Best Web Hosting Provider In India 2024
మన్యం సీమలోని పాలకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడగడుగునా హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. అనంతరం బస్సు యాత్రలో వైయస్సార్ సీసీ ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీ ప్రజాప్రతినిధులు కలసి నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలసి ముచ్చటించారు. అలాగే అభివృద్ధి పనులను పరిశీలన చేసారు. అనంతరం భారీ ఎత్తున బైక్ ర్యాలీ పాలకొండ జంక్షన్ కు చేరుకుంది. ఇక్కడ జరిగిన బహిరంగ సభకు స్పీకర్ తమ్మినేని సీతారామ్, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి మేరుగ నాగార్జున, పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, అరకు ఎంపీ గొట్టేటి మాధవి, పాలకొండ ఎమ్మెల్యే కళావతితో పాటుగా పలు కార్పొరేషన్లకు చెందిన డైరక్టర్లు హాజరయ్యారు.
నాలుగన్నరేళ్ల పాలనలో జగన్ గిరిజనులకు 3 లక్షలకు పైగా ఎకరాల భూమిని ఇచ్చారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు 40 వేల ఎకరాల కూడా ఇవ్వలేదు – డిప్యూటీ సీఎం రాజన్నదొర
ఈ సందర్భంగా పాలకొండ జంక్షన్ లో జరిగిన భారీ బహిరంగ సభకు పోటెత్తిన జనసందోహాన్ని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ, తమ పాలనలో అబివృద్ధి లేదు.. సంక్షేమం లేదు అని టీడీపీ నాయుకులు అంటున్నారని, ఇక్కడ జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. సీఎం జగన్ ప్రజలను మనసుతో చూసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు రాజ్యాంగ పదవులు, రాజ్యాధికారం ఇస్తున్నారని వివరించారు. గిరిజన ప్రాంతం కోసం 3 లక్షల ఎకరాలకు పైగా భూమిని నాలుగున్నరేళ్లలో జగన్ ఇచ్చారని, చంద్రబాబు 14 ఏళ్లపాలనలో కనీసం 40 వేల ఎకరాల భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. గిరిజనుల అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు, జగన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న అంశాన్ని ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. డ్వాక్రా రుణాల పేరిట తల్లిని, చెల్లిని, అక్కని కూడా మోసం చేసిన చంద్రబాబు, ఆయన పార్టీ మళ్లీ కావాలా.., నిరుద్యోగులకు కూడా నమ్మించి నిలువునా ముంచేసిన చంద్రబాబు అవసరమా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల కోసం జగన్ సీఎం కాగానే రెండుల లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చారని గుర్తు చేసారు. టీడీపీ గత మోసాలు గుర్తు చేసుకో.. ఫ్యాన్ గుర్తును గుర్తు చేసుకుని జగన్ ను సీఎం మళ్లీ చేసుకోవాలని కోరారు. అన్నదమ్ములారా.. అక్కచెల్లెల్లులారా కలసిరండి.. అనే పాటను పీడిక రాజన్నదొర స్టేజి మీద పాడి వినిపించగా ప్రజల నుంచి విశేష స్పంద లభించింది.
వైయస్ జగన్ సాధికారత జెండాను ఎస్సి,ఎస్టి,మైనారిటీ,బీసీలకు ఇచ్చారు.. ఎగురవేయాల్సిన బాధ్యత మనదే – స్పీకర్ తమ్మినేని
స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. అణగారిన వర్గాలను జగన్ గుర్తించి, గౌవరం ఇవ్వడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారన్నారు. 139 వెనుకబడిన కులాలను గుర్తించి 56 కార్పొరేషన్ లు ఏర్పాటుచేసి నిధులు, విధులు ఇచ్చి ఆత్మాభిమానాన్ని జగన్ పెంచారన్నారు. సాధికారత అనేది పూర్తి కాలేదని, జగన్ ఇప్పుడిప్పుడే ఆరంభం చేసి దీనిని మహా విప్లవమై విస్తరించాల్సి ఉందన్నారు. జగన్ సాధికారత జెండాను వెనుకబడిన వర్గాలకు ఇచ్చారని, దీనికి ఎగురవేయాల్సిన బాధ్యత తమపై ఉందన్న అంశాన్ని ఆయా వర్గాలకు చెందిన ప్రజలు గుర్తించాలని తమ్మినేని కోరారు. రాజ్యాంగంలో వెెనుకబడిన వర్గాలకు అన్ని అంశాలను పొందుపరిచినా ఎవరికీ చేరలేదని, జగన్ ప్రభుత్వంలోనే రాజ్యాధికారం, రాజ్యాంగ పదవులు వచ్చాయన్నారు. పేదరికం విద్యకు, వైద్యానికి, వ్యవసాయానికి అడ్డంకి కారాదని ప్రమాణం చేసిన నాడే సీఎం జగన్ చెప్పారని, దానిని ఆచరణలో కూడా పెట్టి చూపారని వివరించారు. పేదరిక నిర్మూలన చేస్తూ, జీవన ప్రమాణాలు పెంచుతూ జగన్ చేసిన పాలనతో రాష్ట జీడీపీ రెండు అంకెల గణంకాల్లోకి చేరిందని, పేదల ఆర్థిక శక్తి, కొనుగోలు శక్తి కూడా విశేషంగా పేరిగిందన్నారు.
