



Best Web Hosting Provider In India 2024

Budida Gummadi Vadiyalu: బూడిద గుమ్మడికాయ వడియాలు ఇలా ఇంట్లో సులువుగా పెట్టేయండి, క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి
Budida Gummadi Vadiyalu: బూడిద గుమ్మడికాయ వడియాలను పూర్వం నుంచి తింటూనే ఉన్నాము. అయినా ఇప్పటికే ఎంతోమందికి వీటిని పెట్టడం రాదు. చాలా సులువుగా బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో తెలుసుకోండి.
బూడిద గుమ్మడి వడియాలు ఎంతో మందికి ఇష్టం. కానీ వీటిని చేయడం చాలా కష్టమని భావించి వాటిని కొనేందుకు ఇష్టపడతారు. నిజానికి ఇంట్లోనే వీటిని హెల్తీగా, శుచిగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మేము సింపుల్ గా బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో ఇచ్చాము. ఎండాకాలం వచ్చేస్తోంది. కాబట్టి వీటిని ఎలా పెట్టాలో తెలుసుకుంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెసిపీ తెలుసుకోండి.
బూడిద గుమ్మడి వడియాలు రెసిపీకి కావలసిన పదార్థాలు
బూడిద గుమ్మడికాయ – ఒకటి
మినప్పప్పు – అరకిలో
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – ఒక స్పూను
జీలకర్ర – రెండు స్పూన్లు
పచ్చిమిర్చి – 15
అల్లం – పెద్ద ముక్క
సగ్గుబియ్యం – పావు కప్పు
బూడిద గుమ్మడికాయ వడియాలు రెసిపీ
1. మీడియం సైజులో ఉన్న బూడిద గుమ్మడికాయని తీసుకొని సన్నగా తరగాలి.
2. అందులో ఉన్న గింజలను పడేయకుండా అలానే ఉంచాలి.
3. వాటిని ఒక ప్లేట్లో వేసి పసుపు, ఉప్పు కలిపి పది నిమిషాలు పక్కన పెట్టాలి.
4. తర్వాత ఒక కాటన్ వస్త్రాన్ని తీసుకొని అందులో ఈ గుమ్మడికాయ మిశ్రమాన్ని వేసి మూటలా కట్టి గట్టిగా నొక్కి పిండాలి.
5. గుమ్మడికాయలు ఎక్కువగా నీరే ఉంటుంది. ఆ నీరు అంతా బయటికి వచ్చేలా చేయాలి.
6. తర్వాత ఈ వస్త్రాన్ని మూటలా కట్టి చిన్న పీటపై లేదా స్టూలు పై పెట్టాలి.
7. ఆ మూటపైన ఎక్కువ బరువున్న వస్తువు పెట్టాలి. అలా పెట్టడం వల్ల గుమ్మడికాయలో మిగిలిన నీరు కూడా బయటకు వచ్చేస్తుంది.
8. కనీసం 6 గంటల పాటు అలా పెట్టి వదిలేయాలి.
9. ఇప్పుడు పొట్టు ఉన్న మినప్పప్పును తీసుకొని నానబెట్టాలి.
10. ఇప్పుడు 6 గంటల తర్వాత మినప్పప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
11. సగ్గుబియ్యం నీటిలో వేసి నానబెట్టుకోవాలి.
12. గుమ్మడికాయ మూటను తీసి ముడి విప్పి పెట్టాలి.
13. అందులో ఉన్న గుమ్మడి మిశ్రమాన్ని రెండు చేతులతో తీసుకొని గట్టిగా పిండి ఒక ప్లేట్లో వేసుకోవాలి.
14. ఇంకా ఏదైనా నీళ్లు మిగిలిపోతే అలా పిండినప్పుడు వచ్చేస్తుంది.
15. ఇప్పుడు మొత్తం రుబ్బుకున్న మినప్పిండి మిశ్రమాన్ని తీసి ఒక పెద్ద గిన్నెలో వేయాలి.
16. అందులోనే పిండుకున్న గుమ్మడికాయ తరుగును కూడా వేయాలి.
17. అలాగే ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి.
18. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
19. ఆ మిశ్రమాన్ని కూడా మినప్పప్పు, గుమ్మడి తరుగు మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఒకసారి రుచి చూసుకోవాలి.
20. ఉప్పు తక్కువగా అనిపిస్తే ఉప్పును వేసుకోవచ్చు. అలాగే జీలకర్రను కూడా వేసి బాగా కలపాలి.
21. ఇప్పుడు ఒక పెద్ద కాటన్ చీరను తీసుకొని పరవాలేదు. దానిపై ఈ గుమ్మడికాయ వడియాలను పెట్టుకోవాలి.
22. ఎర్రటి ఎండలో రెండు నుంచి మూడు రోజులు ఎండితే చాలు, వడియాలు రెడీ అయిపోతాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
23. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేస్తే చాలా సులువుగా ఈ వడియాలు సిద్ధమైపోతాయి.
బూడిద గుమ్మడికాయ వడియాలకు అభిమానులు ఎక్కువే. కానీ వాటిని చేసే పద్ధతి తెలియక ఎంతోమంది మార్కెట్లోనే కొని తెచ్చుకుంటున్నారు. నిజానికి మార్కెట్లో కొన్న బూడిద గుమ్మడి వడియాలలో ఉప్పు అధికంగా ఉంటుంది. ఎక్కువకాలం నిల్వ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇలా ఉప్పు అధికంగా వేసి వడియాలు పెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వడియాలు కన్నా ఇంట్లోనే ఇలా వడియాలు తయారు చేసుకుంటే ఇవి 6 నెలల నుంచి సంవత్సరం వరకు తాజాగా ఉంటాయి.
సంబంధిత కథనం