


Best Web Hosting Provider In India 2024
Bhupalpally Murder Case : రాజలింగమూర్తి హత్య కేసులో బీఆర్ఎస్ నేత.. వరంగల్‌లో కత్తులు కొనుగోలు!
Bhupalpally Murder Case : భూపాలపల్లిలో రాజలింగమూర్తి మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో బీఆర్ఎస్ నేత ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ముగ్గురు పరారీలో ఉన్నారు. మిగతా వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.
భూపాలపల్లిలో మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంత్రుల స్థాయిలో ఈ మర్డర్‌పై రియాక్ట్ అయ్యారు. దీంతో పోలీసులు సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేశారు. నిందితులను అరెస్టు చేశారు. భూమి కోసమే ఈ హత్య చేశారని.. ఏడుగురిని అరెస్టు చేసినట్టు ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు.
ఏం జరిగింది..
భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ముందున్న ఎకరం భూమిపై రాజలింగమూర్తికి, నిందితుల్లో ఏ1గా ఉన్న రేణుకుంట్ల సంజీవ్ కుటుంబానికి మధ్య వివాదం నడుస్తోంది. ఈ ఇష్యూపై కోర్టుకు కూడా వెళ్లారు. కొంత భూమిని రాజలింగమూర్తి తన పేరిట మోసపూరితంగా రాయించుకున్నాడని, ఆయనను హత్య చేస్తేనే.. భూమి దక్కుతుందని సంజీవ్ తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు చెప్పేవాడు.
మూడు నెలల కిందటే ప్లాన్..
ఈ నేపథ్యంలోనే మూడు నెలల కిందటే హత్యకు పథకం రచించాడు సంజీవ్. ఇదే విషయాన్ని బీఆర్ఎస్‌కు చెందిన మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ కొత్త హరిబాబుకు చెప్పాడు. రాజలింగమూర్తిని చంపితే.. కోర్టు ఖర్చులు, మిగతావి తాను చూసుకుంటానని సంజీవ్‌కు భరోసా ఇచ్చాడు. హన్మకొండకు చెందిన లాయర్ సంజీవరెడ్డి చనిపోయినా.. ఆయన భూమి తనకు దక్కకుండా అడ్డొస్తున్నారని రాజలింగమూర్తిపై హరిబాబు కూడా అప్పటికే కక్ష పెంచుకున్నాడు.
వరంగల్‌లో కత్తులు కొనుగోలు..
రెండు నెలల కిందటే సంజీవ్, ఆయన బంధువు మోరే కుమార్ వరంగల్ కాశీబుగ్గ ఏరియాలో రెండు కత్తులు, ఒక ఇనుప రాడ్ కొనుగోలు చేశారు. వాటిని ఇంట్లో పెట్టారు. ఈ నెల 19న ఓ కేసు విషయం గురించి సంజీవ్ జిల్లా కోర్టుకు వచ్చాడు. అప్పుడు రాజలింగమూర్తి కనిపించాడు. దీంతో తన ఇంట్లో దాచిపెట్టిన రెండు కత్తులు, ఇనుపరాడ్‌ను తీసుకున్నాడు.
కాపుకాసి..
సంజీవ్, మోరే కుమార్, కొత్తూరి కిరణ్, పింగిలి శ్రీమంత్ కలిసి రాజలింగమూర్తి ఇంటి సమీపంలో కాపు కాశారు. సాయంత్రం 6.45 గంటల సమయంలో రాజలింగమూర్తి బైక్‌పై ఇంటికి వస్తున్నట్లు.. వారికి దాసరపు కృష్ణ ఫోన్‌లో చెప్పాడు. దీంతో వారు ఎటాక్ చేయడానికి రెడీ అయ్యారు. ఆయన ఇంటి సమీపంలోని టీబీజీకేఎస్ కార్యాలయం ఎదురుగా రోడ్డు మలుపులో రాజలింగమూర్తి బైక్‌ను అడ్డుకుని.. కళ్లలో కారంపొడి చల్లారు. కత్తులు, ఇనుప రాడ్‌తో దాడి చేశారు. చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత ద్విచక్ర వాహనాలపై పారిపోయారు.
హరిబాబుకు ఫోన్ చేసి..
సంజీవ్ తన బంధువు కల్వల శ్రీనివాస్ ఫోన్ తీసుకొని.. హత్య చేసిన విషయాన్ని హరిబాబుకు చెప్పాడు. కేసు దర్యాప్తు చేస్తుండగా.. శనివారం సాయంత్రం కేటీకే 5వ గని చెక్‌పోస్టు దగ్గర ఏడుగురు నిందితులు ఉన్నట్లు సమాచారం అందటంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు.
పరారీలో ముగ్గురు..
భూపాలపల్లి పట్టణానికి చెందిన రేణుకుంట్ల సంజీవ్, మోరే కుమార్, కొత్తూరి కిరణ్, పింగిల్ శ్రీమంత్, రేణుకుంట్ల కొమరయ్య, దాసరపు కృష్ణ, రేణుకుంట్ల సాంబయ్యను పోలీసులు అరెస్టు చేశారు. వీరి అరెస్టు విషయం తెలిసిన బీఆర్ఎస్ నేత హరిబాబు, పుల్ల నరేష్, సురేష్ తప్పించుకున్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు.
టాపిక్