



Best Web Hosting Provider In India 2024

Bird Flu Effect : బర్డ్ ఫ్లూ భయం.. వారంపాటు చికెన్ మార్కెట్ బంద్.. వ్యాపారుల ప్రకటన!
Bird Flu Effect : బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ సెంటర్ల వైపు చూడటం లేదు. నిపుణులు అవగాహన కల్పించినా.. కోడి మాంసం కొనడం లేదు. దీంతో వ్యాపారం నడవడం లేదని ట్రేడర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఆదిలాబాద్‌లో వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చికెన్ మార్కెట్‌ను బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆదిలాబాద్‌లో చికెన్ మార్కెట్ బంద్ కానుంది. వారంపాటు బంద్ చేస్తున్నట్టు వ్యాపారులు ప్రకటించారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారం లేక చికెన్ మార్కెట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. వారం తర్వాత పరిస్థితిని చూసి మార్కెట్ ఓపెన్ చేస్తామని అంటున్నారు వ్యాపారులు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ భయం లేదని చెప్పినా.. ప్రజలు కొనడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.
అదుపులోనే ఉంది..
తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్టు అధికారిక ప్రకటన రాలేదు. మన పక్కనున్న ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఏపీలోనూ బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులోనే ఉందని.. ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర నాయుడు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగిన తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు, కృష్ణా జిల్లా బాదంపూడి, కర్నూలు జిల్లా ఎన్.ఆర్.పేట, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
ఎక్కువ వేడి చేయాలి..
బర్డ్ ఫ్లూ ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఇది పక్షుల నుండి మనుషులకు వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని నివారించడానికి కోడి మాంసాన్ని సరిగ్గా ఉడికించడం చాలా ముఖ్యం అని స్పష్టం చేస్తున్నారు. కోడి మాంసాన్ని కనీసం 165 డిగ్రీల ఫారెన్‌హీట్ (74 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి. మాంసం పూర్తిగా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి.. ఒక ఫోర్క్ లేదా టూత్‌పిక్‌ను మాంసంలో గుచ్చి చూడాలి. రసం బయటకు రాకపోతే, మాంసం ఉడికినట్లు అర్థం. మాంసాన్ని బాగా ఉడికించడం వల్ల వైరస్ నశిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జాగ్రత్తలు పాటించాలి..
పచ్చి కోడి మాంసాన్ని తాకిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వంట చేసే పాత్రలను శుభ్రంగా ఉంచాలి. కోడి మాంసంతో ఉపయోగించిన పాత్రలను వేడి నీటితో శుభ్రంగా కడగాలి. కోడి గుడ్లను కూడా బాగా ఉడికించి తినాలి. బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తులకు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతాయి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
వ్యాపారులకు నష్టం..
బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ కొనడం మానేస్తున్నారు. దీనివల్ల చికెన్ ధరలు పడిపోయాయి. చికెన్ అమ్మకాలు తగ్గిపోవడం వలన వ్యాపారులు నష్టపోతున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది కోళ్లను చంపేయాల్సి వస్తుంది. దీని వలన కోళ్ల పెంపకం దారులకు నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం కూడా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు బర్డ్ ఫ్లూ గురించి అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
టాపిక్