Best Web Hosting Provider In India 2024

శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్
అమరావతి: ప్రజల గొంతుక వినిపించాలంటే అసెంబ్లీలో వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనని పట్టుబట్టారు. ఇవాళ ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం మొదలైన కాసేపటికే వైయస్ఆర్‌సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలు వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, రెడ్‌బుక్ రాజ్యాంగం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. అయినా స్పందన లేకపోవడంతో వైయస్ఆర్‌సీపీ నిరసనకు దిగింది. ఈ క్రమంలో వైయస్ జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరితే ఇటు గవర్నర్ నుంచి, అటు స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. గవర్నర్ ప్రసంగాన్ని వైయస్ఆర్‌సీపీ బాయ్‌కాట్ చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సభలో కోరామన్నారు. ప్రతిపక్షమంటే ప్రజల పక్షమని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గవర్నన్ ప్రసంగంలో డిమాండ్ చేశామన్నారు. సభలో ఉండేది ఒకటి అధికార పక్షం, మరోకటి ప్రతిపక్ష పక్షమన్నారు. ఆ హోదాకు ఎంతో విలువ ఉంటుందని, ప్రజల గొంతుక వినపడాలంటే.. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వా ల్సిందేనని ఖరాకండిగా చెప్పారు. ప్రజలు, రైతుల కష్టాలు చెప్పాలంటే ప్రతిపక్షం ఉండాల్సిందే అన్నారు. అందుకే వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించామన్నారు.
ప్రభుత్వ చొక్కా పట్టుకుంటాం
రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతుల బాధలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు. కేంద్రంతో మాట్లాడుతున్నాం.. ప్రయత్నిస్తున్నాం అని మాత్రమే చంద్రబాబు చెబుతున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. మిర్చికి వెంటనే మద్ధతు ధర ప్రకటించాలని మేం రైతుల తరఫున పోరాడితే కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు. రైతుల సమస్యలకు ఎన్నికల కోడ్ అడ్డొస్తుందని, మ్యూజికల్ నైట్ లకు ఎన్నికల కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు. కూటమి గ్యారెంటీ అంటేనే మోసం అని అర్థం అవుతుందన్నారు. తొమ్మది నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీల అమలు నోచుకోలేదన్నారు. అందుకే ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని, ప్రభుత్వ చొక్కా పట్టుకుంటామని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.