Best Web Hosting Provider In India 2024

ఫైబర్ నెట్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి
తాడేపల్లి: లాభాల బాటలో నడిచిన ఫైబర్ నెట్‌ను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని, ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారని ఫైబర్ నెట్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఫైబర్ నెట్ ని లాభాల బాటలోకి తెచ్చామని, అలాంటి సంస్థని నాశనం చేసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. 2014-19లో చంద్రబాబు ఫైబర్ నెట్‌లో భారీగా అవినీతి చేశారని, అందుకే దానిపై మా హయాంలో విచారణ జరిపించామన్నారు. చంద్రబాబు అక్రమాలు, అవినీతిని సీఐడీ నిరూపించిందని తెలిపారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు సంతకాలతోనే నాడు అవినీతి చేశారని ఆక్షేపించారు. ఫైబర్‌నెట్ లో ఇచ్చిన ప్రతి కాంట్రాక్టులోనూ చంద్రబాబు అవినీతి చేశారని ఆరోపించారు. ఆ అవినీతిని వైయస్ జగన్ గుర్తించి విచారణ జరిపించినట్లు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో కూడా చంద్రబాబు అవినీతి చేసి అరెస్టు అయ్యారని గుర్తు చేశారు. ఇప్పుడు.. తన మీద ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకే ఫైబర్ నెట్ ని నిర్వీర్యం చేస్తున్నారని గౌతంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైయస్ జగన్ హయాంలో లాభాల బాట
వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఫైబర్ నెట్ లాభాల బాట పట్టిందని గౌతంరెడ్డి తెలిపారు. వైయస్ జగన్ ప్రోత్సాహంతో రూ.190లకే ఇంటర్నెట్ ఇచ్చామన్నారు. సిగ్నల్ ప్రాబ్లం లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో కనెక్షన్లు ఇచ్చినట్లు వివరించారు. అందుకే మా హయాంలో ఫైబర్ నెట్ లాభాల బాట పట్టి ఆదాయం పెరిగిందన్నారు. ఏడాదికి 1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టినట్లు గౌతంరెడ్డి చెప్పారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో 20 లక్షల బాక్సులను కేంద్రం నుండి ఉచితంగా వచ్చేలా ఏర్పాటు చేశామన్నారు. వాటిని ఈ ప్రభుత్వం తీసుకువచ్చి ఫైబర్ నెట్ కి ఆదాయం పెంచాలి. అంతేగానీ సంస్థలను నాశనం చేయవద్దని హితవు పలికారు. రైతుల కోసం మిర్చి యార్డుకు వెళ్లిన వైయస్ జగన్ పై కేసు పెట్టడం సమంజసం కాదన్నారు. మరి మ్యూజికల్ నైట్ లో పాల్గొన్న చంద్రబాబు మీద ఎందుకు కేసు పెట్టలేదని గౌతంరెడ్డి పోలీసులను ప్రశ్నించారు.