Best Web Hosting Provider In India 2024

తప్పుడు వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి క్షమాపణలు చెప్పాలి
నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్
నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి
చంద్రబాబు అబద్ధాల పుట్ట పగిలిపోయింది
సెకీతో ఒప్పందంపై ఎల్లో మీడియాలో అడ్డగోలు ప్రచారం
వైయస్ జగన్ ప్రతిష్టను దిగజార్చేలా నీతిబాహ్యమైన రాతలు
చారిత్రక ఒప్పందంపై ఇష్టం వచ్చినట్లు వక్రీకరణలు
మండిపడ్డ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
సెకీతో వైయస్ జగన్ ఒప్పందం వల్ల రాష్ట్రానికి రూ. 1.10 లక్షల కోట్ల సంపద సృష్టి
చంద్రబాబు ఒప్పందం కారణంగా రూ. 87,500 కోట్ల సంపద ఆవిరి
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు: కేంద్రప్రభుత్వరంగ సంస్థ సెకీతో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు సక్రమమేనని ఏపీఈఆర్సీ స్పష్టం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెంపపెట్టులాంటిదని నెల్లూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ ఒప్పందాలపై చంద్రబాబుకు వంతపాడే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు దీనిపై గతంలో తాము రాసిన తప్పుడు వార్తలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాల కోసం ముందుచూపుతో సెకీతో ఆనాడు వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి తక్కువ రేట్లకే విద్యుత్ లభించిందని అన్నారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే…
సెకీ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపై డిస్కంలకు ఏపీఈఆర్సీ అనుమతించింది. గతంలో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం పారదర్శకంగా జరిగిందని దీనితో మరోసారి స్పష్టమైంది. రాష్ట్ర ప్రజలు, రైతుల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆనాడు ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ సెకీ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో చేసుకున్న ఒప్పందాలన్నీ సరైనవేనని, కోనుగోలు ఒప్పందం అత్యంత పారదర్శకంగా జరిగిందని ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. ఈ ఒప్పందం వెనుక అవినీతి జరిగిందంటూ అడ్డూఅదుపూ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన చంద్రబాబు, ఎల్లో మీడియాకు ఇప్పుడు దీనిపై ఏం చెబుతాయని ప్రశ్నించారు. 2025–26లో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకోవడానికి ఏపీఈఆర్సీ డిస్కంలను అనుమతించడంతో ఇప్పటి వరకు ఈ ఒప్పందాలపై వైయస్ జగన్ మీద దుమ్మెత్తిపోసిన పచ్చ సైకోల నోర్లు మూతబడ్డాయి. జగన్ వ్యక్తిత్వం మీద మరక వేయాలని చూసిన వారు నవ్వులపాలయ్యారు. వైయస్సార్సీపీ ప్రతిష్టని దెబ్బతీయాలని ఎల్లో మంద చేసిన కుట్రలు బట్టబయలయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు అబద్ధాల పుట్ట బద్ధలైంది. వైయస్ జగన్ చేసుకున్న ఒప్పందం కారణంగా ఇంటర్ ట్రాన్స్‌మిషన్ చార్జీల(ఐఎస్‌టీసీ) రూపంలో అదనపు భారం పడిందంటూ చేసిన ప్రచారాలన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. యూనిట్ రూ.2.49కే ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసినట్టు రుజువైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అని తెలిసినా, దళారులు లేరని తెలిసినా.. వైయస్ జగన్ లంచాలను తీసుకున్నారని, అమెరికాలో కేసు నమోదైందని, ఏపీలోనూ కేసు పెడతామని ఆరోజు తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోయారు. దీనిపై పూర్తి వివరాలతో మా నాయకుడు వైయస్ జగన్ వెంటనే స్పష్టత ఇచ్చారు. ఈ రోజు వైయస్ జగన్ గారు చెప్పినవి నిజమేనని, అత్యంత పారదర్శకంగానే ఈ ఒప్పందాలు జరిగాయంటూ ఏపీఈఆర్సీ కూడా తేల్చి చెప్పింది.
– రూ. 1.10 లక్షల కోట్ల సంపద సృష్టి
ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా యూనిట్ రూ. 2.49 లతో ఒప్పందం చేసుకుంటే, ఎక్కడ వైయస జగన్ గారికి మంచి పేరొస్తుందనే భయంతో బురదజల్లే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టాడు. జగన్ గారు చేసుకున్న ఈ ఒప్పందం కారణంగా ఏటా రూ. 4 వేల కోట్ల చొప్పున 25 ఏళ్లలో రూ. 1.10 లక్షల కోట్లు రాష్ట్రానికి సంపద సృష్టి జరుగుతుంది. మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ధరలకు చంద్రబాబు ఒప్పందాలు చేసుకోవడం వల్ల రాష్ట్రానికి ఏకంగా రూ. 87,500 కోట్లు నష్టం జరుగుతున్నా ఎల్లో మీడియా ప్రశ్నించదు. మేలు చేసిన జగన్‌ని ప్రశ్నించడం, సంపద ఆవిరి చేసిన చంద్రబాబు గురించి గ్రేట్ అంటూ ప్రశంసిస్తూ ఎల్లో మీడియా తన వికృత స్వభావాన్ని చాటుకుంటోంది. వైయస్ జగన్ కి అదానీ లంచం రూ. 1750 కోట్లు, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి, సెకీ విద్యుత్‌కి ఐఎస్‌టీఎస్ చార్జీలు కట్టాల్సిందే.., జగన్, అదానీ లంచాల కహానీ, ముడుపుల ముడి వీడింది.. అంటూ ఈనాడు నీతి బాహ్యమైన, నిరాధార రాతలు అనేకం రాసింది. ఇప్పుడు అవ్వన్నీ తప్పుడు రాతలేనని తేలిపోయాయి. ఇటువంటి తప్పుడు రాతలు రాసిన ఈనాడు ఇప్పుడు ఏ బావిలో దూకుతుందో.. తప్పుడు రాతలు రాసిన ఈ పత్రికను ప్రజలే బజారులో తగలబెట్టే రోజులొస్తాయి. చంద్రబాబు చేతికి జగన్ జుట్టు అంటూ ఆంధ్రజ్యోతి రాసింది. అది ఈ జన్మలో జరగదు. ఆ పగటి కలల నుంచి రాధాకృష్ణ బయటకు రావాలి. రాధాకృష్ణ జుట్టు జగన్ చేతికి దొరక్కుండా చూసుకోవాలి. ఇకపైన రాసే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది.
రైతాంగం కోసం వైయస్ జగన్ ముందుచూపు
రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం వలన వారికి ఏడాదికి రూ. 40 వేలు సాయం చేసినట్టవుతుంది. జగన్ తీసుకున్న ఈ ఒప్పందం అమలు కాకపోయుంటే రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల పంపుసెట్లు వాడుతున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. వాస్తవాలను ప్రజలకు చూపించే దమ్ము ధైర్యం ఎల్లో మీడియాకు ఉందా అని సవాల్ విసురుతున్నా. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాకముందు రూ.29 వేల కోట్లు విద్యుత్ బకాయిలు ఉంటే, ఆయన దిగిపోయేనాటికి రూ. 86 వేల కోట్లకు పెంచారు. ఇలాంటి వాస్తవాలు ఎల్లో మీడియాకి రాసే దమ్ముందా? కనీసం మేం చెప్పేది వాస్తవం కాదని చెప్పగలరా? కూటమి పాలన చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు.