



Best Web Hosting Provider In India 2024

Farmers Protest: పాల శీతలీకణపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కిన పాడి రైతులు, వివాదాస్పద కేంద్రం సీజ్‌పై నిరసన
Farmers Protest: కరీంనగర్ మిల్క్ డెయిరీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం వద్ద ఏర్పాటుచేసిన పాల శీతలికరణ కేంద్రం సీజ్ వివాదాస్పదంగా మారింది. మిల్క్ చిల్లింగ్ సెంటర్ కు ఇండస్ట్రియల్ అనుమతి, ఫైర్ సేఫ్టీ లేదని అధికారులు సీజ్ చేయడంతో పాల సేకరణ బంద్ అయి పాడి రైతులు రోడ్డెక్కారు.
Farmers Protest: ముందస్తు నోటీసు ఇవ్వకుండా మిల్క్ చిల్లింగ్ సెంటర్ ను సీజ్ చేస్తే పాలు ఏం చేయాలని అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారులు వర్సెస్ పాడి రైతులు అన్నట్లుగా రాజకీయం సాగి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యంతో రాత్రి మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఓపెనింగ్ అయింది.
కరీంనగర్ మిల్క్ డెయిరీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఆగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన మిల్క్ చిల్లింగ్ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేయడం కలకలం సృష్టించింది.
చిల్లింగ్ కేంద్రానికి ఇండస్ట్రియల్ అనుమతులు, ఫైర్ సెప్టీ లేవని ఉన్నతాధికారి అదేశాల మేరకు సీజ్ చేస్తున్నట్లు మున్సిపల్, డీపీఓ, ఇండస్ట్రియల్ అధికారులు ప్రకటించారు. చిల్లింగ్ కేంద్రం వద్దకు వచ్చిన అధికారులు సదరు డెయిరీ నిర్వహకులకు ఎటువంటి నోటీసులుగానీ, కనీస సమాచారం ఇవ్వకుండానే నేరుగా సీజ్‌చేసి వెళ్లిపోయారని డెయిరీ నిర్వాహకులు తెలిపారు.
సీజ్ చేసే సమయంలో చిల్లింగ్ కేంద్రంలో దాదాపు రూ.25 లక్షల విలువజేసే పాలున్నట్లుగా తెలుస్తోంది. ఆ పాలను తీసుకుంటామని సిబ్బంది చెప్పినా వినకుండా.. సీజ్ చేసారని సిబ్బంది పేర్కొన్నారు. ట్యాంకర్ లో నింపి బయటికి తరలించే సమయంలో ట్యాంకర్ బయటికి వెళ్లకుండా సీజ్ చేయడంతో అందులోని పాలు పాడైపోయాయని సిబ్బందితో పాటు పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
పాల కేంద్రం సీజ్ పై భగ్గుమన్న పాడి రైతులు…
పాల శీతలీకరణ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారనే సమాచారంతో పాడి రైతులు అగ్రహారంకు చేరుకుని ఆందోళనకు దిగారు. రోడ్డుపై పై బైఠాయించి అధికారుల తీరుపై మండిపడ్డారు. కలెక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీజ్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
పాడి రైతుల ఆందోళనతో కరీంనగర్ సిరిసిల్ల రూట్ లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సాయంత్రం పాల సేకరణ నిలిచిపోవడంతో గ్రామాల వారిగా ఎక్కడికక్కడ పాడి రైతులు నిరసన ఆందోళన వ్యక్తం చేశారు. 2005 లో ఏర్పాటు చేసిన చిల్లింగ్ కేంద్రానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 145 గ్రామాల నుంచి 18 నుంచి 20వేల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు.
ముందస్తు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా సమాచారం లేకుండా ఎలా సీజ్ చేస్తారని పాడి రైతులు ప్రశ్నించారు. గత 20 ఏళ్ళుగా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నడిచిన చిల్లింగ్ కేంద్రానికి ఇప్పుడు అభ్యంతరాలు ఎందుకని అధికారులను నిలదీశారు.
రాజకీయ కక్షలో భాగమేనా…
రాజకీయ కక్షలో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల చర్యలు ఉన్నాయని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కేటీఆర్ ఫోటోతో ఉన్న కేటిఆర్ టీ స్టాల్ ను బంద్ చేయించిన అధికారులు, అది మరిచిపోకముందే పాడి రైతులకు ఉపయోగపడే మిల్క్ చిల్లింగ్ సెంటర్ సీజ్ చేయడం కక్ష పూరిత చర్యలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారి ఆదేశాల మేరకు సీజ్‌చేయగా ఈ విషయాన్ని పాడి రైతులు, బిఆర్ఎస్ శ్రేణులు సీరియస్‌గా తీసుకున్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది జోక్యంతో తెరుచుకున్న పాల కేంద్రం..
అగ్రహారం పాల శీతలీకరణ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేయడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. తన దృష్టికి వచ్చిన వెంటనే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు ఫోన్ చేసి ఆరా తీశారు. ఫైర్ సేఫ్టీ సహా శీతలీకరణ కేంద్రానికి సంబంధించి సరైన అనుమతులు లేకపోవడంతో మూసివేసినట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని వేలాది మంది రైతులు కరీంనగర్ డెయిరీకి నిత్యం పాలు సరఫరా చేస్తారని, సీజ్ చేయడంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఉందని బండి సంజయ్ తోపాటు ఆది శ్రీనివాస్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా శీతలీకరణ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫైర్ సేఫ్టీసహా ఇతర అనుమతులకు సంబంధించి నిబంధనలు పాటించేలా నిర్ణీత గడువు విధించాలని సూచించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ రైతుల శ్రేయస్సు దృష్ట్యా సీజ్ చేసిన కరీంనగర్ పాల శీతలీకరణ కేంద్రం సీజ్ ను రాత్రి ఆది శ్రీనివాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో తొలగించి పాల శీతలీకరణ కేంద్రాన్ని ఓపెన్ చేశారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్