


Best Web Hosting Provider In India 2024
Telangana MLC Elections : కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికలు అగ్నిపరీక్ష.. పీపుల్స్ పల్స్ విశ్లేషణ
Telangana MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల అనంతరం.. స్థానిక ఎన్నికలకు ముందు జరుగుతున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ప్రత్యక్షంగా ఓటింగ్ వేస్తుండడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 15 నెలలు కావస్తుంది. ఈ తరుణంలో ఫిబ్రవరి 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలు.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు క్వార్టర్స్ ఫైనల్స్ వంటివి. ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ తమ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించకపోయినా.. ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ వేడి పెరగడం ఖాయం. రాజకీయాల్లో మొదటి స్థానానికే బహుమతి ఉంటుంది. కానీ రెండు, మూడు స్థానాలకు ఎలాంటి ప్రాధాన్యత ఉండకపోవడంతో.. ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు, ప్రధానంగా అధికార కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షగా మారాయి. సోషల్ మీడియా, లైక్‌లతో, జూమ్ మీటింగ్లతో, డబ్బులతో ఓట్లు రాలవు.. ప్రజలకు చేరవయితేనే ఓట్లు వస్తాయని ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు నిరూపించబోతున్నాయి.
ఆసక్తికరంగా ఎన్నికలు..
రాష్ట్రంలో కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ, కరీంనగర్-నిజామాబాద్- ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ, ఖమ్మం- వరంగల్- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ మూడు ఎన్నికల్లో పోటాపోటీగా తలపడుతున్నారు. కాంగ్రెస్ పట్టభద్రుల స్థానంలో ప్రత్యక్షంగా తలపడుతుండగా.. బీజేపీ మూడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపకుండా ఎన్నికలు దూరంగా ఉంది. బీఆర్ఎస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరికీ మద్దతు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయి. బీఆర్ఎస్ ఓటింగ్ ఎటు వైపు మళ్లుతుందో ఆసక్తికరంగా మారింది.
పోటీలో లేని బీఆర్ఎస్..
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాల గణాంకాలను పరిశీలిస్తే.. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఆశాజనక ఫలితాలే వచ్చాయి. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 42 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 16, బీజేపీ 7 గెలిచాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ జహీరాబాద్, పెద్దపల్లిలో విజయం సాధించింది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలవని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్, బీజేపీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్సీ ఎన్నికలు సవాలుగా మారాయి.
గెలుపే లక్ష్యంగా..
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్కు సిట్టింగ్ స్థానం కావడంతో ఆ పార్టీ ఇక్కడ గెలుపే లక్ష్యంగా పోరాడుతుంది. 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకొచ్చే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానం కూడా పట్టుదలగా ఉంది. దీంతో పార్టీ యంత్రాంగం అక్కడ మోహరించింది. ఏ ఒక్క ఓటునూ జారవిడుచుకోవద్దనే లక్ష్యంతో ఏడుగురు మంత్రులకు, 23 మంది ఎమ్మెల్యేలకు పార్టీ దిశానిర్ధేశం చేసింది. ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముఖ్యమంత్రి స్థాయిలో కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు.
పీసీసీ చీఫ్ సొంత జిల్లా..
నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలకు లక్ష్యాలను నిర్ధేశిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ కూడా పట్టభద్రుల నియోజకవర్గంలో ఉండడంతో ఆయనకు కూడా ఎన్నికలు పెను సవాలుగా మారాయి. పట్టభద్రుల ఎన్నికల కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్.. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఏడు నెలల అనంతరం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత కేసీఆర్.. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల గురించే ప్రస్తావించ లేదు. ఆ పార్టీ ఎవరికి మద్దతిస్తుందో అధికారికంగా నిర్ణయించలేదు.
బీసీ నినాదం..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదం ఎత్తుకొని లబ్ధి పొందాలని కాంగ్రెస్ ఆశిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ చెబుతున్న కులగణన పార్టీకి లాభంతో పాటు నష్టం కూడా చేకూరుస్తుంది. బీసీలకు 42 శాతం టికెట్లు ఇస్తామని చెబుతుండడం ప్రయోజనం కలిగిస్తుంటే, ఇదే అంశంలో బీసీల్లో ముస్లింలను కలిపే అంశాన్ని బీజేపీ ప్రచార అస్త్రంగా మార్చుకుంటుంది. ఇదే సమయంలో బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగి గట్టి పోటీ ఇస్తున్న ప్రసన్న హరికృష్ణ బీసీ కావడంతో.. బీసీ పేరుతో ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని ఓడించాలని ప్రయత్నిస్తుందని ప్రచారం చేస్తుంది. దీంతో కాంగ్రెస్ కు కొంత నెగెటివ్‌గా మారింది.