సామాజిక విప్లవంతో సాధికారతను జగన్ సాదించారు – మంత్రి మేరుగ నాగార్జున
మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ, సామాజిక విప్లవం తీసుకురావడం ద్వారా జగన్ సామాజిక సాధికారత సాధించారన్నారు. దేశంలో ఏ రాజకీయకుడు ఆలోచన చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తున్నారని వివరించారు. నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక నిజం మాత్రమే పని చేస్తోందని, అదే జగన్ అని వివరించారు. గతంలో మాయ మాటలతో అబద్ధాలతో పాలన చేసారని, అ అబద్ధమే చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. సీఎంగా ప్రమాణం చేసిన నాడు చంద్రబాబు 5 సంతకాలు చేసాడని, వాటిలో వేటినీ అమలు చేయలేదని, చంద్రబాబు అనే గజదొంగ వెనుకబడిన వర్గాలను మోసం కక్ష తీర్చుకున్నాడని, జగన్ మాత్రం రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు రావాల్సిన రాజ్యాధికారాన్ని అయా వర్గాలకు చేరువ చేసారన్నారు. ఉద్యోగాలు కల్పన, ఇళ్ల మంజూరు, భూమి పంపిణీ చేసినా సరే అణగారిన వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ నిజమైన రాజకీయ నాయకుడు అయితే తెలంగాణలో బర్రెలక్క ఇండిపెండింట్ గా పోటీ చేస్తున్న తరహాలో రాష్ట్రంలో స్వతంత్రంగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం రూపురేఖలు మారిపోనున్నాయన్నారు.
డిసెంబర్ మొదటి వారంలో విశాఖ నుంచే సీఎం వైయస్ జగన్ పాలన – మంత్రి సీదిరి అప్పలరాజు
పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడటానికి ముందు చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ లో అడ్రస్ , ఆధార్ కార్డు కూడా లేదని, హైదరాబాద్ లో ఆయన ఉన్నందున ఆయనకు వినపడేలా జగన్ రావాలి.. జగనే కాావాలి… అంటూ ప్రజలతో కలసి నినదించారు. ఆర్థిక, రాజకీయ అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా, తన కాళ్లపై తాను నిలబడటమే సామాజిక సాదికారతని వివరించారు. రాష్ట్రాన్ని అత్యధికంగా పాలన చేసిన చంద్రబాబు మాట్లాడితే తమది బీసీల పార్టీ అని పదే పదే చెబుతుంటాడని, కానీ స్పీకర్ గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్ ను జగన్ ఎంపిక చేస్తే పోడియం వద్దకు కూడా వెళ్లకుండా చంద్రబాబు అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేసారు. బీసీలను అవమానించిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అనడమే కాకుండా గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అప్పట్లో చంద్రబాబు అవమానపరిచారని, అలాంటి చంద్రబాబు ఎక్కడా… ఎస్సీ, ఎస్టీ, ,మైనారిటీ,బీసీలను నెత్తిన పెట్టుకున్న జగన్ ఎక్కడా… అన్నది ప్రజలు ఆలోచించాలని కోరారు. బాబు హయాంలో ఏ పేదవాడికైనా మేలు జరిగిందా, ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాడా అని ప్రశ్నించారు. కానీ జగన్ హయాంలో అర్హులైన పేదలందరికీ ఇంటికే సంక్షేమ పథకాల లబ్ధి సమకూరుతోందని వివరించారు. జన్మభూమి కమిటీలతో ప్రజలపై బాబు స్వారీ చేయిస్తే, జగన్ సచివాలాయాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే నేరుగా సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన అంశాన్ని ప్రజలు గమనించాలని కోరారు. డిసెంబర్ మొదటి వారంలో సీఎం జగన్ విశాఖ నుంచి పాలన చేయబోతున్నారని, అప్పటి నుంచి విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోందని ప్రకటించారు. కార్యాలాయాల కోసం ప్రభుత్వ భవనాలు కేటాయిస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నయని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలోని టీడీపీ నాయకులు ఇంకా ఎంతకాలం చంద్రబాబుకు బానిసలుగా ఉంటారు.. రండి.. బయటకు రండి వస్తే విశాఖను పరిపాలనా రాజధాని చేసుకుందాం.. అని సీదిరి అప్పలరాజు ఆహ్వానం పలికారు.
అరకు ఎంపీ గొట్టేట మాధవి మాట్లాడుతూ, వెనుకబడిన ప్రాంతాలైన గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా వైయస్సార్ సీపీ పాలన సాగుతోందన్నారు. ప్రతీ ఇంటిలోనూ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారని, అందరికీ మేలు జరిగేలా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని మాధవి వివరించారు.
అన్ని రంగాల్లో అవకాశాలు: పాలకొండ ఎమ్మెల్యే కళావతి
గత ప్రభుత్వాలు అసమర్థ పాలన కారణంగా ఏ వర్గానికి న్యాయం జరగకపోతే, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకబడిన అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తూ సామాజిక సాధికారత సాకారం చేసారన్నారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం సీఎం జగన్ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. నాడు – నేడు ద్వారా స్కూల్స్ ను ఆధునాతన బోధన ద్వారా విద్యార్థులకు సాంకేతిక విజ్జానాన్ని జగన్ అందిస్తున్నారన్నారు. ఆదివాసీలకు హక్కులు కల్పించడంలో సీఎం వైయస్ జగన్ ఎక్కడా రాజీ పడటం లేదని, ఏజెన్సీలో పోడు భూమి పట్టాలివ్వడంతో పాటుగా రైతు భరోసాను కల్పించారన్నారు. వాలంటీరు, సచివాలయ వ్యవస్థల ద్వారా గిరిజన విద్యావంతులైన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి నిరంతరం పాటు పడుతున్న వైయస్ జగన్ ను మళ్లీ సీఎం చేయడానికి అందరూ కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు. పాలకొండ అంటే వెనుకబడిన ప్రాంత నియోజకవర్గం కానే కాదని, జగనన్న పాలనకు దిక్సూచిగా నిలిచేలా రూపుదిద్దుతున్నారన్నారు.