గరిష్ట ధర రూ.27,000 పలికింది వాస్తవం కాదా….?
- మిర్చి రైతుల సంక్షోభంపై ఈ జనవరిలో ఉద్యానవనశాఖ అధికారులు నివేదించిన తర్వాత అయినా, మీరేమైనా పట్టించుకున్నారా…? మిర్చి రైతుల పరిస్థితి అన్యాయంగా ఉందని, జోక్యం చేసుకోవాలని నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? పైగా తప్పుడు రాజకీయాలు చేస్తూ, మిర్చి కొనుగోళ్లతో సంబంధంలేని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపుకుంటారా?
- మిర్చి రైతులకు బాసటగా వెళ్లినందుకు మాపై కేసులు పెట్టారు. అలాంటప్పుడు ఈ ఫిబ్రవరి 15న మీరు పాల్గొన్న మ్యూజికల్‌నైట్‌కు ఎన్నికల కోడ్ అడ్డం రాలేదా? నేను మిర్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా…? పైగా మేము ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు, నిన్నటి కార్యక్రమంలో పలానావారికి ఓటు వేయమనికూడా చెప్పలేదు, కనీసం మైక్‌లో కూడా మాట్లాడలేదు. అయినా అన్యాయంగా కేసులు పెట్టారు. ఇది అప్రజాస్వామికం కాదా…?
- మీ హయాంలో పంటలకు కనీస మద్దతు ధరలు రావడంలేదన్నది వాస్తవం కాదా? పత్తి, పెసర, మినుము, కంది, టమోటా, మిర్చి, మొన్నటి ధాన్యం సహా అన్ని పంటల రైతులకు కనీసమద్దతు ధరలు లభించక మీరే వారిని సంక్షోభంలో నెట్టిన మాట వాస్తవం కాదా?
- రైతుకోసం మేం సృష్టించిన మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. వ్యవసాయరంగంలో మేం తీసుకు వచ్చిన విప్లవాత్మక వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. వ్యవసాయం దండగ అన్న మీ ఆలోచన, మైండ్ సెట్ మారలేదు చంద్రబాబుగారు. ఇప్పుడు కూడా కలరింగ్ ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారు.
- మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేదిలేదు. నేను రైతు పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. మీరు ఎన్నికేసులు పెట్టినా రైతులకోసం, ప్రజలకోసం నిలబడతాను. చంద్రబాబుగారూ… ఇప్పటికైనా తక్షణమే మిర్చి రైతుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకోండి. ఈ సంక్షోభం నుంచి రైతులు బయటపడేలా, వారికి ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోళ్లు ప్రారంభించండి” అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం
టాపిక్
Ys JaganChandrababu NaiduAp PoliticsFarmersAgriculture
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.