కాంగ్రెస్‌పై అసంతృప్తిగా..
కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్లు నిర్వహిస్తున్నా పార్టీకి ప్రయోజనం కలగడం లేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీగా నియమిులైన మీనాక్షీ నటరాజన్ కూడా ఈ జూమ్ సమావేశాల్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రచారం చేస్తున్నా.. ప్రజలు ముఖ్యంగా యువత, ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్‌పై అసంతృప్తిగా ఉన్నట్టు క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బడా నేతలు ప్రచారం చేస్తున్నా.. వారిలో సమన్వయ లోపం కనిపిస్తుంది. అభ్యర్థి నరేందర్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వకుండా.. కేవలం నేతలను మాత్రమే కలుసుకుంటున్నారనే గుసగుసలు పార్టీలో ఉన్నాయి. ఓటర్లను కలుసుకోకుండా బడా నేతలను, సంఘాల నేతలను మాత్రమే కలుసుకోవడం ఆయనకు మైనస్ పాయింట్.
బీజేపీ భారీ వ్యూహం..
పట్టభద్రుల నియోజకవర్గాన్ని కాంగ్రెస్ తోపాటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నియోజకవర్గం పరిధిలో నలుగురు ఎంపీలున్న బీజేపీ గెలుపుపై పట్టుదలతో భారీ వ్యూహంతో వ్యవహరిస్తుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ బీజేపీ ప్రచార శైలీని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగేందుకు వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం జారవిడుచుకోవద్దనే దృఢ నిశ్చయంతో ఉంది. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తోపాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారంలో పాల్గొంటున్నారు.
బండి కృషి..
పట్టభద్రుల నియోజకవర్గంలో అధిక ఓటర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనే ఉండడంతో.. స్థానికులైన బండి సంజయ్ ఇక్కడ పార్టీకి భారీ మెజార్టీ తెచ్చేందుకు యత్నిస్తున్నారు. బీజేపీ వ్యూహాత్మకంగా ప్రతి 20 మంది ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జీని ఏర్పాటు చేసి.. ఓటర్లందరినీ కలుసుకుంటుంది. పోల్ మేనేజ్మెంట్లో దిట్ట అయిన బీజేపీకి సంఘ్ మద్దతు ఉండడంతో పాటు మైక్రోలైవల్లో బలమైన యంత్రాంగం కలిసొచ్చే అంశం. బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నా.. ఆ పార్టీలో నేతల మధ్య సమన్వయం లోపం శాపంగా మారింది.
కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష..
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నాడీని అధ్యయనం చేయడానికి పీపుల్స్ పల్స్ సంస్థ క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు.. ఈ ఎన్నికలు ప్రధానంగా అధికార కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షగా మారుతున్నాయని తేలింది. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి మూడవ స్థానానికి పరిమితమవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు అగ్రవర్ణాలకు చెందిన వారు కావడంతో.. బీసీ అభ్యర్థి అయిన హరికృష్ణపై బీసీ సామాజికవర్గంలో సానుకూలత కనిపిస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మొత్తం 15 జిల్లాల్లో పరిశీలిస్తే.. ఆదిలాబాద్, ఆసీఫాబాద్, నిర్మల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా, జగిత్యాల, సిద్ధిపేటలో హరికృష్ణ, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, భూపాల్‌పల్లి జిల్లాల్లో అంజిరెడ్డి, హనుమకొండ జిల్లాలో నరేందర్ రెడ్డి ఆధిక్యత కనబరుస్తున్నారు.
పరోక్షంగా మద్దతు..
సిద్దిపేట, రాజన్న సిరిసిల్లా జిల్లాల్లో హరికృష్ణకు వస్తున్న మద్దతును గమనిస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ పరోక్షంగా ఆయనకు మద్దతిస్తుందనే ప్రచారానికి బలం చేకూరుతుంది. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తుండడంతో ఆపార్టీ ఓటమే లక్ష్యంగా బీఆర్ఎస్ చాపకింద నీరులా పనిచేస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. దీనికి భిన్నంగా గట్టిపోటీ ఇస్తున్న హరికృష్ణకు బీఆర్ఎస్ పరోక్షంగా మద్దతిస్తున్నట్టు క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. మరోవైపు ఆర్థికంగా బలహీనంగా ఉన్న హరికృష్ణకు పోల్ మేనేజ్మెంట్లో అనుభవం లేకపోవడంతో పాటు వనరులు కూడా లేకపోవడంతో ఆయన వెనుకబడే అవకాశాలున్నాయి.
