



Best Web Hosting Provider In India 2024

Ramam Raghavam Review: రామం రాఘవం రివ్యూ – కమెడియన్ ధన్‌రాజ్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఎలా ఉందంటే?
Ramam Raghavam Review: కమెడియన్ ధన్‌రాజ్ రామం రాఘవం మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రీకొడుకుల అనుబంధంతో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో సముద్రఖనితో పాటు ధన్‌రాజ్ ఓ కీలక పాత్ర పోషించాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Ramam Raghavam Review: జబర్ధస్థ్ కమెడియన్లు నవ్వించడమే కాదు దర్శకులుగా కూడా మెప్పించగలరని బలగం మూవీతో వేణు నిరూపించాడు. వేణు బాటలోనే రామం రాఘవం మూవీతో మరో కమెడియన్ ధన్‌రాజ్ అడుగులు వేశాడు. తానే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఇందులో ఓ కీలక పాత్ర పోషించాడు. సముద్రఖని మరో ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీ శుక్రవారం (నేడు) థియేటర్లలో రిలీజైంది. తండ్రీకొడుకుల బంధంతో తెరకెక్కిన ఈ మూవీతో దర్శకుడిగా ధన్‌రాజ్ ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అంటే…
రామం రాఘవం కథ…
దశరథ రామం (సముద్రఖని) నిజాయితీపరుడైన ప్రభుత్వ ఉద్యోగి. కొడుకు రాఘవ (ధన్‌రాజ్) అంటే దశరథ రామానికి ఇష్టం. రాఘవను డాక్టర్ చేయాలని కలలు కంటాడు. కానీ తండ్రి కలలకు భిన్నంగా రాఘవ చదువు మధ్యలోనే ఆపేస్తాడు. చెడు వ్యసనాల బారిన పడతాడు. దొరికిన చోటల్లా అప్పులు చేస్తుంటాడు.
ప్రతిసారి తప్పులు చేసి దొరికిపోతూ తండ్రితో తిట్లు తింటుంటాడు. రాఘవను ద్వేషించడం మొదలుపెడతాడు దశరథ రామం. ఓ సారి డబ్బు కోసం తండ్రి సంతకాన్ని పోర్జరీ చేసి దొరికిపోతాడు రాఘవ. దాంతో కొడుకును రామం పోలీసులకు అప్పగిస్తాడు. చివరకు డబ్బు, ఉద్యోగం కోసం తండ్రినే చంపేందుకు రాఘవ ప్లాన్ చేస్తాడు.
స్నేహితుడైన లారీ డ్రైవర్ దేవతో (హరీష్ ఉత్తమన్) డీల్ కుదుర్చుకుంటాడు. తండ్రిని చంపాలని రాఘవ ఎందుకు అనుకున్నాడు? రాఘవలో మార్పు వచ్చిందా? తండ్రి ప్రేమను అర్థం చేసుకున్నాడా? కొడుకు కోసం రామం తీసుకున్న నిర్ణయమేమిటి? తండ్రీకొడుకుల మధ్య దూరం ఎందుకు పెరిగింది? అన్నదే రామం రాఘవం మూవీ కథ.
కొత్త యాంగిల్‌లో…
తండ్రీకొడుకుల ఎమోషనల్ అన్నది బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్ ఫార్ములా. ఈ ఎమోషన్‌ను ఒక్కో దర్శకుడు ఒక్కోలా ఆవిష్కరిస్తూ సక్సెస్‌లను అందుకున్నాడు. తండ్రీకొడుకుల బంధాన్ని రామం రాఘవం మూవీలో డిఫరెంట్ యాంగిల్‌లో చూపించాడు యాక్టర్ కమ్ డైరెక్టర్ ధన్‌రాజ్.
ఈజీ మనీ కోసమో, వ్యసానాల బారిన పడో తల్లిదండ్రులను చంపడానికి కొడుకులు సిద్ధపడిన కథనాలు అప్పుడప్పుడు పత్రికల్లో టీవీలో కనిపిస్తుంటాయి.ఆ సంఘటనల నుంచే స్ఫూర్తి పొందుతూ రైటర్ శివ ప్రసాద్ రామం రాఘవం కథను రాసుకున్నట్లుగా అనిపించింది. ఈ పాయింట్‌ను ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్‌గా మనసుల్ని కదలించేలా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు ధన్‌రాజ్.
