



Best Web Hosting Provider In India 2024

Blood Tests: ఏడాదికి ఒక్కసారి ప్రతి ఒక్కరూ కచ్చితంగా చేయించుకోవాల్సిన రక్తపరీక్షలు ఇవిగో
Blood Tests: ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. ఆధునిక కాలంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కొన్నిరకాల వైద్య పరీక్షలు ఏటా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రక్త పరీక్షలు మన శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడానికి సహాయపడతాయి.
రక్త పరీక్షల ద్వారా మన శరీరంలో ఉన్న అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చు. దీర్ఘాయువును పొందాలంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి. కొన్ని రక్త పరీక్షల ద్వారా చాలా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. కాబట్టి ప్రతి ఏడాది ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా, రక్త పరీక్షలు మన శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడానికి సహాయపడతాయి. ఇక్కడ మీరు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 ముఖ్యమైన రక్త పరీక్షల గురించి ఉంది.
లిపిడ్ ప్రొఫైల్: లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష రక్తంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కొలుస్తుంది. LDL (చెడు కొలెస్ట్రాల్) పెరిగితే గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. HDL (మంచి కొలెస్ట్రాల్) తగ్గినా కూడా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ద్వారా, మీరు గుండె సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చు.
రక్తంలోని చక్కెర స్థాయి పరీక్ష: రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండే డయాబెటిస్ వచ్చినట్టే. ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోస్ (FPG), హిమోగ్లోబిన్ A1C (HbA1c) పరీక్షలు రక్తంలోని చక్కెర స్థాయిని కొలవడానికి ఉపయోగపడతాయి. ఈ పరీక్షలను చేయించుకోవడం ద్వారా, డయాబెటిస్ వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు.
కాలేయ పనితీరు పరీక్ష: లివర్ శరీరంలోని ముఖ్యమైన అవయవం. ఇది విషపూరిత పదార్థాలను శుద్ధి చేస్తుంది. పిత్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. LFT ద్వారా లివర్ ఎంజైమ్ స్థాయిలను కొలుస్తారు. ఉదాహరణకు అలనైన్ ట్రాన్స్ అమినేస్ (ALT), ఆస్పార్టేట్ ట్రాన్స్ అమినేస్ (AST), ఆల్కలైన్ ఫాస్ఫటేస్ (ALP) వంటివి కొలుస్తారు. ఈ పరీక్ష ద్వారా కాలేయ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చు.
కిడ్నీ పనితీరు పరీక్ష: కిడ్నీ శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. KFT ద్వారా కిడ్నీ పనితీరును కొలుస్తారు. ముఖ్యంగా సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా నైట్రోజన్ స్థాయిలను పరిశీలిస్తారు. ఈ పరీక్షలను చేయించుకోవడం ద్వారా, కిడ్నీ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు.
విటమిన్ డి స్థాయి పరీక్ష: విటమిన్ డి మన శరీరంలోని ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ సమతుల్యతకు చాలా అవసరం. విటమిన్ డి లోపం ఎముకల బలహీనత, ఎముక నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. విటమిన్ డి స్థాయి పరీక్ష ద్వారా, లోపాన్ని గుర్తించి తగిన పోషకాలను తీసుకోవచ్చు.
పైన పేర్కొన్న అయిదు రక్త పరీక్షలను చేయించుకోవడం ద్వారా, మీరు అనేక వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందవచ్చు. ఇవి మీ దీర్ఘాయువును పెంచడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి సహాయపడతాయి. వైద్యుని సలహాతో ఈ పరీక్షలను చేయించుకొని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం