Best Web Hosting Provider In India 2024

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వైయస్ జగన్ పిలుపు
తాడేపల్లి:క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటికి వచ్చిన తర్వాత సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘మనం యుద్ధ రంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలి. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలి. నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి.
ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టే. అందుకనే ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నాను, అండగా ఉంటా. ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. పార్టీకోసం, ప్రజలకోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లుమూసుకుని, తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత ముందుగా వస్తాయి.
అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరఫున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్టపరిస్థితులను అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం.
ప్రతిపక్షహోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడితో దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతాను. అసెంబ్లీలో ఎలాగూ అవకాశం లేదు కాబట్టి ప్రెస్‌మీట్లలో ప్రజలకు వివరిస్తున్నాను. కౌన్సిల్‌లో మంచి మెజార్టీ ఉంది. దీన్ని వినియోగించుకోవాలి’ అని వైయస్ జగన్ సూచించారు.
అన్యాయంగా ఇళ్లపట్టాలు రద్దు చేస్తున్నారు: వైయస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
మన ప్రభుత్వ హయాంలో 31 లక్షలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని వైయస్ జగన్ అన్నారు. ‘పార్టీలు చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్లపట్టాలు ఇచ్చాం, ఎవరైనా ఇళ్లుకట్టుకోకపోతే ప్రభుత్వం వారికి ఇళ్లు మంజూరుచేసి ఇవ్వాలి. అంతేగాని, పేదలపై కక్ష కట్టి పట్టాలు రద్దుచేయడం ఏంటి? పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం.
ఎవరు ఇళ్లస్థలాలు ఇచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు. విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనాన్ని మనం నిర్మించాం. కాని పేరు తీసేయాలన్న ఉద్దేశంతో ఏకంగా అంబేద్కర్ విగ్రహం మీదే దాడికి దిగారు. ప్రభుత్వం ఆదేశాలతో ఏకంగా అధికారులే దీనికి ఒడిగట్టారు. స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా?’ అని వైయస్ జగన్ ప్రశ్నించారు.