Green Peas Vada: పచ్చి బఠానీలతో రుచికరమైన వడలు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇదిగోండి రెసిపీ ఈ సాయంత్రం ట్రై చేయండి

Best Web Hosting Provider In India 2024

Green Peas Vada: పచ్చి బఠానీలతో రుచికరమైన వడలు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇదిగోండి రెసిపీ ఈ సాయంత్రం ట్రై చేయండి

Ramya Sri Marka HT Telugu
Feb 22, 2025 03:45 PM IST

Green Peas Vada: ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పచ్చి బఠానీలతో వడలు తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? సాయంత్రం టీతో పాటు గానీ, భోజనంలోకి నంచుకోవడానికి ఇవి పర్ఫెక్ట్‌ స్నాక్‌లాగా పనిచేస్తాయి. వీటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి..

పచ్చి బఠానీలతో తయారు చేసిన రుచికరమైన వడలు
పచ్చి బఠానీలతో తయారు చేసిన రుచికరమైన వడలు

పచ్చిబఠానీలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఫైబర్, ప్రొటీన్‌లు అధికంగా ఉండే వీటిని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి, రక్తపొటును నియంత్రించడానికి ఇవి చక్కటి ఆహార పదార్థంగా పనిచేస్తాయి. జింక్, రాగి, మాంగనీస్, ఐరన్ వంటి పోషకాలు కలిగి ఉన్న పచ్చి బఠానీలను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల షుగర్ లెవెల్ కూడా అదుపులో ఉంటుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. చర్మారోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. రుచిలో కూడా పచ్చిబఠానీలు ఏం తక్కువ చేయవు. ఇంత ఆరోగ్యకరమైన పచ్చి బఠానీలతో వడలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదిగోండి రెసిపీ ఓ సారి ట్రై చేశారంటే మళ్లీ మళ్లీ చేసుకుని తింటుంటారు.ఇవి సాయంత్రం టీ పాటు తినే స్నాక్ గానూ, భోజనంతో పాటు నంచుకునే పదార్థంగానూ పనిచేస్తాయి. ఇంట్లో ప్రతి ఒక్కరికీ వీటి రుచి నచ్చుతుంది. మటర్ కీ వడ అని పిలచే పచ్చి బఠానీ వడలను ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

మటర్ కీ వడా లేదా పచ్చి బఠానీ వడ తయారీ కావాల్సిన పదార్థాలు..

  • 1 కప్పు పచ్చి బఠానీలు
  • అర టీస్పూన్ చెక్కెర
  • 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు
  • 1 చిన్న అల్లం ముక్క
  • 2 నుంచి 4 పచ్చి మిరపకాయలు
  • 1 టీస్పూన్ జీలకర్ర
  • అర టీస్పూన్ మిరియాలు
  • 1 టీ స్పూన్ ధనియాలు
  • 1 ఉల్లిపాయ
  • పావు టీస్పూన్ ధనియాల పొడి
  • పావు టీస్పూన్ కారం
  • చిటికెడు పసుపు
  • 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర ఆకులు
  • అర టీస్పూన్ కసూరీ మేతీ
  • 1 కప్పు శనగపిండి
  • 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి
  • రుచికి తగినంత ఉప్పు
  • చిటికెడు వంటసోడా
  • డీప్ ఫ్రైకి సరిపడా నూనె

మటర్ కీ వడ తయారు చేసే విధానం..

  1. పచ్చి బఠానీలతో వడలు చేయడానికి ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో నీరు పోసి మరిగించండి.
  2. నీరు మరగడం ప్రారంభమైన తర్వాత దాంట్లో చెక్కెర వేసి తర్వాత పచ్చి బఠానీలను దాంట్లో వేసి నాలు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి.
  3. బఠానీలు ఉడికి మెత్తగా తయారైన తర్వాత నీటిని వడకట్టి బఠానీలను కచ్చా పచ్చాగా దంచుకోండి. లేదా చిల్లుల గిరిటె సహాయంతో మెత్తగా చేసుకోండి.
  4. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె లేదా రోలు తీసుకుని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, పచ్చి మిర్చీ వేసి కచ్చాపచ్చాగా దంచండి.
  5. తర్వాత దీంట్లోనే మిరియాలు, ధనియాలు, జీలకర్ర మరోసారి దంచండి. ఇవన్నీ మెత్తగా మారాల్సిన అవసరం లేదు. కాస్త కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. మిక్సీలో కన్నా రోట్లో దంచితే రుచి రెండింతలు అవుతుంది.
  6. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ముందుగా ఉడికించి మెత్తగా తయారు చేసుకున్న బఠానీలను, దంచి పెట్టుకున్న మసాలా పేస్టును వేసి బాగా కలపండి.
  7. తర్వాత దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర ఆకులు, ధనియాల పొడి, కారం, పసుపు,
  8. శనగపిండి, బియ్యం పిండి, కసూరీమేతి పొడితో పాటు రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి.
  9. చేతికి కాస్త నూనె అంటించుకుని బఠానీలు, మసాలాలు అన్నీ కలిసిపోయేంత వరకూ చక్కగా కలపండి.
  10. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వుండలుగా తీసుకుంటూ వడల్లా తయారు చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఈ వడలు మరీ పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియం సైజులో అంటే బిస్కెట్లలా తయారు చేసుకోండి.
  11. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయండి. నూనె వేడెక్కిన తర్వాత వడలను దాంట్లో వేసి కాల్చండి.
  12. వడలన్నీ బంగారు రంగులోకి మారేంత వరకూ క్రిస్పీగా మారేలా వేయించుకోండి. తర్వాత బయటకు తీసి టిష్యూ పేపర్ మీద వేయండి.

అంతే క్రిస్పీ అండ్ టేస్టీ మటర్ కీ వడా రెడీ అయినట్టే. వీటిని కొబ్బరి చట్నీ లేదా టమాటా కెచప్ తో వేడిగా వడ్డించండి.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024