



Best Web Hosting Provider In India 2024

Tirumala : మార్చి 9 నుంచి తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు – ఈ తేదీల్లో పలు సేవలు రద్దు
Tirumala Srivari Theppotsavam 2025: తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు టీటీడీ వివరాలను పేర్కొంది. మార్చి 13వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తెప్పోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో ఆదేశించారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ ప్రకటన చేసింది. మార్చి 9నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య తెప్పోత్సవాలు జరగనున్నాయి. పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
శ్రీవారి ఆలయ పుష్కరిణిలో నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ… భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తెప్పోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
- తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 9వ తేదీన శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు.
- రెండవ రోజు మార్చి 10న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు.
- మూడవరోజు మార్చి 11న శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు.
- నాలుగో రోజు మార్చి 12న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 13వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
- రాత్రి 7 నుండి 8 గంటల మధ్య తెప్పోత్సవాలు జరగనున్నాయి.
ఆర్జిత సేవలు రద్దు….
శ్రీవారి తెప్పోత్సవాల కారణంగా టీటీడీ కీలక ప్రకటన చేసింది. మార్చి 9, 10వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది.
వేసవి ఏర్పాట్లపై ముందస్తు చర్యలు:
తిరుమల శ్రీవారి దర్శనార్థం వేసవిలో విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం వేసవి సెలవుల యాత్రికుల రద్దీకి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ…. మొదటి ఘాట్ రోడ్డులోని అక్కగార్ల గుడి, శ్రీవారి సేవా సదన్, తిరుమలలో భక్తుల రద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవిలో యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.
యాత్రికుల అవసరాలను తీర్చడానికి తగినంత లడ్డూల బఫర్ స్టాక్‌ను ఉంచాలని ఆలయ అధికారులకు సూచించారు. యాత్రికుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను తగినంత నిల్వ ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. రాబోవు వేసవిలో తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
సంబంధిత కథనం
టాపిక్