



Best Web Hosting Provider In India 2024

Sundeep Kishan: తమిళ ఇండస్ట్రీ నుంచి రూ.1,000 కోట్ల సినిమా అదే అవుతుంది!: సందీప్ కిషన్
Sundeep Kishan: మజాకా సక్సెస్ మీట్‍లో హీరో సందీప్ కిషన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ తమిళ చిత్రం గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది. రూ.1000కోట్ల కలెక్షన్ల ప్రస్తావన వచ్చింది. దీనికి సందీప్ స్పందించారు.
తమిళ సినీ ఇండస్ట్రీ కోలీవుడ్‍కు ఇంకా రూ.1000కోట్ల కలెక్షన్ల మూవీ కల నెరవేరలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నాలుగు చిత్రాలు ఇప్పటికే ఆ మార్క్ దాటేశాయి. కన్నడలోనూ కేజీఎఫ్ 2 ఈ మైల్‍స్టోన్ సాధించింది. కోలీవుడ్ మాత్రం వేచిచూస్తోంది. అయితే, రూ.1000 కోట్లు సాధించే తొలి మూవీగా నిలిచే సత్తా ఉన్న చిత్రమేదో తెలుగు హీరో సందీప్ కిషన్ తాజాగా అంచనా వేశారు. సందీప్ హీరోగా నటించిన తెలుగు మూవీ మజాకా బుధవారం విడుదల కాగా.. నేడు గురువారం (ఫిబ్రవరి 27) సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా ఓ తమిళ భారీ చిత్రంపై వచ్చిన ఓ ప్రశ్నకు సందీప్ రియాక్ట్ అయ్యారు.
కూలీ ఈ మార్క్ సాధిస్తుంది
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా రూ.1000కోట్ల మార్క్ సాధిస్తుందని సందీప్ కిషన్ అన్నారు. తన ఫ్రెండ్ లోకేశ్ రూపొందిస్తున్న కూలీ షూటింగ్ సెట్స్‌కు తాను వెళ్లానని, కానీ ఆ చిత్రంలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు.
45 నిమిషాలు చూశా..
తమిళ ఇండస్ట్రీలో రూ.1000 కోట్లు వస్తుందా అని కూలీ చిత్రాన్ని ఉద్దేశించి ఓ ప్రశ్న సందీప్ కిషన్‍కు ఎదురైంది. కూలీ చిత్రానికి ఆ మార్క్ తప్పకుండా వస్తుందని సందీప్ అన్నారు. “కూలీలో ఇంచుమించు 45 నిమిషాలు చూశాను. తప్పకుండా వస్తుంది” అని చెప్పారు. కూలీ చిత్రంలో తాను లేనని, లోకేశ్ తన ఫ్రెండ్ కాబట్టి షూటింగ్ స్పాట్‍కు వెళ్లానని చెప్పారు.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తాను ఓ చిత్రం చేస్తున్నానని సందీప్ కిషన్ తెలిపారు. అయితే, లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‍సీయూ)లో ఆ మూవీ భాగంగా ఉంటుందా.. లేదా అనేది ఇప్పుడు తెలియదని తెలిపారు.
రజినీకాంత్ హీరోగా యాక్షన్ మూవీగా కూలీ చిత్రాన్ని లోకేశ్ తెరకెక్కిస్తున్నారు. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్ యాక్టర్స్ కీలకపాత్రలు చేస్తున్నారు. శృతి హాసన్, మోనికా రెబ్బా జాన్, సత్యరాజ్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ క్యామిలీ రోల్‍లో కనిపించనున్నారు. హీరోయిన్ పూజా హెగ్డే.. ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన మజాకా చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటించగా.. రావు రమేశ్ మరో ప్రధాన పాత్ర పోషించారు. రితూ వర్మ, అన్షు ఫీమేల్ లీడ్ రోల్స్ చేశారు. ఈ కామెడీ డ్రామా మూవీ ఫస్ట్ డే సుమారు రూ.3కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. మోస్తరు ఓపెనింగ్ దక్కించుకుంది. మజాకా చిత్రాన్ని హాస్య మూవీస్, ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్, జీ స్టూడియోస్ బ్యానర్లు నిర్మించాయి.
సంబంధిత కథనం