



Best Web Hosting Provider In India 2024

Rare Allergy: ఈ అమ్మాయికి నీరు యాసిడ్‌తో సమానం, ముట్టుకుంటే చర్మం కాలిపోతుంది, తాగితే ఇంకా కష్టం
Rare Allergy : ప్రపంచంలో ఎన్ని ఎన్నో అలెర్జీలు ఉన్నాయి. కానీ అది కష్టమైన, క్లిష్టమైనది నీటి అలెర్జీ. ఎందుకంటే నీరు లేకుండా మనిషి జీవించలేడు. కానీ ఓ పాతికేళ్ల అమ్మాయి నీటి అలెర్జీతో ఇబ్బంది పడుతోంది.
అలెర్జీలు ఎంతో మందికి సహజంగానే వస్తూ ఉంటాయి. కొంతమందికి కోడిగుడ్డు తింటే అలెర్జీ వస్తుంది. మరికొందరికి పుట్టగొడుగులు తింటే అలెర్జీ. అలాగే కొన్ని రకాల మొక్కలు వంటివి తాకినా కూడా చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఇవన్నీ కూడా అలెర్జీల వల్లే వస్తాయి. అయితే అతి అరుదైన అలెర్జీతో బాధపడుతోంది ఒక బ్రిటిష్ మహిళ. ఆమె వయసు కేవలం పాతికేళ్ళు. పేరు కెండాల్ ప్రైస్.
కెండాల్ కు తీవ్రమైన నీటి అలెర్జీ ఉంది. దీన్నే ఆక్వాజెనిక్ ఉర్టికేరియా అని అంటారు. ఇది ఆమె జీవితాన్ని నరకం చేసేస్తోంది. కనీసం స్నానం చేయలేదు. తనివితీరా నీళ్లు తాగలేదు. ఎప్పుడైనా వర్షం వస్తునప్పుడు రోడ్డుపై చిక్కుకుపోతే ఇక అంతే సంగతులు. ఆమెకు ఆ నీటి చుక్కలు శరీరంపై పడినప్పుడల్లా యాసిడ్ పడినట్టు మంట, దురద వస్తాయి. ఆ చర్మం అంత కాలిపోయినట్టు అవుతుంది.
ఈ నీటి అలెర్జీ వల్ల ఆమె నరకం అనుభవిస్తోంది. కనీసం తనను తాను శుభ్రపరచుకోలేకపోతోంది. దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతోంది. ఈ వ్యాధి కారణంగా కేవలం వారానికి రెండు సార్లు మాత్రమే స్నానం చేయగలుగుతుంది. ఇవన్నీ కూడా ఆమెపై ఎన్నో దుష్ప్రభావాలను చూపిస్తున్నాయి.
ఆక్వాజెనిక్ ఉర్టికేరియా అంటే ఏమిటి?
నీటి అలెర్జీని ఆక్వాజెనిక్ ఉర్టికేరియా అనే పదంతో పిలుస్తారు. ఉర్టికేరియా అంటే దద్దుర్లు అని అర్థం. నీటితో అనుబంధంలోకి వచ్చిన వ్యక్తికి వెంటనే శరీరంపై ఎంతో బాధపెట్టే దద్దుర్లు వస్తాయి. అందుకే దీనికి ఆక్వాజెనిక్ ఉర్టికేరియా అనే పేరు పెట్టారు. ఈ దద్దుర్లు చర్మంపై ఎరుపు రంగులో ప్యాచుల్లా కనిపిస్తాయి. చాలావరకు యుక్త వయసులో ఉన్న వారికే ఇది సంభవిస్తుంది. ప్రపంచంలో చాలా తక్కువ మందికి ఈ నీటి అలెర్జీ ఉంది. 1964 నుండి చూస్తే ఇప్పటివరకు 37 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి.
నీటి అలెర్జీ లక్షణాలు
అలెర్జీ లక్షణాలు చాలా విచిత్రంగా ఉంటాయి. నీటి చుక్క చర్మంపై పడితే చాలు అక్కడ మంట పుట్టుకొస్తుంది. ఏదో దోమలు, చీమలు కుట్టిన అనుభూతి వస్తుంది. అక్కడంతా వాచిపోతుంది. దురదతో కూడిన చర్మ దద్దుర్లు వచ్చేస్తాయి. ఇక నీరు తాగితే గొంతులో మంటగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది వచ్చేస్తుంది. అందుకే ఈమె అందరిలా కాకుండా కొంచెం కొంచెంగా నీటిని తాగుతూ ఉంటుంది. అయినా కూడా దానికి తగ్గ మందులు వేసుకోవాలి.
ఈమెకు పెళ్లయి ఒక బిడ్డ కూడా ఉంది. ఆ బిడ్డకు స్నానం కూడా చేయించలేకపోతోంది. ఈ వ్యాధి తనకు యుక్త వయసు వచ్చాక బయటపడిందని చెబుతోంది కెండాల్. ఈ వ్యాధి ప్రారంభంలో ముల్లులతో చర్మంపై గుచ్చినట్లు పదునైన నొప్పి వచ్చేదని, అది కేవలం నీటిని తాకినప్పుడే రావడం గమనించానని ఆమె చెప్పింది. నీరు ఎక్కువగా పడినప్పుడు లైటర్ తో కాల్చినట్టు అనిపించేదని ఆమె వివరించండి.
ఈ వ్యాధికి అసలు కారణం ఏంటో శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేకపోయారు. నీటిని చర్మం తాకినప్పుడు శరీరంలో హిస్టామైన్ విడుదలవుతుంది. హిస్టామైన్ అనేది అలెర్జీ లాంటి లక్షణాలను కలిగిస్తుంది. హిస్టామైన్ అనేది అలెర్జీ ప్రతిచర్య సమయంలో విడుదలయ్యే ఒక రసాయనం. నీటికి ఈమె శరీరం గురైనప్పుడు ఈ హిస్టామైన్ ఎలా విడుదలవుతుందో మాత్రం ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు వైద్యులు.
చికిత్స ఉందా?
ఈ పరిస్థితికి శాశ్వత చికిత్స లేదు. వైద్యులు ఆ లక్షణాలు నుంచి కాస్త ఉపశమనం కలిగించడానికి కొన్ని మందులను మాత్రమే సూచిస్తారు. ముఖ్యంగా యాంటీ హిస్టామైన్ మందులను సూచిస్తారు. ఇవి దురద, వాపును తగ్గిస్తాయి. అలాగే మంట అధికంగా ఉంటే ఫోటో థెరపీని చేస్తారు. చర్మంపై ఉన్న పొరను ఇది చిక్కగా, మందంగా చేస్తుంది. దీనివల్ల చర్మం లోకి నీరు చొచ్చుకపోకుండా అడ్డుకుంటుంది. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే దానికి ప్రత్యేకమైన చికిత్సను అందిస్తారు. ఏదేమైనా నీటి అలెర్జీ ఉన్న ఈమె జీవితం నరకప్రాయంగా ఉంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం