Best Web Hosting Provider In India 2024

ప్రభుత్వం, ఏపీపీఎస్సీల మధ్య సమన్వయ లోపం
చంద్రబాబు, లోకేష్ ల బాధ్యతారహితమైన ప్రకటనలు
అభ్యర్ధుల గొంతు కోసిన కూటమి ప్రభుత్వం
వైయస్ఆర్‌సీపీ పార్టీ రాప్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు ఆగ్రహం
తాడేపల్లి: రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్ధుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పరిష్కరించలేని అసమర్థ సీఎం చంద్రబాబుకు ఆ పదవిలో ఒక్కక్షణం కూడా కొనసాగే అర్హత లేదని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ రోస్టర్ విధానంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం, ఇటు ఏపీపీఎస్సీ బాధ్యతారహితంగా వ్యవహరించాయని మండిపడ్డారు. మరోవైపు అభ్యర్ధుల ఆందోళన లను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు ఇష్టం వచ్చినట్లు వేర్వేరుగా మాట్లాడటం ద్వారా మరింత గందరగోళ పరిస్థితిని సృష్టించారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
గ్రూప్- 2 పరీక్ష విజయవంతంగా నిర్వహించలేక, మోసపు హామీలతో చంద్రబాబు రాష్ట్రంలోని నిరుద్యోగులను చివరి నిమిషం వరకు నమ్మించి మోసం చేశారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిందని చివరి వరకు నిరుద్యోగులను గందరగోళానికి గురిచేశారు. తీరా పరీక్ష నిర్వహిస్తున్నారని తెలియడంతో ఆ నెపాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్ మీదకు నెట్టడం చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనం. ఈ పరీక్ష నిర్వహణపై గందరగోళ వాతావరణం నెలకొని ఉంటే స్పష్టత ఇవ్వాల్సిన ఏపీపీఎస్సీ చైర్మన్ ఎందుకు స్పందించలేదు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులను బిచ్చగాళ్లలా చూస్తోంది. వారి ఆవేదనను కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేదు. కూటమి ప్రభుత్వానికి ఏపీపీఎస్సీకి మధ్య సమన్వయం లేకుండా పనిచేయడంతోనే నిరుద్యోగుల జీవితాలు ఆగమవుతున్నాయి.
నారా లోకేష్ ట్వీట్ తో గంగరదోళం
రాష్ట్రంలో నిరుద్యోగుల కష్టాలు ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. గ్రూప్ – 2 పరీక్ష నిర్వహణపై సరైన నిర్ణయం తీసుకోలేక మూడు వారాలుగా అభ్యర్ధులను మోసపు హామీలతో వంచిస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం ఆఖరుకి చేతులెత్తేసింది. గ్రూప్ -2 అభ్యర్థుల సమస్యపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ తలోమాట మాట్లాడారు. ఏపీపీఎస్సీ సెక్రటరీ ఎక్కడుంటారో తెలియదు, వ్యవస్థల మధ్య సమన్వయం లేదు. చివరికి అంతా కలిసి 92,250 మంది నిరుద్యోగుల గొంతు కోశారు. ఆఖరి నిమిషంలో ఏపీపీఎస్సీ చైర్మన్ తమ మాట వినలేదని ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణం. ఏళ్ళ తరబడి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధుల ఆశలపై నీళ్లు చల్లారు. గ్రూప్- 2 పరీక్షతో విద్యాశాఖ మంత్రికి సంబంధం లేకపోయినా నారా లోకేష్ ఎందుకు ట్వీట్ చేశారో అర్థంకావడం లేదు.
నిరుద్యోగులకు వైయస్ఆర్ సీపీ అండగా ఉంటుంది
చంద్రబాబుకి వ్యవస్థల మీద పట్టు లేదు. ఏపీపీఎస్సీ చైర్మన్ నా మాట వినడం లేదనే దుస్థితికి పడిపోయారు. పరిపాలన చేతకావడం లేదని ఆయన మాటల్లోనే స్పష్టమైంది. గడిచిన ప్రభుత్వాల్లో ఏపీపీఎస్సీ చైర్మన్లు ముఖ్యమంత్రుల మాట వినలేదా? సమావేశాలకు హాజరు కావడం లేదా? స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం లేదని చెప్పడం చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనం. పరీక్ష నిర్వహణ విషయంలో సందిగ్ధ పరిస్ధితులు నెలకొన్న నేపథ్యంలో ఏపీపీఎస్సీ చైర్మన్ మీడియా ముందుకొచ్చి అనుమానాలు నివృత్తి చేయకపోవడం విడ్డూరంగా ఉంది. నిరుద్యోగులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. వారి తరఫున నిలబడి పోరాడుతుంది.