


Best Web Hosting Provider In India 2024

Jayashankar Bhupalpally Crime : బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య, గోనె సంచిలో కుక్కి బావిలో పడేసిన దుండగులు
Jayashankar Bhupalpally Crime : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వృద్ధురాలిని అతిదారుణంగా హత్య చేశారు. ఒంటిమీద బంగారం చోరీ చేసి వృద్ధురాలి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి, బావిలో పడేశారు.
Jayashankar Bhupalpally Crime : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలి మెడలోని బంగారం కోసం గుర్తు తెలియని దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్న అనంతరం వృద్ధురాలి చేతులు కట్టేసి, గోనె సంచిలో కుక్కి బావిలో పడేసి హత్య చేశారు. జిల్లాలోని టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి శివారు బోయినపల్లిలో ఈ దారుణ ఘటన జరగగా.. సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సొరపాక వీరమ్మ(70)కు నలుగురు కొడుకులు సంతానం కాగా.. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వీరమ్మ వేరుగా ఉంటోంది. కాగా ఉపాధి కోసం గ్రామంలోని చింత చెట్ల వద్ద చింతకాయలు ఏరుకుని, ఆ చింతపండును సమీపంలోని గర్మిళ్లపల్లిలో అమ్ముకునేది.
ఐదు రోజుల కిందటే హతం
చింతపండు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వీరమ్మ.. రోజువారీలాగే దాదాపు ఐదు రోజుల కిందట ఈ నెల 19న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తాను సేకరించిన చింతపండును గర్మిళ్లపల్లిలో అమ్మేందుకు వెళ్లింది. కానీ సాయంత్రమైనా ఇంటికి చేరుకోలేదు. రాత్రి 9 గంటలు దాటినా వీరమ్మ ఇంటికి రాకపోవడంతో కొడుకులు, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ మాత్రం దొరకలేదు.
హత్య చేసి.. గోనె సంచిలో కుక్కి
దాదాపు ఐదు రోజులుగా వీరమ్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇళ్లను కూడా ఆరా తీశారు. కానీ ఎలాంటి సమాచారం దొరకలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సమయంలో బోయినపల్లి శివారులోని ఓ వ్యవసాయ బావిలో డెడ్ బాడీ ఉన్నట్టుగా గ్రామానికి చెందిన వ్యక్తులు గమనించి, వీరమ్మ కొడుకులకు సమాచారం చేరవేశారు. దీంతో కనిపించకుండా పోయిన ఐదు రోజుల తరువాత వీరమ్మ వ్యవసాయ బావిలో శవమై పడి ఉండటంతో వాళ్లంతా షాక్ అయ్యారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
వ్యవసాయ బావిలో డెడ్ బాడీ పడి ఉన్న తీరును చూసి కంగు తిన్నారు. వీరమ్మ డెడ్ బాడీ ఓ గోనె సంచిలో కుక్కినట్టు ఉండగా, అది చూసి అక్కడున్న వాళ్లంతా నివ్వెరపోయారు. కాగా వీరమ్మ ఒంటి మీద రెండు తులాల బంగారం, 30 తులాల వరకు వెండి కడియాలు ఉండాల్సినప్పటికీ అవి కనిపించలేదు. దీంతో నగల కోసమే వీరమ్మను హతమార్చినట్లు తెలుస్తోంది. వృద్ధురాలు చనిపోయిన తరువాత గోనె సంచిలో కుక్కి వ్యవసాయ బావిలో పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యేక బృందాలతో దర్యాప్తు
వీరమ్మను కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒంటిపై నగలు దోచుకున్న దుండగులు వృద్ధురాలిని గోనె సంచిలో కుక్కి వ్యవసాయ బావిలో పడేయగా, ఇదంతా స్థానికుల పనేననే సందేహాలు వినిపిస్తున్నాయి. కాగా మృతురాలు వీరమ్మ పెద్ద కొడుకు రాజయ్య ఫిర్యాదు మేరకు టేకుమట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. సాధ్యమైనంత తొందర్లోనే నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్