


Best Web Hosting Provider In India 2024
YS Sharmila : ఎర్రబంగారం ఏడిపిస్తోంది.. ప్రభుత్వం మిర్చి రైతుల కళ్లల్లో కారం కొడుతుంది.. షర్మిల ఎమోషనల్ పోస్ట్
YS Sharmila : రాష్ట్రంలో మిర్చి రైతులు కన్నీరు పెడుతున్నారు. ధర లేక దిగులు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఎర్రబంగారం ఏడిపిస్తోందని.. మిర్చి రైతుల కళ్లల్లో కారం కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర రైతులను ఎర్రబంగారం ఏడిపిస్తోందని.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని వ్యాఖ్యానించారు. పెట్టుబడి కూడా రాక అడ్డికి పావుషేరు కింద అమ్ముకుంటూ.. రైతు కన్నీళ్లు పెడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. క్వింటాకు రూ. 15 వేల నష్టంతో అమ్ముకుంటుంటే.. అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం.. మిర్చి రైతుల కళ్లల్లో కారం కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్దతు ధర ప్రకటించాలి..
‘మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఉద్దరించినట్లు కూటమి ప్రభుత్వం గప్పాలు కొడుతుంది. ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెడితే.. వచ్చే ఆదాయం లక్షన్నర లేదని రైతులు కంటతడి పెడుతున్నారు. కౌలు రైతుకు అదనంగా రూ.50 వేలకు నష్టమే అంటూ అల్లాడుతున్నారు. నిజంగా రాష్ట్ర రైతులపై కేంద్రానికి ప్రేమనే ఉంటే.. వెంటనే మిర్చి పంటకు కనీస ధర రూ.26 వేలుగా ప్రకటించాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.
రైతులను ఆదుకోవాలి..
‘నష్టపోతున్న మిర్చి రైతును ఆదుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి వెంటనే అమలు చేయాలి. కేంద్రం ఇచ్చే ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. మిర్చి రైతు విలవిలలాడుతుంటే.. టమాట సాగు చేస్తున్న రైతులకు తీరని కష్టాలు వచ్చి పడ్డాయి. గిట్టుబాటు ధర లేక, కనీసం పెట్టుబడి రాక, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’ అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
ధరలు పడిపోకుండా..
‘ధరలు పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మార్కెట్ లో కేజీ టమాట రూ.15 పలుకుతుంటే.. రైతుకు కిలో మూడు, నాలుగు రూపాయలు కూడా దక్కడం లేదు. ఎకరాకు రెండున్నర లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన చోట 50 వేల మందం కూడా ఆదాయం లేదంటే టమాటా రైతుకు ఎంత అన్యాయం జరుగుతుందో అర్థం అవుతుంది. వెంటనే టమాటా రైతును ఆదుకోవాలని, టమాటా ధరలు పడిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది’ అని షర్మిల పోస్ట్ పెట్టారు.
జగన్ ప్రశ్నలు..
ఇటీవల జగన్ కూడా మిర్చి రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘మిర్చి రైతుల కడగండ్లపై ఈ జనవరిలో ఉద్యాన శాఖ అధికారులు నివేదించిన తర్వాత అయినా మీరేమైనా కనీసం పట్టించుకున్నారా? మిర్చి రైతుల పరిస్థితి అన్యాయంగా ఉందని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నివేదిక ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదు? తప్పుడు రాజకీయాలు చేస్తూ.. మిర్చి కొనుగోళ్లతో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపుకొంటారా? మీ చేతిలో ఉన్న మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయకుండా.. ఎప్పుడూ మిర్చి కొనుగోళ్లు చేయని నాఫెడ్ ద్వారా కొనాలంటూ లేఖ రాయడం రైతులను నిలువునా మోసం చేయడం, మభ్యపెట్టడం కాదా?’ అని జగన్ ప్రశ్నించారు.
టాపిక్