చంద్రబాబు బాదుడుతో ప్రజలు బెంబేలు

Best Web Hosting Provider In India 2024

ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచమంటూ హామీ

అధికారంలోకి రాగానే ట్రూఆప్ పేరుతో రూ.15,780 కోట్ల భారం

తాజాగా 30 లక్షల మంది చిరు వ్యాపారులపై సర్ చార్జీల మోత

వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఆగ్రహం

తాడేపల్లి: అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు ఎటువంటి అబద్దపు హామీలనైనా ఇవ్వడం చంద్రబాబుకు వెన్నతొ పెట్టిన విద్యని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీల భారం ఉండదూ అంటూ హామీ ఇచ్చి, నేడు అధికారంలోకి రాగానే సర్ చార్జీల పేరుతో వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్దమయ్యారని మండిపడ్డారు. చంద్ర‌బాబు బాదుడుతో ప్ర‌జ‌లు బెంబేలు ఎత్తుతున్నార‌ని చెప్పారు. తాజా ఏపీఈఆర్సీ నివేదికలో సర్ చార్జీల ముసుగులో చిరు వ్యాపారులపై పెద్దఎత్తున విద్యుత్ చార్జీల భారాన్ని మోపేందుకు చేస్తున్న ప్రయత్నం బట్టబయలైందని అన్నారు. శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు.  

తాము అధికారంలోకి వస్తే ప్రజలపై విద్యుత్ చార్జీల మోత ఉండదని, పైగా పెంచిన చార్జీలను కూడా తగ్గిస్తామంటూ ఎన్నికలు ముందు చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ హామీని నిలబెట్టుకోక పోగా, ఇప్పటికే ట్రూఅప్ చార్జీల పేరుతో 25.11.2024న దీపావళి కానుకగా ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ పవర్ అడ్జెస్ట్ మెంట్ కాస్ట్ పేరుతో రూ.6,072 కోట్లు, 29.11.2024న రూ.9,412 కోట్లు తొలి ఆరునెలల్లోనే మొత్తం రూ. 15,780 కోట్లు భారంతో ప్రజల నడ్డి విరిచారు. ఇప్పటి వరకు హైటెన్షన్ విద్యుత్ కనెక్షన్లు కలిగిన పరిశ్రమలు పీక్ అవర్స్ లో వినియోగించే విద్యుత్ కు గానూ సర్ చార్జీలను వసూలు చేస్తున్నారు. తాజాగా ఏపీఈఆర్సీ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇకపై లోటెన్షన్ విద్యుత్ కనెక్షన్ కలిగిన రాష్ట్రంలోని 30 లక్షల మంది చిరు వ్యాపారుల నుంచి కూడా పీక్ అవర్స్ సర్ చార్జీలను వసూలు చేయబోతున్నారు. అంటే పీక్ అవర్స్ లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు వినియోగించే విద్యుత్ కు అదనంగా విధించే ఈ సర్ చార్జీలను కూడా కలిపి చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేక చిరు వ్యాపారులు చితికిపోయే పరిస్థితి కల్పిస్తున్నారు. అలాగే వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన వారే నేడు ఈ మీటర్లను రాష్ట్రంలోని 1.60 కోట్ల మంది సాధారణ వినియోగదారుల ఇళ్లలో భిగించనున్నారు. అంటే భవిష్యత్తులో ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా ఆయా గృహ వినియోగదారులు పీక్ అవర్స్ లో వాడే విద్యుత్ ను లెక్కించి, దానిపై కూడా అదనంగా పీక్ అవర్స్ లో వాడే విద్యుత్ పై సర్ చార్జీల రూపంలో వడ్డనలకు కూటమి ప్రభుత్వం సిద్దమవుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. మా పాలనలో అసలు విద్యుత్ చార్జీల వడ్డింపే ఉండదంటూ హామీలు గుప్పించిన చంద్రబాబు ఇప్పటికే ట్రూఅప్ చార్జీలతో ప్రజల నడ్డి విరిచి, ఇప్పుడు పీక్ అవర్ సర్ చార్జీల ముసుగులో అసలు కరెంట్ వాడాలనే తలంపు వస్తేనే షాక్ కొట్టేలా చేస్తున్నారు.
 

Best Web Hosting Provider In India 2024