


Best Web Hosting Provider In India 2024

AP Inter Classes : ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్డేట్, ఏప్రిల్ 1 నుంచి సెకండియర్ తరగతులు ప్రారంభం
AP Inter Classes : ఏపీలో ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు చేయాలని విద్యా్శాఖ నిర్ణయించింది.
AP Inter Classes : రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఇక నుంచి ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సమూలు మార్పులు చేసింది. సీబీఎస్ఈ విధానాలు, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ నూతన విధానాన్ని అమలు చేయనున్నారు.
మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 3 నుంచి 20 వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లను కూడా ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. అయితే ఈలోపే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఏప్రిల్ 1 తేదీ నుంచి జూనియర్ కాలేజీలను ప్రారంభించనున్నట్లు ప్రకటన చేసింది.
ఏప్రిల్ 5 నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్లు
ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు మార్చి 19 తేదీతో ముగిసిన తరువాత పది రోజులు గ్యాప్ తీసుకుని ఏప్రిల్ 1 నుంచే సెకండియర్ క్లాస్‌లు నిర్వహించనున్నారు. ఆ రోజు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సిలబస్ బోధన మొదలవుతుంది. ఏప్రిల్ 5 నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్లు చేపడతారు. ఫస్టియర్‌లో చేరిన వారికి ఇంగ్లీష్, మాథ్యమెటిక్స్‌పై బ్రిడ్జి కోర్సును ప్రారంభిస్తారు.
ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు
ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ఇస్తారు. జూన్ 1 నుంచి తిరిగి విద్యా సంవత్సరం పునఃప్రారంభం అవుతుంది. జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా ఇప్పటికే పాఠశాల విద్యాలో సీబీఎస్ఈ విధానంలో ఎన్‌సీఆర్‌టీ పాఠాలను బోధిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2024-25)లో పదో తరగతి బోధన సైతం ఇదే విధానంలోని మారింది. మార్చి నెలలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అనుగుణంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్, సీబీఎస్ఈ విధానాలు అమలు చేయనున్నారు.
కమిటీల నివేదిక ప్రకారమే ఈ నిర్ణయం
ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యలో జాతీయ స్థాయి సిలబస్ అమలు సాధ్యాసాధ్యాలు చేపట్టాల్సిన మార్పులపై నియమించిన కమిటీలు 12 రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక ఇచ్చాయి. ఆ నివేదికల ప్రకారం ఈ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, 2026-27 విద్యా సంవత్సరంలో సెకండియర్‌లో కొత్త సిలబస్ ప్రవేశపెడతారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా ఎంబైపీసీ కోర్సును సైతం ప్రవేశపెడతారు.
మొదటి 23 రోజుల్లోనే కనీసం 15 శాతం సిలబస్ పూర్తి
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ పరీక్షల తరువాత వేసవి సెలవులు, ఆ తరువాత జూన్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది. 223 రోజులు పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీల కార్యకలాపాలు ఉండేవి. అయితే సీబీఎస్ఈ విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించి, ఇంటర్మీడియట్ రెండో ఏడాది బోధన మొదలు పెడతారు. తొలి 23 రోజుల్లో కనీసం 15 శాతం సిలబస్ పూర్తి చేసి వేసి సెలవులు ఇస్తారు.
పని దినాలు పెరుగుదల
పని దినాలు సైతం నెల రోజులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏప్రిల్ 5 నుంచే ఫస్టియర్ ప్రవేశాలు చేపడతారు. ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. అందువల్ల పదో తరగతి పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశం పొందవచ్చు. పాసైన వారిని కొనసాగించి, ఫెయిలైన వారిని తొలగిస్తారు.
జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలకు శిక్షణ
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అకడమిక్ తరగతలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు గంటల పాటు జేఈఈ, ఎంసెట్, నీట్ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లతో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అవసరం మేరకు ప్రత్యేక నిపుణులతో తరగతులు చెప్పిస్తారు. ఇందుకోసం ప్రత్యేక మెటీరియల్‌ను సిద్ధం చేస్తున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్