



Best Web Hosting Provider In India 2024

Jayashankar Bhupalpally : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం.. డబ్బా పాలు వికటించి కవల పిల్లలు మృతి!
Jayashankar Bhupalpally : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. డబ్బా పాలు వికటించి, ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు సరిగా కళ్లు తెరవక ముందే అనంత లోకాలకు చేరడంతో.. ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన నగరంపల్లిలో శనివారం జరిగింది.
గణపురం మండలం గొల్లపల్లికి చెందిన మర్రి అశోక్‌కు.. నగరంపల్లికి చెందిన లాస్యతో కొంతకాలం కిందట వివాహం జరిగింది. ఆ తరువాత లాస్య గర్భం దాల్చగా.. దాదాపు నాలుగు నెలల కిందట రెండో సంతానంలో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. అందులో పాప, బాబు ఉండగా.. చిన్నారులిద్దరినీ ప్రాణంగా చూసుకుంటున్నారు. కవల పిల్లలు కావడం, తల్లి పాలు సరిపడా లేకపోవడంతో కొద్ది రోజులుగా చిన్నారులద్దరికీ డబ్బా పాలు పడుతున్నారు.
రోజు మాదిరిగానే..
డెలవరీ అనంతరం నుంచి లాస్య తన తల్లిగారి గ్రామమైన నగరంపల్లిలో ఉంటుండగా.. రోజువారీలాగే లాస్య తన ఇద్దరు పిల్లలకు శనివారం డబ్బా పాలు పట్టింది. ఉదయం 8 గంటలకు ఒకసారి, 10 గంటలకు మరోసారి తాగించి పిల్లలను పడుకోబెట్టింది. అయితే 12 గంటల సమయంలో పిల్లల్లో కదిలికపోవడంతో అనుమానం వచ్చి చూడగా.. పిల్లల ముక్కుల్లోంచి పాలు కారుతూ కనిపించింది. దీంతో తల్లి లాస్య కంగారు పడిపోయింది. వెంటనే స్థానిక డాక్టర్‌ను సంప్రదించగా.. ఆయన వచ్చి పిల్లల ఆరోగ్య పరిస్థితిని చెక్ చేశాడు.
ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా..
పిల్లలకు హార్ట్ బీట్ సరిగా లేదని, వెంటనే భూపాలపల్లిలోని ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సలహా ఇచ్చాడు. దీంతో లాస్య, ఇతర కుటుంబ సభ్యులు ఇద్దరు పిల్లలను తీసుకుని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పిల్లలిద్దరూ అపస్మారక స్థితికి చేరుకోగా.. అక్కడ పరీక్షించిన డాక్టర్లు ఇద్దరూ చనిపోయినట్లు నిర్ధారించారు. నాలుగు నెలల కవల పిల్లలు ఇద్దరూ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు కానరాని లోకాలకు చేరడంతో లాస్య, వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.
డబ్బా పాలే కారణమా..?
కవల పిల్లల ఇద్దరి వయసు దాదాపు నెలలు ఉండగా.. పాలు సరిపోని కారణంగా కొద్దిరోజులుగా లాస్య డాక్టర్ల సలహా మేరకు ఓ కంపెనీకి చెందిన డబ్బా పాలు పట్టిస్తోంది. రోజువారీలాగే డబ్బా పాలు పట్టగా.. శనివారం అవే పాలు వికటించి, చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. డబ్బా పాల వల్లే పిల్లలు ఇద్దరూ చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇద్దరు చిన్నారులు చనిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు రోధించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలు చనిపోవడంతో లాస్య స్వగ్రామం నగరంపల్లితో పాటు అశోక్ గ్రామమైన గొల్లపల్లిలో తీవ్ర విషాదం అలుముకుంది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
టాపిక్