


Best Web Hosting Provider In India 2024

Pedakakani Tragedy : పెదకాకానిలో తీవ్ర విషాదం, విద్యుత్ షాక్ తో నలుగురు మృతి
Pedakakani Tragedy : గుంటూరు జిల్లా పెదకాకానిలో తీవ్ర విషాదం నెలకొంది. గోశాలలో సంపు శుభ్రం చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ కొట్టి నలుగురు కార్మికులు మృతి చెందారు.
Pedakakani Tragedy : గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో నలుగురు మృత్యువాత పడ్డారు. పెదకాకాని కాలీ ఆశ్రమంలో విద్యుత్ షాక్ తో నలుగురు కార్మికులు మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు తెనాలికి చెందిన వారుకాగా, మరొకరు దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు….మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. నలుగురి మృతదేహాలను గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందోనని పెదకాకాని పోలీసులు, ఎలక్ట్రికల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
గోశాలలో నలుగురు చనిపోయిన సంపులను ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. “గోశాలలో 70 ఆవులున్నాయి. వాటి మూత్రం, పేడను ఓ సుంపులో డంప్ చేస్తున్నారు. ఈ సంపును రోజూ శుభ్రం చేస్తారు. అయితే సోమవారం సంపును శుభ్రపరుస్తు్న్న సమయంలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు కార్మికులు చనిపోయారు. ఒకరిని కాపాడే క్రమంలో మరొకరు వెళ్లి..ఇలా నలుగురు మరణించారు” అని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి
గుంటూరు జిల్లా పెదకాకాని విద్యుదాఘాతం ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన నలుగురు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాద ఘటన పై స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో పాటు స్థానిక అధికారులతో కూడా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవి హామీ ఇచ్చారు.
కరెంట్ కు సంబంధించిన పనులు చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్త వహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ముందస్తుగా స్థానికంగా ఉండే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అధికారులకు సరైన సమయంలో సమాచారం అందించడం కారణంగా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్