Best Web Hosting Provider In India 2024
.jpg)
తాడేపల్లి: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా నిధులను నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా కింద రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. నేడు అందించనున్న సాయంతో కలిపి వైయస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇప్పటి వరకు 46,062 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.348.84 కోట్లు ప్రభుత్వం జమ చేసినట్టు అవుతుంది.
పేద తల్లిదండ్రులు పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించే సామాజిక బాధ్యతకు అండగా నిలుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు ‘వైయస్ఆర్ కళ్యాణమస్తు’, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు ‘వైయస్ఆర్ షాదీ తోఫా’ ద్వారా ఆర్థిక సాయాన్ని వైయస్ జగన్ ప్రభుత్వం అందిస్తోంది. పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న ఆలోచనతో వైయస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫాలకు అర్హతలు నిర్ణయించారు. వధూవరులిద్దరు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. బాల్య వివాహాల నివారణకు పెళ్లి నాటికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధన పెట్టారు.