



Best Web Hosting Provider In India 2024

Water For Infants: ఆరు నెలల లోపు పసిపిల్లలకు నీరు తాగించడం ప్రమాదకరమా? డాక్టర్లు ఎందుకు హెచ్చరిస్తున్నారు!
Water For Infants: దాహంగా ఉన్నారేమో అనే అపోహతో మనలో చాలా మంది ఆరు నెలల లోపు పసిపిల్లలకు నేరుగా నీటిని పట్టిస్తుంటారు. అలా చేయడం ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? వైద్యుల ప్రకారం శిశువుకు ఎంత వయసు వరకూ నీటిని తాగించకూడదో తెలుసుకోండి.
మరికొద్దిరోజుల్లో వేసవి కాలం రాబోతుంది కదా. చాలా మంది తమ బిడ్డల దాహం తీర్చాలని, నీళ్లను నేరుగా ఇవ్వాలనుకుంటారు. పైగా తాము నీరు తాగిన ప్రతిసారి పట్టించేస్తుంటారు. ఇది ప్రమాదకరమే కాదు. కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారొచ్చట! అదెలాగో వైద్యుల మాటల్లోనే తెలుసుకుందాం..
పసిపిల్లలకు నీరు తాగిస్తే హాని కలిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహా మేరకు 6 నెలల లోపు వయస్సున్న వారికి చాలా తక్కువ మొత్తంలోనే నీరు ఇవ్వాలట. అనుమతి కంటే ఎక్కువ నీరు ఇస్తే ప్రమాదం కలుగుతుందట! ఎందుకో, ఎలాగో చూద్దాం.
అవయవ పరిణతి ఉండదు’
చిన్న పిల్లల బాధ్యత వహించే వారు, కొత్తగా డెలివరీ అవబోతున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. తమ బిడ్డలను కాపాడుకోవాలని తపన పడే ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన వాస్తవం ఇది. సాధారణంగా ప్రతి బిడ్డకు ఆరు నెలల వరకూ తల్లి పాలతో మాత్రమే పోషణ అందుతుంది. వారి శరీర వ్యవస్థ కూడా దానికి తగ్గట్టే సిద్ధంగా ఉంటుంది. ఇతర పానీయాలు ఏం పట్టించినా కూడా వాటిని జీర్ణం చేసుకోగల శక్తి వారికి ఉండదు. ముఖ్యంగా నీటిని శుద్ధి చేసుకోగలిగే అవయవ పరిణితి శిశుల్లో ఉండదు. అటువంటి వయస్సులో చల్లని నీరు లేదా మరిగించి చల్లార్చిన నీరు, పండ్ల రసాలు వంటివి ఇవ్వడం బిడ్డకు హాని చేస్తుంది.
అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఆరు నెలల లోపు ఉన్నవారిలో మూత్రపిండాలు పెద్దవారి కంటే సగం లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. చూడటానికి కూడా చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి, అవి పెద్ద మొత్తంలో నీటిని శుద్ధి చేయలేవు. ఇటువంటి సమయంలో మీరు అదనపు నీటిని తాగిస్తే అది వారి రక్తంలోని ఉప్పును కరిగించేస్తుంది. ఒకవేళ పసిపిల్లలకు నీరు తాగించాలని అనుకుంటే చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ఇవ్వాలి.
డబ్బా పాలతో నీరు పట్టిస్తే ఏమవుతుంది
తల్లిపాలలో దాదాపు 87% నీరు, ఫార్ములా పాలు (డబ్బా పాలు)లో దాదాపు 85% నీరు ఉంటాయి కదా. అవి తాగినప్పుడు సురక్షితంగానే ఉంటున్నారు కదా అనే సందేహం కొందరిలో కలగొచ్చు. కానీ, ఈ రెండింటిలో పోషకాలతో పాటు ఎలక్ట్రోలైట్లు చాలా పరిమిత మొత్తంలో నీటితో కలిపి ఉంటాయి. ఇవి శిశువుకు సురక్షితం కూడా. అలా కాకుండా డబ్బా పాలకు బదులు ఆ స్థానంలో నీరు పట్టిస్తే, రక్తంలోని ఉప్పు కరిగిపోతుంది. ఫలితంగా హైపోనేట్రేమియా అనే చాలా తక్కువ సోడియం స్థాయికి దారితీస్తుంది.
ఇది తీవ్రమైతే మెదడు వాపు, నీటి విషపూరితం కారణంగా మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంది . అంతేకాకుండా, పెద్దవారు కూడా తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో ద్రవాన్ని తీసుకుంటే నీరు విషపూరితంగా మారిపోతుంది.
ఇంకా పసిపిల్లల్లో కడుపు సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. జీవక్రియ రేటు కూడా చాలా నెమ్మెదిగా ఉంటుంది. వీరికి నీరు తాగించడం వల్ల పాలు తాగడానికి తగినంత స్పేస్ ఉండదు. ఇది పోషకాలు లేదా శక్తి లోపాలకు దారి తీస్తుందట.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం