జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో శుక్రవారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర జన సునామీని తలపించింది. విజయవాడ రోడ్డులోని వైయస్ఆర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని బలుసుపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలి వద్దకు చేరింది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సామాజిక నినాదం హోరెత్తింది. సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. నాలుగున్నరేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు తమ ఇంటి ముంగిటకే వస్తున్నాయంటూ సామాజిక సాధికార బస్సు యాత్ర వెంట ఉత్సాహంగా కదిలారు.
సమ సమాజ స్థాపనకు పునాది: మంత్రి ధర్మాన ప్రసాదరావు
రాష్ట్రానికి వైయస్ జగన్ సీఎం అయ్యాకే సమ సమాజ స్థాపన జరిగిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా బడుగు, బలహీన, వర్గాలకు మేలు చేసింది జగన్ ఒక్కరేనని స్పష్టం చేశారు. ఆయా వర్గాలకు చెందిన ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని.. దీనికి సీఎం వైయస్ జగన్ దార్శనికతే కారణమని తెలిపారు.
బడుగు, బలహీన వర్గాలకు భరోసా: మంత్రి రజిని
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ ప్రాధాన్యమిస్తూ.. వారికి భరోసా కల్పిస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. శాసనసభలో 17 మంది బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారికి మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు.. అన్ని రకాల పదవుల్లో 60% అవకాశం కల్పించడం ఓ చరిత్రగా చెప్పారు. భావితరాల బంగారు భవిత కోసం జగనన్నకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు జైలుకు పంపితే, జగనన్న పార్లమెంట్‌కు పంపాడు: ఎంపీ నందిగం సురేష్
చేయని తప్పుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తనను జైలుకు పంపితే.. దళితుడనైన తనను దేశ ప్రధాని పక్కన పార్లమెంట్‌లో కూర్చునే గొప్ప అవకాశాన్ని కల్పించిన మహోన్నత వ్యక్తి సీఎం వైయస్ జగన్ అని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదని కోర్టుల ద్వారా చంద్రబాబు పేదల ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.
స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహనరావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, వసంత కృష్ణప్రసాద్, కొలుసు పార్థసారథి, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు.