



Best Web Hosting Provider In India 2024

Egg Pulao: అన్నం మిగిలిపోతే ఐదు నిమిషాల్లో ఇలా ఎగ్ పులావ్ చేసేయండి, రుచి అదిరిపోతుంది
Egg Pulao: ఎగ్ పులావ్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. దీన్ని వండడానికి పెద్దగా ఎక్కువ సమయం అవసరం లేదు. కేవలం ఐదు నిమిషాల్లో వండుకోవచ్చు. రెసిపీ తెలుసుకోండి.
ఎగ్ పులావ్ వండాలంటే ఎక్కువ సమయం పడుతుందని అనుకుంటారు. నిజానికి అన్నం వండి రెడీగా ఉంటే ఐదు నిమిషాల్లో ఎగ్ పులావ్ రెడీ అయిపోతుంది. మిగిలిపోయిన అన్నంతో కూడా ఎగ్ పులావ్ ను చేసుకోవచ్చు. ఇక్కడ మేము బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు సింపుల్ గా ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలో ఇచ్చాము. ఇది చేయడానికి ఐదు నిమిషాల సమయం చాలు… ముందుగానే అన్నం ఉండి పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇక రెసిపీ తెలుసుకోండి.
ఎగ్ పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
కోడిగుడ్లు – నాలుగు
కసూరి మేతి – అర స్పూను
పసుపు – అర స్పూను
కారం – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – రెండు స్పూన్లు
నెయ్యి – అర స్పూను
బిర్యానీ ఆకు – రెండు
లవంగాలు – మూడు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
అనాస పువ్వు – ఒకటి
యాలకులు – రెండు
ఉల్లిపాయలు – ఒకటి
పచ్చిమిర్చి – మూడు
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
టమోటాలు – రెండు
మరాఠీ మొగ్గ – ఒకటి
షాజీరా – ఒక స్పూను
గరం మసాలా – అర స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
జీలకర్ర పొడి – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
నిమ్మకాయ రసం – ఒక స్పూను
ఎగ్ పులావ్ రెసిపీ
1. ఎగ్ పులావ్ చేసేందుకు కోడిగుడ్లను ముందుగానే ఉడకబెట్టుకోవాలి.
2. అలాగే అన్నాన్ని కూడా ముందుగానే వండి పక్కన పెట్టుకోవాలి.
3. కోడిగుడ్డు మీద పొట్టును తీసి ఒక గిన్నెలో వేయాలి.
4. కోడిగుడ్లకు నాలుగు వైపులా చిన్న చిన్నగా గాట్లు పెట్టుకోవాలి.
5. ఇప్పుడు అందులో పసుపు, కారం, కసూరి మేతి, రెండు చుక్కల ఆయిల్ వేసి గుడ్లను కలుపుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అర స్పూను నూనె వేయాలి.
7. అందులో ఈ గుడ్లను వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.
8. ఇప్పుడు మరొక రెండు స్పూన్ల నూనె వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, షాజీరా, మరాఠీ మొగ్గ, అనాసపువ్వు వేసి వేయించుకోవాలి.
9. అవి వేగాక ఉల్లిపాయలు తరిగి వేయాలి. అలాగే పచ్చిమిర్చి నిలువుగా తరిగి వేసి వేయించుకోవాలి.
10. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
11. సన్నగా తరిగిన టమోటాలను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
12. ఈ మొత్తం మిశ్రమం బాగా ఇగురులాగా అయ్యేలా చూసుకోవాలి.
13. అందులో ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి.
14. ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను కూడా అందులో వేయాలి.
15. కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి.
16. అంతే టేస్టీ ఎగ్ పులావ్ రెడీ అయినట్టే. ఇది అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి.
గుడ్డుని అన్నం రెడీగా ఉంటే ఐదు నిమిషాల్లో సిద్ధమైపోతుంది. పైగా రుచిగా కూడా ఉంటుంది. మీకు పుదీనా తరుగును కూడా వేసుకుంటే రుచి రెట్టింపు అవుతుంది.
బ్యాచిలర్స్‌కి ఈ ఎగ్ పులావ్ రెసిపీ సులువుగా అర్థమవుతుంది. వారు ఈజీగా చేసుకోవచ్చు. అలాగే వంటరాని వారు కూడా ఇక్కడ చెప్పిన పద్ధతిలో ఎగ్ పులావ్ చేస్తే త్వరగా సిద్ధమైపోతుంది. పైగా టేస్ట్ కూడా బాగుంటుంది. మిగిలిన అన్నం పడేయకుండా ఇలా అప్పుడప్పుడు ఎగ్ పులావ్ చేసుకుని చూడండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది.
సంబంధిత కథనం