Best Web Hosting Provider In India 2024

వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
అమరావతి: అసెంబ్లీలో అధికార పక్షానికి వైయస్ఆర్‌సీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదా అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. మీరు చేసే దోపిడీని భయటపెడతామని భయపడుతున్నారా? మా ప్రశ్నలకు అధికారపక్షానికి సమాధానం చెప్పే సత్తా లేదా అని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాల నుంచి బాయ్‌కట్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సభలో 11 మంది ఎమ్మెల్యేలను ఎదురుకోలేమనే భయం కూటమి సర్కార్‌లో ఉందన్నారు. రాష్ట్రంలో పరిపాలన గాలికి ఒదిలేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీకి ప్రజలు 41 శాతం ఓట్లు వేశారని, ప్రతిపక్షం అంటే మేమే కదా అని సూటిగా ప్రశ్నించారు. కేవలం 6 శాతం ఓట్లు వచ్చిన వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇచ్చి పక్కన పెట్టుకున్నారని ఆక్షేపించారు.
రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని ప్రశ్నిస్తారనే భయంతోనే వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండాలన్నారు. రాష్ట్రంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు, రైతుల సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్షం ఉండాలన్నారు. గవర్నర్ ప్రతిపక్షం ఉండాలి అనే అంశాన్ని గుర్తించాలని కోరారు. అసెంబ్లీ లో మాట్లాడిన విలువ..బయట మాట్లాడితే ఉండదని చెప్పే కూటమి వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా పద్దుల కమిటీ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అధికార పార్టీ నేతలే అనుమభవిస్తున్నారని తప్పుపట్టారు. అసెంబ్లీ సమావేశాల కవరేజ్‌కు సాక్షి, టీవీ9, ఎన్‌టీవీ సహా పలు ఛానెల్స్‌పై కూటమి ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎమ్మెల్యే చంద్రశేఖర్ తీవ్రంగా తప్పుబట్టారు.