



Best Web Hosting Provider In India 2024

Warangal Accident : తెల్లారితే చెల్లి పెళ్లి అంతలోనే విషాదం, రోడ్డు యాక్సిడెంట్ లో అన్న దుర్మరణం
Warangal Accident : వరంగల్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదం..పెళ్లింట విషాదం నింపింది. తెల్లారితే చెల్లి పెళ్లి, ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో అన్న మరణించాడు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Warangal Accident : పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. చెల్లి పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తుండగా.. వరంగల్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో అన్నతో పాటు మరో వ్యక్తి దుర్మరణం చెందాడు. దీంతో చెల్లి పెళ్లి బాజా మోగాల్సిన ఆ ఇంట్లో అన్న చావు డప్పు మోగింది. ఉపాధి కోసం పక్క జిల్లాకు వచ్చిన యువకుడి మరణంతో వారింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ నగరంలోని ఉర్సు కరీమాబాద్ ప్రాంతానికి చెందిన ఎర్ర అఖిల్(28) హనుమకొండ హంటర్ రోడ్డు శాయంపేటలోని పిరమిల్ హౌజింగ్ లోన్ బ్యాంక్ లో పని చేస్తున్నాడు. కాగా ఈ నెల 23న ఆదివారం తన చెల్లి పెళ్లి ఉండటంతో ఏర్పాట్లు చేసే పనిలో పడ్డాడు.
ఈ మేరకు శుక్రవారం రాత్రి సమయంలో తనతో కలిసి పనిచేస్తున్న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన గడ్డం చైతన్య(24)తో కలిసి పెళ్లి కార్యక్రమాల నిమిత్తం ఆరెపల్లి నుంచి వరంగల్ రింగ్ రోడ్డు మీదుగా హనుమకొండ వైపు బయలు దేరారు.
ఈ క్రమంలో అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో రింగ్ రోడ్డుపై రెడ్డిపురం క్రాస్ వద్దకు చేరుకోగా.. వారి వెనుక నుంచి అతివేగంగా వచ్చిన జనగామ జిల్లాకు చెందిన అజిత్ అనే యువకుడు తన మహింద్రా కారుతో వారిని బలంగా ఢీకొట్టాడు. కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరగగా.. బైక్ పై నుంచి ఇద్దరు యువకులు కిందపడ్డారు. ఇద్దరి తలకు గాయాలై తీవ్ర రక్త స్రావం జరిగింది. దీంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ఆగిపోయిన పెళ్లి
ఎర్ర అఖిల్ కు ఒక చెల్లి ఉండగా, ఆమె వివాహం ఆదివారం జరిపించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ అనుకోని ప్రమాదంలో ఎర్ర అఖిల్ మృతి చెందడంతో ఆ ఇంట్లో పెను విషాదం నిండింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినా అఖిల్ అకాల మరణంతో ఆయన చెల్లి పెళ్లి వాయిదా పడింది.
కాగా రోడ్డు యాక్సిడెంట్ ఇద్దరు యువకులను బలి తీసుకోవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇదిలా ఉంటే యాక్సిడెంట్ జరిగిన అనంతరం విషయం తెలుసుకున్న స్థానిక కాకతీయ యూనివర్సిటీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 అంబులెన్స్ కు సమాచారం అందించి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. కాగా పెద్దపల్లి జిల్లాకు చెందిన మృతుడు గడ్డం చైతన్య అన్న అయిన గడ్డం సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామని కేయూ పోలీసులు వివరించారు. ఇదిలా ఉంటే వరంగల్ రింగ్ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతుండగా అప్రోచ్ రోడ్లు, జంక్షన్లు ఉన్న చోట రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ప్రయాణ సమయంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్