


Best Web Hosting Provider In India 2024
AP Budget 2025 : ఆశల పద్దుకు వేళాయే.. ఈనెల 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కూటమి ప్రభుత్వం
AP Budget 2025 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. 28వ తేదీన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. ఏపీ అభివృద్ధిలో ఈ బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందని నేతలు చెబుతున్నారు.
రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 28న చట్ట సభలకు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపడతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రవేశపెట్టే తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడంతో.. ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఉభయ సభల సమావేశం ప్రారంభం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఈనెల 25న గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉండనుంది.
వనరుల సమీకరణపై ఫోకస్..
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో చెప్పిన పథకాల అమలు కోసం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం వనరుల సమీకరణపై ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులతో రెండు మూడుసార్లు సమావేశమయ్యారు.
మంత్రులతో సమావేశాలు..
చంద్రబాబుతో సమావేశం తర్వాత.. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖల ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. ముఖ్యంగా జలవనరుల శాఖ, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, వైద్య శాఖలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎక్కువ నిధులు రాబట్టేలా..
ఇటు కేంద్ర ప్రాయోజిత పథకాలను ఎక్కువగా వినియోగించుకునేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అటు కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు రాబట్టేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ.. నిధులు సమీకరించుకోవాలి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా విద్య, వైద్య శాఖ ద్వారా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు పొందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
మూడు కొత్త పథకాలకు..
సూపర్‌సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను.. కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నూతన ఇసుక విధానాన్ని అమలు చేసింది. దీంతో ఆదాయం తగ్గింది. పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేస్తోంది. ఇది కొంతమేర ఊరటనిస్తోంది. అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక సాయం చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరుతున్నారు.
రూ.3 లక్షల కోట్లతో..
గత ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టు పెట్టిందని.. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్లతో నవంబర్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.
టాపిక్