Best Web Hosting Provider In India 2024

నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ: తిరుపతి నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన దాడికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సీరియస్‌గా స్పందించింది. జరిగిన ఘటనకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారనే దానిపై నాలుగు వారాల్లో నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్ట్–ఏటీఆర్) ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా.. స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు ఈనెల 3వ తేదీన ఒక బస్సులో కార్పొరేషన్‌కు వెళ్తుండగా, ఇద్దరు రౌడీషీటర్ల ఆధ్వర్యంలో దుండగులు బస్సును ఆపి, దానిపై దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారు.
బస్సు టైర్లలో గాలి తీయడంతో పాటు, బస్సు కిటికీల అద్దాలు.. చివరకు డోర్ల అద్దాలు కూడా «ధ్వంసం చేసి డ్రైవర్‌పై చేయి చేసుకున్నారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా, పోలీసుల సమక్షంలోనే పట్టపగలు ఈ దాడి జరిగింది. కార్పొరేటర్లను కిడ్నాప్ చేయాలన్న ఉద్దేశంతో దుండగులు ఈ పని చేశారు. ఇంత జరుగుతున్నా, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు తప్ప, కనీసం దుండగులను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత కార్పొరేటర్లు గట్టిగా ప్రతిఘటించడంతో దుండగులు పారిపోయారు.
జరిగిన ఘటనపై వెంటనే పూర్తి వివరాలతో, ప్రధాన నిందితుల పేర్లతో సహా జిల్లా ఎస్పీకి వైయస్ఆర్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుల పేర్లు లేకుండా ఎఫ్‌ఐఆర్ రాశారు. దీంతో పూర్తి వివరాలు, ఆధారాలతో సహా ఈనెల 14వ తేదీన తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం.గురుమూర్తి ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు.
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ధైర్యంగా కార్పొరేషన్‌కు వెళ్లేలా భద్రత (ఎస్కార్ట్) కల్పించాలని అంతకు ముందే రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అయినా, పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది.
ఈ నేపథ్యంలో అన్ని అంశాలు ప్రస్తావిస్తూ, అన్ని ఆధారాలు చూపుతూ, ప్రజాస్వామ్య హక్కులు కాపాడాలంటూ తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం.గురుమూర్తి ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించడంతో, స్పందించిన కమిషన్.. నాలుగు వారాల్లో ఏటీఆర్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.