


Best Web Hosting Provider In India 2024

SLBC Tunnel Collapse : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, సహాయక చర్యలకు ఆటంకాలు-రంగంలోకి ఆర్మీ, నేవీ
SLBC Tunnel Collapse : ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కున్న 8 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు 13.5 కిమీ వరకు చేరుకున్నాయి. మరో అరకిలో మీటరు దూరంలో ప్రమాదస్థలి ఉంది. అయితే మట్టి, బురద నీరు సహాయక బృందాలకు అడ్డంకులుగా మారాయి.
SLBC Tunnel Collapse : ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి పలుమార్లు మాట్లాడారు. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు రెండోరోజు నిర్విరామంగా కొనసాగిన సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షించారు.
రంగంలోకి ఆర్మీ, నేవీ
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏజెన్సీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు.
వాటర్ ప్లోటింగ్ సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని, నిరంతరం నీటిని బయటకు తోడేయటంతో పాటు సొరంగంలోనికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. టన్నెల్ లో కూలిన మట్టి దిబ్బలను తొలగించి ప్రమాదం జరిగిన చోటికి చేరుకునే ప్రత్నామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్ పై కప్పు కూలి 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్, హైడ్రా, సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సొరంగంలోని మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. 8 మంది కార్మికులను క్షేమంగా బయటకు తీసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. సొరంగం పైనుంచి లోపలికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
మట్టి, బురద అడ్డంకులు
130 మంది ఎన్డీఆర్‌ఎఫ్, 120 మంది ఎస్డీఆర్‌ఎఫ్, 24 మంది ఆర్మీ, 24 మంది సింగరేణి రెస్క్యూ టీమ్, 24 మంది హైడ్రా సిబ్బంది ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. టన్నెల్ 13.5 కిలోమీటరు వద్ద పైకప్పు కూలింది. దాదాపుగా అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడి నుంచి అర కిలోమీటరు వెళ్లేందుకు మట్టి, నీరు అడ్డంకులుగా మారాయి. హైకెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో ముందుకెళ్లేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నారు.
మరో 50 మీటర్ల బురద దాటితో
టన్నెల్‌లో 14వ కి.మీ వద్ద సుమారు 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తులో బురద పేరుకుపోయింది. ఫిషింగ్ బోట్లు, టైర్లు, చెక్కబల్లలు వేసి బురదను దాటేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నారు. మరో 50 మీటర్ల బురద స్థలాన్ని దాటితేనే ప్రమాద స్థలికి వెళ్లగలమని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఆర్మీ వైద్య బృందాలు కూడా ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 8 మంది బాధితుల ఆచూకీ ఇంకా తెలియలేదని ఎన్డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సుఖేంద్ చెప్పారు. అయితే తమ వారి ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ వారిలో ఆందోళన పెరుగుతోంది.
సంబంధిత కథనం
టాపిక్