వీరిద్దరి మధ్య పోటీ..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి, ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు చాలా ప్రధానం. హరికృష్ణ, అంజిరెడ్డి మధ్య మొదటి, ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు బదిలీ అవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం పోటాపోటీగా ఉన్న ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధన్యత ఓట్లతో ఎవరూ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం స్వల్ప ఆధిక్యంలో హరికృష్ణ ఉన్నా, ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి గట్టెక్కినా ఆశ్చర్యం లేదు. తీవ్ర పోటీ ఉన్న ఇక్కడ మూడో ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారవచ్చు. ప్రస్తుతం ఎన్నికలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ఆర్థికంగా బలమైన అభ్యర్థులనే పార్టీలు బరిలోకి దింపుతున్నాయి. హరికృష్ణ కంటే అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి ఆర్థికంగా బలమైన వారు కావడంతో.. చివరి నిమిషంలో ఆర్థిక సమస్యలు హరికృష్ణకు ఇబ్బందులుగా మారవచ్చు.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణంగా రాజకీయ పార్టీలు పోటీ చేయకుండా ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులకు మద్దతిస్తుంటాయి. అయితే 2023 మార్చిలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్, ఖమ్మం-నల్గొండ-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తూ రాజకీయంగా వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని కూడా జారవిడుచుకోవద్దనే సంకల్పంతో ఉంది.
క్షేత్రస్థాయి పరిశీలనలో..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్థికంగా బలమైన అభ్యర్థులు బరిలోకి దిగారు. టీచర్చ్ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో లేని కాంగ్రెస్ కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్‌లో మద్దతు ఎవవరికీ ప్రకటించకపోయినా, ఖమ్మం-మెదక్-నల్గొండలో వామపక్ష అభ్యర్థికి మద్దతిస్తుంది. పోటీ చేయని బీఆర్ఎస్ మౌనంగా ఉంది. రెండు టీచర్స్ నియోజకవర్గాలో పోటీ చేస్తున్న బీజేపీ కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ తపస్ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్క కొమరయ్యకు గెలిచే అవకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ క్షేత్రస్థాయిలో పరిశీలనలో తేలింది. కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, మెదక్, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లా జిల్లాల్లో మల్క కొమరయ్య, సిద్దిపేట, ఆసీఫాబాద్, సంగారెడ్డిలో పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి ఆధిక్యత కనబరుస్తున్నారు. కామారెడ్డిలో ఇద్దరూ పోటాపోటీగా ఉన్నారు. కొమరయ్య, మహేందర్రెడ్డి ఇద్దరూ ఆర్థికంగా బలమైన అభ్యర్థులే కావడం గమనార్హం.
ఎవరు బాధ్యత తీసుకుంటారో..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిక్యత చూపడం సర్వసాధారణం. అయితే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్న దశలో చివరి నిమిషంలో రచించే వ్యూహాలు వారిని గట్టెకిస్తాయో లేవో చూడాలి. ఒకవేళ కలిసిరాకపోతే, మహామహులుతో కదనం రంగంలోకి దిగిన కాంగ్రెస్లో ఓటమిపై ఎవరు బాధ్యత తీసుకుంటారో అనేది మిలియన్ డాలర్ ప్రశ్నే. గతంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో..? ఫలితాల అనంతరం నేతలు ఎలాంటి బాధ్యత తీసుకుంటారో అనే వాటిపైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
ప్రజా స్పందనగా..
ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా కాంగ్రెస్ చెప్పకపోయినా.. ప్రభుత్వంపై ప్రజా స్పందనగా భావించవచ్చు. ఈ సందర్భంగా గతం మాటలు గుర్తుకొస్తున్నాయి. లోగడ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన అధికార వైసీపీ నేతలు ‘‘ఎమ్మెల్సీ ఓటర్లు మా ఓటర్లు కాదు.. మా ఓటర్లు వేరే వారున్నారు’’ అని కుంటి సాకులతో ఓటమిని నిజాయితీగా ఒప్పుకోలేదు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. ఒకవేళ తెలంగాణలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌కు ప్రతికూలంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పు వస్తే.. ఆ పార్టీ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
-జి.మురళీ కృష్ణ,
సీనియర్ రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.
(గమనిక: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు, వ్యూహాలు రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్ (హెచ్‌టీ)వి కావు. వీటికి హెచ్‌టీ బాధ్యత వహించదు)
టాపిక్