Lakshmi Charu: ఒంట్లో వేడిని తగ్గించే లక్ష్మీ చారు, మట్టికుండలో మాత్రమే వండే ఆరోగ్యకరమైన వంటకం

Best Web Hosting Provider In India 2024

Lakshmi Charu: ఒంట్లో వేడిని తగ్గించే లక్ష్మీ చారు, మట్టికుండలో మాత్రమే వండే ఆరోగ్యకరమైన వంటకం

Haritha Chappa HT Telugu
Feb 21, 2025 05:30 PM IST

Lakshmi Charu: ప్రాచీన వంటకం లక్ష్మీచారు. దీన్ని తెలుగిళ్లల్లో తాతల నాటికాలంలో దీన్ని కచ్చితంగా వండుకుని తినేవారు. దీన్ని ఎలా వండాలో తెలుసుకోండి. ఈ వంటకం రెసిపీ తెలుసుకోండి.

లక్ష్మీ చారు రెసిపీ
లక్ష్మీ చారు రెసిపీ (Patnamlo Palleruchulu/Youtube)

లక్ష్మీ చారు వంటకం ఈ తరానికి పూర్తిగా తెలియదు. కానీ మన తాతల కాలంలో లక్ష్మీ చారును ఎక్కువగా తినేవారు. దీన్ని చాలా పవిత్రంగా వండేవారు. వేసవికాలంలో లక్ష్మీ చారును తినడం వల్ల శరీరానికి శీతలీకరణ లక్షణాలు అందుతాయని నమ్ముతారు. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో లక్ష్మీ చారు ఒకటిగా అప్పట్లో చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు దీని గురించి తెలిసిన వారే చాలా తక్కువ ఉన్నారు. అందుకే ఇక్కడ మేము లక్ష్మీ చారు రెసిపీ ఇచ్చాము. దీన్ని వండేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఒకసారి వండితే ఎంతో రుచిగా ఉంటుంది. బియ్యం నీళ్లతో వండే ఈ లక్ష్మీ చారు వండేటప్పుడు మహిళలు పవిత్రంగా ఉండాలని చెబుతారు. స్నానం చేశాకే దీన్ని వండాలని అంటారు. మీకు లక్ష్మీ చారు రెసిపీ తెలుసుకోండి.

లక్ష్మీ చారు రెసిపీకి కావలసిన పదార్థాలు

బియ్యం కడిగిన నీళ్లు – రెండు గ్లాసులు

బియ్యం ఉడికించిన గంజి – రెండు గ్లాసులు

పసుపు – అర స్పూను

ఉప్పు – రుచికి సరిపడా

బెండకాయలు – మూడు

వంకాయ – ఒకటి

పచ్చిమిర్చి – రెండు

కొత్తిమీర తరుగు – ఒక స్పూను

ఉల్లిపాయలు – ఒకటి

ఎండుమిర్చి – రెండు

కరివేపాకులు – గుప్పెడు

లక్ష్మీ చారు రెసిపీ

1. లక్ష్మీ చారు చేసేందుకు ముందుగా ఒక కుండని కొనుక్కోవాలి.

2. ఆ కుండకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. దాన్ని పవిత్రంగా చూసుకోవాలి.

3. ఇప్పుడు ఆ కుండలో బియ్యం కడిగిన నీళ్లను రెండు గ్లాసులు వేయాలి.

4. అలాగే అన్నం ఉడికించిన తర్వాత వచ్చే గంజి నీళ్లు కూడా రెండు గ్లాసులు వేయాలి.

5. ఆ కుండను రెండు రోజులపాటు అలా ఎక్కడైనా ఉట్టిమీద పెట్టి అలా ఉంచేయాలని. పైనా మూత పెట్టడం మర్చిపోవద్దు.

6. కొంతమంది మూడు రోజులపాటు దాన్ని అలానే ఉంచుతారు.

7. ఇప్పుడు దీనితో లక్ష్మీ చారు చేసేందుకు సిద్ధమవ్వాలి.

8. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఈ బియ్యం గంజి నీళ్లను వడకట్టి వేయాలి. వడకట్టకుండా వేసినా పరవాలేదు.

9. అది మీడియం మంట మీద ఉడికించాలి.

10. అందులో పసుపును వేయాలి. తర్వాత పైన మూత పెట్టి పది నిమిషాలు పాటు వదిలేయాలి.

11. మూత తీసి చూస్తే సలసలా గంజి మరుగుతూ ఉంటుంది.

12. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పును వేయాలి.

13. అలాగే పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, కరివేపాకులు, ఉల్లిపాయలు కూడా వేసి ఉడికించాలి.

14. పైన మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి.

15. వంకాయ ముక్కలు, బెండకాయలు పూర్తిగా ఉడికే దాకా ఉడికించాలి.

16. చివరిలో కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ లక్ష్మి చారు రెడీ అయినట్టే.

17. వేడి వేడి అన్నంలో ఈ లక్ష్మీ చారును కలుపుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది శరీరానికి చలువ చేసే రసం.

పూర్వం ఈ లక్ష్మీ చారును వారానికి ఐదు ఆరుసార్లు తినేవారు. ఇది ఎండ వేడి నుంచి కాపాడుతుందని నమ్ముతారు. అలాగే ఎన్నో పోషకాలను కూడా అందిస్తుందని చెబుతారు. బియ్యం కడిగిన నీళ్లలో, అలాగే అన్నం వండిన గంజిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కేవలం వాటితోనే దీన్ని మనం తయారు చేస్తాము. అందుకే లక్ష్మీ చారులో పోషకాలు కూడా ఎక్కువ అని చెప్పుకుంటారు

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024