


Best Web Hosting Provider In India 2024
SLBC Rescue Operation : ఆపరేషన్ వేగవంతం.. గల్లంతైన కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు
SLBC Rescue Operation : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తున్నాయి. ఇప్పటివరకు సొరంగం లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు. మరోవైపు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారు. అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేశారు. ఏడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్యాస్ కట్టర్‌తో బోరింగ్ మెషీన్ శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. బురద, మట్టిని లోకో డబ్బాల్లో నింపి.. బయటకు పంపిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. భారీ మోటార్లతో టన్నెల్ నుంచి సీపేజ్ వాటర్ పంపింగ్ చేస్తున్నారు. గల్లంతైన కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
రంగంలోకి రైల్వే శాఖ..
టీబీఎం శిథిలాలను తొలగించేందుకు రైల్వేశాఖ రంగంలోకి దిగింది. ప్రత్యేక నిపుణులతో రెండు బృందాలను నియమించింది. మొదటి బృందం గురువారమే స్థలానికి చేరుకుంది. డివిజినల్ మెకానికల్ ఇంజినీరు ఎస్.మురళి నేతృత్వంలో.. సికింద్రాబాద్, లాలాగూడ, రాయనపాడు వర్క్‌షాప్‌ల నుంచి ఒక సెక్షన్ ఇంజినీర్, 13 మంది వెల్డర్లు, ఇద్దరు టెక్నీషియన్లు ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో సహాయ చర్యలు చేపట్టారు. ఇవాళ రెండో బృందం వెళ్లనుంది. దీంతో సహాయక చర్యలు మరింత వేగవంతం కానున్నాయి.
మరింత భద్రత..
సహాయక చర్యలకు ఆటంకాలు కలగకుండా.. ఇతరులు ఎవరూ టన్నెల్ వద్దకు రాకుండా పోలీసులు భద్రత పెంచారు. దోమలపెంట అటవీశాఖ చెక్‌పోస్టు నుంచి టన్నెల్‌కు వెళ్లే ప్రధాన రహదారి వద్ద, జేపీ కార్యాలయం వద్ద, టన్నెల్‌కు వెళ్లే దారి వద్ద పోలీసుల్ని మోహరించారు. వాహనాలను లోనికి అనుమతించడం లేదు. మాజీ మంత్రి హరీష్ రావు ఇతర నేతలు భారీ వాహనశ్రేణితో వచ్చినా.. గేటు వద్దే అడ్డుకున్నారు. మీడియాను కూడా టన్నెల్ వద్దకు అనుమతించడం లేదు.
ఉత్తమ్ నిత్యం..
టన్నెల్‌లో జరుగుతున్న సహాయచర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిత్యం సమీక్షిస్తున్నారు. గల్లంతైన కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, వ్యయానికి వెనకాడవద్దని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సొరంగానికి పక్క నుంచి మరో మార్గం తవ్వే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్లు మంత్రి ఉత్తమ్ వివరించారు. అయితే.. మరో మార్గాన్ని తవ్వితే.. కూలే ప్రమాదం ఉందని నిపుణులు చెప్పినట్టు తెలిసింది.
మరో 48 గంటల్లో..
48 గంటల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముందని మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు. కాంగ్రెస్ హయాంలోనే నల్గొండ నుంచి ఎస్‌ఎల్‌బీసీలో 25 కి.మీ. మార్గాన్ని పూర్తి చేశామని చెప్పారు. శ్రీశైలం నుంచి సొరంగం తవ్వేందుకు అటవీశాఖ నుంచి అనుమతి కోసం 2009 వరకు ఆగామని.. అప్పట్లో వరద ఉద్ధృతి కావడంతో పనులు నిలిచిపోయాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో 9 కి.మీ. సొరంగ మార్గాన్ని తవ్వలేకపోయారని విమర్శించారు.
టాపిక్