



Best Web Hosting Provider In India 2024

Lord Shiva Temples : మహాశివరాత్రి స్పెషల్ – హైదరాబాద్ కు దగ్గర్లోని ప్రముఖ శివాలయాలు ఇవే…!
మహాశివరాత్రి వేళ భక్తులు శివాలయాలకు భారీగా తరలివెళ్తుంటారు. అయితే హైదరాబాద్ నగరంతో పాటు సమీపంలోనే కొన్ని ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఈ టెంపుల్స్ ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి….
మహాశివరాత్రి 2025 – హైదరాబాద్ సమీపంలోని ఆలయాలు (image source istockphoto.com)
మహాశివరాత్రి…. హిందువులు అత్యంత ప్రవితమైన దినంగా భావిస్తుంటారు. మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు మహా శివరాత్రి. అందుకే భక్తులు ఆ రోజంతా శివ నామాన్ని స్మరిస్తారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. ఈ పర్వదినం రోజున శివుడికి అభిషేకం నిర్వహించి, ఉపవాసం చేసి, రాత్రంతా జాగరణ చేస్తుంటారు.
ఈ పవిత్రమైన రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తమకు దగ్గరలో ఉండే ప్రముఖ శైవక్షేత్రాల్ని దర్శించుకుంటారు. మహా శివరాత్రి పర్వదినం రోజున ఆ శివుడిని దర్శించుకుంటే…అంతా మంచి జరుగుతుందని భావిస్తుంటారు. అయితే హైదరాబాద్ తో పాటు నగరానికి అత్యంత సమీపంలో ప్రముఖ శైవక్షేత్రాలు కొలువుదీరి ఉన్నాయి. వాటి వివరాలను ఇక్కడ చూడండి……
- కీసరగుట్ట ఆలయం: ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో కీసరగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం (కేసరగిరి క్షేత్రం) ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోనే చాలా పురాతన, చారిత్రక ఆలయం. మేడ్చల్ జిల్లా పరిధిలోని కీసరలో ఉంటుంది. ఈ ఆలయం త్రేతయుగ నుంచి ఉనికిలో ఉందని నమ్ముతారు. అప్పట్లో కేసరిగిరి అని పిలిచేవారని… కాలక్రమేణా “కీసర గుట్ట” గా మారిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. రామలింగేశ్వరస్వామి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఇక్కడ భారీగా ఉండే హనుమంతుడి విగ్రహం కూడా కొలువుదీరి ఉంటుంది. మహాశివరాత్రి వేళ ఇక్కడికి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
- శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయం(గౌలిగూడ): హైదరాబాద్ లోని గౌలిగూడలోని శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయం చాలా ప్రముఖమైనది. ఇది కాశీ విశ్వనాథుడి రూపంలో ఉన్న శివుడికి అంకితం చేయబడిందని చెబుతుంటారు. ఇక్కడికి చాలా మంది భక్తులు దర్శనం కోసం వస్తారు.
- శ్రీ సోమనాథ్ ఆలయం: హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర్లో శ్రీ సోమనాథ్ ఆలయం ఉంటుంది. 500 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆలయంగా పేరుంది. శివరాత్రి వేళ భారీ సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తుంటారు.
- శ్రీ హాటకేశ్వర్ ఆలయం (కార్వాన్): హైదరాబాద్ లోని కార్వాన్ లో శ్రీ హాటకేశ్వర్ ఆలయం ఉంది. పురాతమైన శివాలయంగా పేరొందింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇక్కడికి భక్తులు వస్తుంటారు.
- శ్రీ మహాదేవ్ ఆలయం (ఫిల్ ఖానా): హైదరాబాద్ నగరం నడ్డిబొడ్డున ఉండే ఫిల్ ఖానా ప్రాంతంలో శ్రీ మహాదేవ్ ఆలయం ఉంటుంది. ఇక్కడ కూడా శివుడినే పూజిస్తారు.
- ఏడుపాయల వన దుర్గా భవానీ ఆలయం: ఏడుపాయలు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. మెదక్ జిల్లా పరిధిలోని పాపన్నపేట మండలంలోని నాగ్‌సాన్‌పల్లి వద్ద అడవిలో ఉంది. మెదక్ జిల్లా నుండి 14కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు మహశక్తి అవతారంగా దర్శనం ఇస్తారు. అయితే శివరాత్రి సందర్భంగా ఇక్కడ మూడు రోజులపాటు జాతర జరుగుతుంది. ఆలయం ఎదుట పారే మంజీరా నదిలో శివుడి విగ్రహాం ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ శివుడి ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకుంటారు. హైదరాబాద్ నుంచి తక్కువ సమయంలోనే ఇక్కడికి చేరుకోవచ్చు.
- అనంత పద్మనాభ స్వామి ఆలయం(అనంతగిరి): హైదరాబాద్ నగరానికి సమీపంలోనే వికారాబాద్ దగ్గర్లోని అనంతగిరి ఆలయం ఉంటుంది. ఆది శేషునిపై పవలించిన విష్ణువు, ఎడమ వైపు లక్మీ దేవి కూర్చున్నట్లుగా ఉన్న ఈ ఆలయానికి దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందని చరిత్ర చెబుతోంది. శివరాత్రి వేళ స్థానికంగా ఉండే వాళ్లే కాకుండా నగరం నుంచి చాలా మంది భక్తులు వెెళ్తుంటారు.
- చెర్వుగట్టు: ప్రముఖ శైవ క్షేత్రంగా నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది. శివరాత్రి సందర్భంగా చెర్వుగట్టు క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు. స్వామిని దర్శించుకొని తరిస్తారు.
సంబంధిత కథనం
టాపిక్
Telangana NewsHyderabadShivaratriLord ShivaGhmcHmda
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.