కమర్షియల్ హంగులు లేకుండా…
నిజాయితీపరుడైన తండ్రి…అడ్డదారుల్లో పయనించే కొడుకు…వారిద్దరి మధ్య విద్వేషాలు, విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారితీసాయన్నదే రామం రాఘవం మూవీ కథ. ఈ పాయింట్‌ను యాక్షన్, కామెడీ ట్రాక్‌లాంటి కమర్షియల్ హంగులతో చెప్పే స్కోప్ ఉంది. కానీ ధన్‌రాజ్ అవసరపు అంశాల జోలికి వెళ్లి కథను పక్కదారి పట్టించకుండా నిజాయితీగా కథను చెప్పాడు. సముద్రఖని, ధన్‌రాజ్ కాంబోలో వచ్చే డైలాగ్స్, సీన్స్ తెచ్చిపెట్టినట్లుగా కాకుండా నాచురల్‌గా సాగుతాయి.
సస్పెన్స్‌తో…
రామం రాఘవం పాత్రలను పరిచయం చేయడానికి, కథలోని వెళ్లడానికి ధనరాజ్ ఎక్కువగా టైమ్ తీసుకోలేదు. రాఘవ తప్పులు చేస్తూ పోవడం, దశరథ రామం చేతిలో తిట్లు తినడం లాంటి సన్నివేశాలతో ప్రథమార్థాన్ని నడిపించారు. తండ్రినే చంపాలని రాఘవ నిర్ణయించుకున్నప్పటి నుంచే సినిమా ఆసక్తికరంగా మారుతుంది. రాఘవ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనే సస్పెన్స్, క్యూరియాసిటీ కలిగిస్తూ సెకండాఫ్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.
ప్రీ క్లైమాక్స్…
ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఎమోషన్స్ పీక్స్‌లో చూపించేశాడు. చివరి ఇరవై నిమిషాలు హృద్యంగా సాగుతుంది. పిల్లలకు తండ్రి ఇంటి పేరు ఇవ్వగలడు కానీ మంచి పేరు ఇవ్వలేడు….చెట్లకు నీళ్లు పోస్తూ పొరపాటునా ముళ్లకంపకు కూడా నీళ్లు పోసి పెంచావ్ లాంటి డైలాగ్స్ ఆలోచనాత్మకంగా ఉన్నాయి. లవ్ ట్రాక్ కథకు అంతగా అతకలేదు. ఫస్ట్ హాఫ్ కథ ముందుకు కదలక అక్కడే తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది.
యాక్టర్‌గా…డైరెక్టర్‌గా…
కామెడీ మాత్రమే కాదు కంప్లీట్ సీరియస్ రోల్స్ కూడా చేయగలనని ఈ మూవీతో ధన్‌రాజ్ నిరూపించాడు. యాక్టర్‌గా, డైరెక్టర్‌గా రెండు బాధ్యతలకు న్యాయం చేశాడు. నటుడిగా అతడిని కొత్త కోణంలో ఈ మూవీ ఆవిష్కరించింది. దశరథ రామం పాత్రలో సముద్రఖని జీవించాడు. తన అనుభవంతో క్యారెక్టర్‌కు ప్రాణం పోశాడు. సునీల్, హరీష్ ఉత్తమన్ లకు మంచి క్యారెక్టర్స్ దక్కాయి. సత్య, రచ్చ రవి, రాకెట్ రాఘవ కొద్దిసేపే సినిమాలో కనిపిస్తారు. అరుణ్ చిలువేరే మ్యూజిక్ కథకు తగ్గట్లుగా ఉంది. రొమాంటిక్ డ్యూయెట్స్ లేకుండా మాంటేజ్‌లోనే పాటలు సాగుతాయి.
ఇమేజ్ ను వాడుకోకుండా…
రామం రాఘవం మంచి ఎమోషనల్ ఎంటర్‌టైనర్ మూవీ. కమెడియన్‌గా తనకున్న ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో కాకుండా తాను నమ్మిన కథతో ధన్‌రాజ్ నిజాయితీగా ఈ సినిమా చేశాడు. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఓకే అనిపిస్తుంది.
రేటింగ్: 2.75/5
సంబంధిత కథనం