



Best Web Hosting Provider In India 2024

Ramadan Fasting: రంజాన్ నెలలో ఉపవాసం ఎందుకు ఉంటారు? ఎప్పటినుంచి ఈ ఉపవాసాలు మొదలవుతాయి?
Ramadan Fasting: ముస్లింలకు పరమ పవిత్రమైన మాసం రంజాన్. ముస్లిం సోదరులు రంజాన్ నెలలో ఉపవాసం ఉంటారు. ఇలా ఉపవాసం ఎందుకు ఉంటారో తెలుసుకోండి.
రంజాన్ నెల వచ్చేస్తోంది. రంజాన్ పరమ పవిత్రమైన మాసంగా ముస్లిం సోదరులు భావిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్లో రంజాన్ అనేది తొమ్మిదవ నెల. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు దీన్ని అత్యంత ముఖ్యమైన నెలగా పరిగణిస్తారు. ఈ నెలలో ప్రతిరోజూ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. ఆహారం, పానీయం అన్నింటికీ దూరంగా ఉంటారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసం ఎందుకు ఉంటారో తెలుసుకోండి.
రంజాన్ అనేది ముస్లిం సోదరులకు ఆధ్యాత్మిక నెల. ఇది స్వీయ నియంత్రణను కూడా అందిస్తుంది. అల్లా పట్ల భక్తిని చాటి చెబుతుంది. ఈ నెల అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు ఉపవాసాలు, ప్రార్థనలు, దానాలతో బిజీగా ఉంటారు.
ఉపవాసం ఎందుకు?
రంజాన్ సమయంలో ఉపవాసం ఉండడం అనేది ముస్లిం సోదరులకు తప్పనిసరి. ఆరాధనా, ఉపవాసం అనేవి అల్లాకు భక్తులను చేరువ చేసే మార్గంగా చెప్పుకుంటారు. రంజాన్ సమయంలో ఉపవాసం ఉండడానికి ఇంకా అనేక కారణాలను వివరిస్తారు. రంజాన్ నెలలో ఉపవాసం ఉండడం అనేది అల్లా పట్ల భక్తిని చూపించే ఒక మార్గం. అల్లా వారికి ఇచ్చిన ఆనందకరమైన జీవితానికి కృతజ్ఞతలు వ్యక్తపరిచే మార్గంగా కూడా చెప్పుకుంటారు.
రంజాన్ నెలలో ఉపవాసం అనేది స్వీయ క్రమశిక్షణను, స్వీయ నియంత్రణను పాటించడమేనని అంటారు. శారీరక కోరికలను అదుపులో ఉంచుకోవడానికి ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది.
రంజాన్ నెలలో ఉపవాసం ఉండడం వల్ల ఆకలి, దాహంపై నియంత్రణ వస్తుంది. తినడానికీ, తాగడానికి తగినంత సౌకర్యాలు లేని వారి కష్టాలను కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల దానధర్మాలు చేయాలన్న ఆలోచన కూడా వస్తుంది.
రంజాన్ సమయంలో ఉపవాసం ఉండడం వల్ల ఆత్మ శుద్ధి అవుతుందని అంటారు. ఆధ్యాత్మిక అవగాహన కూడా పెరుగుతుందని చెబుతారు. మీ పాపాలకు క్షమాపణ కోరే సమయం కూడా ఇదేనని అంటారు.
రంజాన్ అనేది కుటుంబం సమాజం కలిసి చేసే పండుగ. ఉపవాసం విరమించేటప్పుడు భోజనాన్ని కలిసి పంచుకొని తింటారు. ఇది బంధాలను బలోపేతం చేస్తుంది. కుటుంబ సభ్యులతో బంధాలను నిర్మించుకోవడానికి ఇది ఒక మంచి సమయం.
ఇఫ్తార్ విందు
రంజాన్ సమయంలో ప్రజలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. అందుకే సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున మేల్కొని సుహూర్ అని పిలిచే భోజనాన్ని తింటారు. ఇది రోజంతా శక్తిని అందించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత సూర్యాస్తమయం వరకు ఆహారం, పానీయాలు కూడా తాగరు. సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ అనే భోజనాలతో ఉపవాసాన్ని విరమిస్తారు.
ఇఫ్తార్లో ముఖ్యంగా ఖర్జూరాలను తింటారు. మహమ్మద్ ప్రవక్త తన ఉపవాసం విరమించడానికి ఖర్జూరాలనే తినేవారని చెప్పుకుంటారు. ఇఫ్తార్ తర్వాత ప్రార్థనలు, ఆరాధనలు ఉంటాయి. రంజాన్ సమయంలో దానాలు కూడా అధికంగా చేస్తారు. పేదలకు దానం చేయడం, స్వచ్ఛంద సేవ చేయడం వంటివి ఎక్కువమంది ముస్లిం సోదరులు పాటిస్తారు.
రంజాన్ ఉపవాసాలు ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 29 వరకు నెల రోజుల పాటూ కొనసాగుతాయి.
సంబంధిత కథనం