



Best Web Hosting Provider In India 2024

APPSC Group 2 : ఏపీలో గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళనలేంటీ? రోస్టర్ విధానాన్ని ఎందుకు మార్చమంటున్నారు?- 9 కీలక అంశాలివే
APPSC Group 2 Roster : ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. రోస్టర్ విధానాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పే కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆరోపిస్తున్నారు. రోస్టర్ మార్చే వరకు గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
APPSC Group 2 Roster : రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు నష్టంగా ఉన్న రోస్టర్ విధానాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన 9 కీలక అంశాలివే.
1. రాష్ట్రంలో 899 పోస్టులు భర్తీ చేసేందుకు గత వైసీపీ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పుడే గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆ తరువాత ఎన్నికలు రావడంతో గ్రూప్-2 మెయిన్స్ ఆగిపోయింది. అయితే అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన మెయిన్స్ పరీక్ష ఎట్టకేలకు ఫిబ్రవరి 23 (ఆదివారం) నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 92,250 మంది అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. 13 ఉమ్మడి 13 జిల్లాల్లోని 175 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
2. నోటిఫికేషన్‌లో ఇచ్చిన రోస్టర్ విధానంలోనే పొరపాట్లు జరిగాయని అభ్యర్థులు తొలి నుంచి లేవనెత్తుతున్నారు. విశాఖపట్నం, కాకినాడ వంటి ప్రాంతాల్లో అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన కూడా చేపట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గ్రూప్-2 అభ్యర్థులు వైపు గట్టిగా మాట్లాడింది. రోస్టర్ విధానంలో చోటు చేసుకున్న పొరపాట్లను సరి చేయాలని డిమాండ్ చేసింది. విశాఖపట్నంలో గ్రూప్-2 అభ్యర్థులు చేసిన ధర్నాలో టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి కూడా పాల్గొని నాటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
3. ప్రభుత్వం కూడా రోస్టర్ విధానంలో పొరపాట్లు చోటు చేసుకున్నాయని, దాన్ని సరిచేస్తామని పేర్కొంది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో అది పక్కకు పోయింది. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ కూటమి దాని గురించి పట్టించుకోలేదు. గత పొరపాట్లను సరి చేయకుండానే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు సిద్ధపడింది. దీంతో టీడీపీ ప్రభుత్వంపై అభ్యర్థులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
4. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళనలు పెరిగాయి. హైకోర్టు కూడా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలో తాము జోక్యం చేసుకోలేమని తెగేసి చెప్పింది. అయితే రోస్టర్ విధానంలో తప్పులను సరి చేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. రోస్టర్ విధానంలో మార్పులు చేసి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది.
5. రోస్టర్ పాయింట్స్‌లో తప్పులు ఉన్నాయని నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందున్నారు. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో జీవో 77ను అమలు చేస్తున్నామని తెలిపింది. అయితే ఈ జీవో నెంబర్ 77లో మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయొద్దని పేర్కొంది. కానీ గ్రూప్-2 నోటిఫికేషన్‌లో మహిళకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఇలా రోస్టర్ విధానంలో మహిళలకు, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులు, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు రోస్టర్ పాయింట్స్ అదనంగా ఇచ్చారని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
6. హైకోర్టు కూడా రోస్టర్ విధానంలోని పొరపాట్లను సరి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చిందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం అదేమీ చేయకుండా పరీక్షల నిర్వహించడంపై గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. విశాఖపట్నంతో పాటు వివిధ ప్రాంతాల్లో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.
7. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో ఇచ్చిన రోస్టర్ విధానం లోపభూయిష్టంగా ఉందని, దీనివల్ల నిరుద్యోగులకు నష్టం కలుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ విధానాన్ని మార్చిన తరువాతే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పే, ఈ ప్రభుత్వం కూడా చేస్తోందని మండిపడుతున్నారు. రోస్టర్ విధానంలో తప్పుల వల్ల రాష్ట్రంలోని 92 వేల మంది అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఏపీపీఎస్పీ స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
8. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ స్పందించి రోస్టర్ పాయింట్స్‌లో జరిగిన పొరపాట్లును సరి చేసి భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. రోస్టర్ పాయింట్స్ తప్పులను సరిచేయకుండా అభ్యర్థులకు న్యాయం జరగదని పేర్కొంది. అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేసింది.
9. గత రెండు వారాలు నుంచి నిరుద్యోగులు మానసిక వేదనతో సతమతమవుతున్నారని, ఐదేళ్ల తరువాత వచ్చిన నోటిఫికేషన్ కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని డీవైఎఫ్ఐ పేర్కొంది. రోస్టర్ విధానంలో తప్పులు ఉండటం వలన గతంలో కోర్టులో తీర్పు ద్వారా కొన్ని రాష్ట్రాల్లో నోటిఫికేషన్లను సైతం రద్దు చేశారని, ఉద్యోగం చేస్తున్న వారిని సైతం తొలగించిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేసింది. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగీకరించిందని, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్