



Best Web Hosting Provider In India 2024

AP Adhaar Camps : గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు- ఫిబ్రవరి 28 వరకు ఆరేళ్ల చిన్నారులకు ఆధార్ నమోదు
AP Aadhaar Camps : ఏపీలో చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 28 వరకు ఆధార్ క్యాంప్ లు నిర్వహిస్తు్న్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ పేర్కొంది. ఈ క్యాంప్ లలో ఆరేళ్లలోపు చిన్నారులకు కొత్తగా ఆధార్ నమోదు, పాతవాటి అప్‌డేట్ వీలుగా ఏర్పాట్లు చేశారు.
AP Aadhaar Camps : రాష్ట్రంలో చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 28 వరకు క్యాంప్‌లు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే అవసరమైన చోట మొబైల్ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 0-6 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు ఆధార్ నమోదు చేసేందుకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది.
ఆరేళ్లలోపు చిన్నారులకు ఆధార్
తప్పనిసరిగా చిన్నారులకు ఆధార్ నమోదయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరేళ్లలోపు చిన్నారుల పేర్లతో కొత్తగా ఆధార్ నమోదు, పాతవాటి అప్‌డేట్ వీలుగా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరేళ్లలోపు ఉన్న మందితో ఆధార్ నమోదు చేయాల్సి ఉందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,65,264 మంది చిన్నారులు ఉండగా, అందులో నేటికీ 8,53,486 మంది చిన్నారులు ఆధార్ నమోదు చేసుకోలేదు.
ఇప్పుడు నిర్వహించిన ఆధార్ క్యాంపుల్లో వీరందరికీ ఆధార్ నమోదు చేయించి తీరాలని ఆదేశించారు. ఇప్పటికే కలెక్టర్లు కూడా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవో)కి ఆదేశాలను పంపించారు. మండలంలోని ఉన్న చిన్నారులు ఎంతమంది? అందులో ఎంత మంది చిన్నారులు ఆధార్ నమోదు చేసుకోలేదని సమాచారం తయారు చేయాలని కలెక్టర్లు ఆదేశించారు. దీంతో ఎంపీడీవోలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా, అలాగే సచివాలయాల ద్వారా డేటాను సేకరించి, ప్రత్యేక క్యాంపులు ఎక్కడెక్కడ నిర్వహించాలనేదానిపై ప్రణాళిక రూపొందించారు. అందుకునుగుణంగా నేటీ నుంచి ఆధార్ క్యాంపులు జరగనున్నాయి.
ఫిబ్రవరి 28 వరకు
ఈ ఆధార్ ప్రత్యేక క్యాంపులను గ్రామ, వార్డు సచివాలయ డిపార్ట్‌మెంట్, ఆధార్ ఆపరేటర్స్ సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఎం. శివప్రసాద్, అన్ని జిల్లాల కలెక్టర్లకు, గ్రామ, వార్డు సచివాలయ జిల్లా ఇన్‌ఛార్జ్‌లకు లేఖ రాశారు. సచివాలయాలు, అంగన్‌వాడీ సెంటర్లు, పోస్టు ఆఫీస్, సీఎస్‌సీ తదితర వాటితో పాటు మొబైల్ ఆధార్ క్యాంపులను ఫిబ్రవరి 28 వరకు నాలుగు రోజుల పాటు ఆధార్ ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించాలని ఆదేశించారు.
మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు (ఎంపీడీవో)లు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే అంగన్ వాడీ వర్కర్లు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు, సీడీపీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తల్లిదండ్రులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఆధార్ కార్డులు లేని పిల్లలందరికీ నూరు శాతం కొత్త ఆధార్ కార్డుల నమోదుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యమైన అంశాలు
1. చిన్నారులకు ఆధార్ నమోదుకు క్యూర్ కోడ్ ఉన్న పుట్టిన తేదీ సర్టిఫికేట్.
2. దరఖాస్తు ఫారం ఉండాలి.
3. బిడ్డను తల్లి లేదా తండ్రి మాత్రమే ఆధార్ క్యాంప్‌కు తీసుకెళ్లాలి.
4. వేరెవ్వరూ తీసుకెళ్లాడానికి లేదు.
5. బిడ్డను ఆధార్ సెంటర్‌కు తీసుకెళ్లే వారి (తల్లి లేదా తండ్రి) ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
6. చిన్నారుల ఆధార్ నమోదుకు ఎటువంటి రుసుము లేదు. ఉచితమే.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
టాపిక్