



Best Web Hosting Provider In India 2024

KCR : కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు.. అనర్హుడిగా ప్రకటించాలని ఆదేశించండి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు!
KCR : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు.. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ హైకోర్టులో ఫిబ్రవరి 20వ తేదీ గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంట్లో బీఆర్ఎస్ చీఫ్ కె.చంద్రశేఖర్ రావు ప్రతిపక్ష నాయకుడిగా తన విధిని నిర్వర్తించడానికి అసెంబ్లీకి హాజరయ్యేలా చూడాలని.. గైర్హాజరైతే ఆయనను ఎమ్మెల్యేగా అనర్హులుగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్, ఆయన కార్యదర్శిని ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు.
విజయ్‌పాల్ రెడ్డి పిటిషన్..
“ప్రజలు తనకిచ్చిన బాధ్యతను తప్పించుకుంటే ఎలా. కేసీఆర్‌ను శాసనసభ్యుడిగా అనర్హులుగా ప్రకటించండి” అని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉంటే.. మరొకరిని ఎల్ఓపీగా నామినేట్ చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించాలని.. రైతు సంఘాల సమాఖ్య ప్రతినిధి డి.విజయ్‌పాల్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. “ప్రజలకు సంబంధించిన సమస్యలను, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎల్ఓపి లేవనెత్తాలి” అని పిటిషనర్ వ్యాఖ్యానించారు.
పరిష్కారం చూపండి..
ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఖాళీగా ఉండకుండా చూడాలని.. ఈ సమస్యకు పరిష్కారాన్ని సూచించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఫిబ్రవరి 1న అసెంబ్లీకి హాజరయ్యే విషయంపై స్పీకర్, ఆయన కార్యదర్శికి లీగల్ నోటీసు పంపామని చెప్పారు. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. దీంతో జోక్యం చేసుకోవాలని హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని డి.విజయ్‌పాల్ రెడ్డి వివరించారు. ఈ పిటిషన్ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టులో కేసు..
ఇప్పటికే తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్.. పలువురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్‌లు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ)ను దాఖలు చేశారు.
ఏడుగురు ఎమ్మెల్యేలపై..
మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్‌ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గురించి పిల్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
టాపిక్