



Best Web Hosting Provider In India 2024

Wedding Invitation Card : పెళ్లి కార్డు కాదండోయ్.. ‘పెళ్లి పుస్తకం’ – 36 పేజీలతో అతిపెద్ద శుభలేఖ
వివాహ ఆహ్వాన పత్రికను పుస్తకం రూపంలో ప్రింట్ చేయించింది కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం. కుమార్తె పెళ్లి కుదరగా… 36 పేజీలతో అతిపెద్ద శుభలేఖను తయారు చేయింది. ఈ పుస్తకంలో 32 పేజీలు పెళ్లి యొక్క ప్రత్యేకత… మిగతా 4 పేజీలలో ఆహ్వానం, పెళ్లి ముహూర్తం, కృతజ్ఞతలు ఉండేలా డిజైన్ చేశారు.
పెళ్ళీలు…పేరంటాలకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ఆహ్వానాలు పలికే ఈ రోజుల్లో హిందూ వివాహం యొక్క విశిష్టత… వివాహం సందర్భంగా జరిగే ఘట్టాలు వివరిస్తూ పెళ్ళి పుస్తకం ముద్రించారు. అతి పెద్ద శుభలేఖను 36 పేజీలతో ఆహ్వాన పత్రికను ముద్రించి బంధుమిత్రులకు ఇచ్చి ఆహ్వానించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కు చెందిన ఓ కుటుంబం. పుస్తక రూపంలో ఉన్న పెళ్లి పత్రిక అందర్నీ ఆకర్షిస్తుంది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సుద్దాల శ్రీనివాస్ శ్రీదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. మొదటి కూతురు కూతురు రవళిక సీఏ పూర్తి చేసింది. ఇటీవల కామారెడ్డి పట్టణానికి చెందిన నాగేంద్ర బాబుతో పెళ్ళి సంబంధం కుదిరింది. ఈనెల 23న వివాహ ముహుర్తం ఖరారు చేసుకున్నారు. పెళ్లికి బంధుమిత్రులను ఆహ్వానించేందుకు శుభలేఖ తయారు చేయాలని సంకల్పించి రొటీన్ కు భిన్నంగా అందర్నీ ఆకర్షించేలా తమ ప్రత్యేకతను చాటుకునేలా అతిపెద్ద శుభలేఖ(పెళ్ళి పుస్తకం) ముద్రించారు.
36 పేజీలతో ఆహ్వానపత్రిక….
హిందు వివాహం యొక్క ప్రత్యేకతను చాటి చెప్పేలా ఒక్కొక్క పేజీలో పెళ్ళి తంతులో జరిగే వివరాలను పొందుపరిచి 36 పేజీలతో వివాహ ఆహ్వాన పత్రికను రూపొందించారు. ఆహ్వాన పత్రిక పెళ్ళిపుస్తకంలో వివాహానికి సంబంధించిన కళ్యాణ సంస్కృతి, పెళ్లిచూపులు, పాణిగ్రహణ శుభముహూర్త పత్రిక, పెళ్లి కుమార్తెను చేయుట ,పెళ్లి కుమారుని చేయుట, వరపూజ, వధువును గంపలో తెచ్చుట, తెరసాల, కన్యాఫలం, మాంగల్యపూజ వంటి అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా జిలకర బెల్లం, తలంబ్రాలు, బ్రహ్మముడి, సప్తపది, ఉంగరాలు తీయించుట, అప్పగింతల పాటతో పాటు పెళ్లిలో జరిగే 36 రకాలతంతుల గురించి వివరిస్తూ పెళ్ళి పుస్తకం తయారు చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా శుభలేఖ..
పుస్తక రూపంలో ముద్రించిన వివాహ ఆహ్వాన శుభలేఖ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సుద్దాల శ్రీనివాస్ శ్రీదేవి దంపతులు పెళ్ళికూతురు రవళిక బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి పెళ్లి పుస్తకం ఇచ్చి ఆహ్వానం పలకడం, ప్రత్యేకంగా రూపొందించిన శుభలేఖ అందర్నీ ఆకట్టుకుంటుంది. పెళ్లి పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తూ పెళ్లిలో ఇన్ని జరుగుతాయా, అని చర్చించుకుంటున్నారు. భద్రంగా ఆ పెళ్లి పత్రికను దాచిపెడుతున్నారు.
వేస్ట్ పేపర్ కాకుండా ఉండేందుకే…
శుభకార్యాల సందర్భంగా ఆహ్వాన పత్రికలు ముద్రించి బంధుమిత్రులకు పంచడం సహజమే… కానీ ఆ పత్రికలు శుభకార్యం కాకముందే పెట్టకుప్పల పాలవుతున్నాయి. మనం ఇచ్చే శుభలేఖ అలా కాకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నామని సుద్దాల శ్రీనివాస్ శ్రీదేవి దంపతులు, పెళ్లి కూతురు రవళిక తెలిపారు. వివాహ సంస్కృతి అందరికి తెలిసేలా ఉండాలని భావించి పెళ్లి యొక్క విశిష్టతను పెళ్ళిలో జరిగే కార్యక్రమాలన్నీ నేటి సమాజానికి తెలియజేసే విధంగా 36 పేజీలతో పెళ్లిపుస్తకం శుభలేఖ తయారు చేసి బంధుమిత్రులకు అందజేయడం జరిగిందని చెప్పారు.
పురాతన కాలంలో పెళ్లి ఐదు రోజులు జరిగేది… రాను రాను ఒకరోజు ప్రస్తుతం ఒక గంటలో పెళ్లి అయిపోతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పురాతన పెళ్లి వైభవాన్ని చాటి చెప్పి ఆధునిక సమాజంలో సనాతన ధర్మాన్ని కాపాడేలా ఈ పెళ్లి పత్రికను రూపొందించామని శ్రీనివాస్ తెలిపారు. 36 పేజీల పెళ్ళి పుస్తకంలో 32 పేజీలు పెళ్లి యొక్క ప్రత్యేకత, మిగతా నాలుగు పేజీలలో ఆహ్వానం పెళ్లి ముహూర్తం, కృతజ్ఞతలు ఉంటాయని తెలిపారు.
రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
టాపిక్